గణితశాస్త్ర స్నేహితుడు
సంక్షిప్తంగా... శ్రీనివాస రామానుజన్
త్రీ ఇడియెట్స్ ఆధారంగా వచ్చిన తెలుగు డబ్బింగ్ చిత్రం ‘స్నేహితుడు’లో పంచభట్ల సారంగపాణి అనే కుర్రాడు ఉంటాడు. బ్రిలియెంట్! బట్టీ పట్టడు. బుర్రకు పట్టించుకుంటాడు. పుస్తకాల్లోని ఈ సిద్ధాంతాలు, నిర్వచనాలు చదువును తేలికపరచాలి కానీ విద్యార్థుల్ని జడిపించి భారంగా నడిపించకూడదంటాడు! స్టూడెంటుగా సరిగ్గా అలాంటి వాడే శ్రీనివాస రామానుజన్. చిన్నప్పుడు వాళ్ల ఇల్లు కుంభకోణంలోని సారంగపాణి వీధిలో ఉండేది. పెంకుటింట్లో నివాసం. ఇప్పుడది రామానుజన్ మ్యూజియం.
రామానుజన్ తల్లి గుడిలో పాటలు పాడేవారు. తండ్రి చీరల దుకాణంలో గుమస్తా. రామానుజానికి ఆయన దగ్గర చనువు లేదు. అందుకే అస్తమానం తల్లి చుట్టూ తిరిగేవాడు. ఆవిడే అన్నీ నేర్పేవారు. మంచీమర్యాద, పూజాపునస్కారం. ఇవన్నీ ఉండేవి కానీ సరైన తిండే ఉండేది కాదు. పేదరికం. పదేళ్ల వయసుకే రామానుజానికి తమిళం, ఆంగ్లం, గణితం, భూగోళశాస్త్రం పరిచయం అయ్యాయి. అయితే అతడు పూర్తిగా గణితం మాయలో పడిపోయింది మాత్రం ప్రాథమికోన్నత పాఠశాలలో.
శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్‌లో 1887లో జన్మించారు. పద్నాలుగవ యేట గణితంలో అతడికి ఆసక్తి మొదలైంది. పాశ్చాత్య గణిత పండితులు యూలర్, జార్జి షూబ్రిడ్జ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు కొత్త గణిత లోకాలకు శ్రీనివాసన్ కోసం దారులు పరిచాయి. అలా రామానుజన్ తనకు తానుగా 6,165 గణిత సూత్రాలను కనుక్కున్నారు.
అతడికి వచ్చే సందేహాలను తీర్చే పుస్తకాలు అందుబాటులో లేకపోవడమే అతడి గణితప్రావీణ్యానికి కారణం అయింది! త్రికోణమితులు, బీజగణిత శ్రేణుల విశ్లేషణలో రామానుజన్ అన్ని పరిమితులను దాటుకుని ముందుకు వెళ్లారు. వివాహం అయ్యాక (1909) కూడా రామానుజన్ చిన్నా చితక ఉద్యోగాలు చూస్తూనే, గణితశాస్త్ర పరిశోధనలను కొనసాగించారు. ఆ క్రమంలోనే 1914లో కేంబ్రిడ్జ్ వెళ్లారు.
భిన్నాలు, రేఖాగణిత సూత్రాల విశ్లేషణలకు తనను తను ఒక రఫ్‌బుక్‌గా మార్చుకుని గణితంలో ముప్ఫై రెండు పరిశోధనా పత్రాలు సమర్పించారు! ‘‘ఆయన ప్రతిభను కనుక ప్రపంచం మరి కాస్త ముందుగా గుర్తించినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గణిత మేధావిగా రామానుజన్ చరిత్రలో నిలిచిపోయేవారు’’ అని ఆంగ్ల గణితశాస్త్ర వేత్త జి.హెచ్.హార్డీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. 1918లో రామానుజన్ కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజ్‌లో, రాయల్ సొసైటీలో ఫెలోషెప్‌కి ఎంపికయ్యారు. ఆ తర్వాతి ఏడాది ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.
ఇండియా తిరిగి వచ్చేశారు. ముప్ఫై రెండేళ్ల వయసులో 1920 ఏప్రిల్ 26న ఆయన మరణించారు. రామానుజన్ ప్రతిపాదించిన కొన్ని అంశాలు ఇప్పటికీ పరిష్కారం కానట్లే, అంత చిన్న వయసులో దేవుడు ఆయన్ని తీసుకెళ్లడం గణితశాస్త్ర ప్రేమికులు ఎప్పటికీ జీర్ణించుకోలేని విధి వైపరీత్యం. రామానుజన్ శుద్ధ శాకాహారి.
లండన్‌లో ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాంసాహారం తప్ప సరైన శాకాహార భోజనం దొరక్క రామానుజన్ పౌష్టికాహార లోపానికి గురయ్యారు. అదే ఆయన మరణానికి కారణమైంది. రామానుజన్ 125వ జన్మదినం సందర్భంగా భారత ప్రభుత్వం డిసెంబర్ 22ను ‘నేషనల్ మేథమెటిక్స్ డే’గా ప్రకటించడం ద్వారా ఆయన కృషిని, పరిశోధనలను గౌరవించుకుంది.