Srinivasa Ramanujan
-
జానకి అమ్మాళ్..టైలర్‌గా బతికిన గణిత మేధావి భార్య
శ్రీనివాస రామానుజన్ దేశం గర్వించే గణిత మేధావి. గణితంలో శేషం రాబట్టడం ముఖ్యం. కుడి చెవిలో అంకె ఎడమ చెవిలో అంకె ఇవే తెలుస్తుంటాయి. కాని ఆ లెక్కలు చేసే చేతులకు ఒక గుండె కావాలి. ఆ గుండె జానకి అమ్మాళ్. శ్రీనివాస రామానుజన్‌ను వివాహం చేసుకుని ఆమె ఎలాంటి జీవితం గడిపింది. భర్త ప్రేమ పొందిందా? 32 సంవత్సరాలకే భర్త మరణిస్తే ఆమె జీవితం ఎలా గడిచింది? మేధావులు లోకానికి తెలిసినట్టుగా వారి భార్యలు తెలియరు. మేధావులు తమ మేధస్సును దేశం కోసం ప్రపంచం కోసం ధారపోసి వెళ్లిపోతారు. వారితో పాటు బతికిన జీవిత భాగస్వాములు ఆ తర్వాతి జీవితాన్ని వారి జ్ఞాపకాలతో జీవిస్తారు. మహా గణిత మేధావి, భారత దేశానికి గర్వకారణం అయిన శ్రీనివాస రామానుజన్ (1887–1920) జన్మదినం డిసెంబర్ 22ను ‘జాతీయ గణిత దినోత్సవం’గా దేశం జరుపుకుంటుంది. అంతటి మహనీయుని భార్య అయిన జానకి అమ్మాళ్ భర్తతో పాటుగా, భర్త గతించాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవన్నీ చాలా కాలానికి లోకానికి తెలిశాయి. చాలా ఏళ్ల తర్వాతే సమాజం, దేశం ఆమెను గుర్తించింది. 11 ఏళ్ల వధువు జానకి అమ్మాళ్కు రామానుజన్తో పెళ్లి నాటికి ఆమె వయసు 11. రామానుజన్‌కు 21. రామానుజన్ కుటుంబం కుంభకోణంలో నివసించేది. జానకి అమ్మాళ్ ఊరు మరుదూరు. జానకి తల్లితో రామానుజన్ తల్లికి స్నేహం ఉండేది. అలా జానకి తల్లిని రామానుజన్ తల్లి తన కుమారుడితో జానకి సంబంధానికి ఒప్పించింది. అయితే మరుదూరుకు, కుంభకోణానికి దాదాపు 7 గంటల దూరం ఉంది. అది ఈ కాలంలో. ఆ కాలంలో ఎంత సేపు పట్టేదో చెప్పలేము. జూలై 14, 1909 నాడు ముహూర్తం పెట్టుకుని ఐదు రోజుల పెళ్లి ప్లాన్ చేసుకుంటే తల్లి, బంధువులతోపాటు రామానుజన్ రావడం ఆలస్యం అయ్యింది. ముందే చేరుకోవాల్సిన పెళ్లికొడుకు రాకపోయేసరికి ఆడ పెళ్లి వాళ్లు చాలా ఆందోళన చెందారు. ఒక దశలో ముహూర్తం సమయానికి కూడా రాకపోతే ఇంకో అబ్బాయికి ఇచ్చి కట్టపెడదాం అనుకున్నారు. కాని రామానుజన్ రావడంతో పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో రామానుజన్ తండ్రి లేడు. ఆయన క్లర్క్ పని చేసేవాడు. సెలవులు కుదరక పెళ్లిళ్లకు తండ్రులు హాజరు కాకపోవడం ఆ రోజుల్లో మామూలుగా పరిగణించబడేది. 13వ ఏట నుంచి కాపురానికి పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు జానకి తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయింది. ఈడేరాకే ఆమెను 13 ఏళ్లకు కాపురానికి తీసుకెళ్లారు. కాని రామానుజన్ ఆరోగ్యం ఎప్పుడూ సున్నితమే. అతను తరచూ జబ్బు పడేవాడు. పెళ్లి తర్వాత కూడా ఒక సర్జరీ అవసరమయ్యి అందుకు డబ్బులేక బాధ పడ్డాడు. తర్వాత ఒక డాక్టరు ఫ్రీగా చేస్తానని ముందుకు రావడంతో ఆ అవస్థ తప్పింది. రామానుజన్ చాలా బిడియ స్వభావి. పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు. అతడు ఒక పెద్ద పలక మీద తన థీరమ్స్ సాధన చేసేవాడు. నోట్ బుక్స్‌లో తన గణిత పరిష్కారాలు రాసేవాడు. ఆయన పిలిచినప్పుడు పలకడమే జానకి చేయవలసిన పని. ఇంట్లో రామానుజన్ తల్లి, బామ్మ ఉండేవారు. రామానుజన్‌ను, జానకిని ముద్దు చేస్తూ అన్ని వ్యవహారాలు వారే చూసుకునేవారు. వీరు ఒకరికి ఒకరే గాని రామానుజన్ మొదటి భార్య గణితమే కదా. రెండేళ్ల కాపురం జానకి అమ్మాళ్ రెండేళ్ల పాటే రామానుజన్తో కాపురం చేసిందని చెప్పాలి. 1912లో కాపురానికి వస్తే 1914 లో రామానుజన్ ఇంగ్లాండ్ వెళ్లాడు. 1919 లో జబ్బు పడి తిరిగి వచ్చే వరకూ అక్కడ ఒక్కడే ఉన్నాడు తప్ప భార్యను తెచ్చుకునే పరిస్థితి లేదు. జబ్బు పడినప్పుడు ఒక మనిషి తోడుగా ఉండాల్సి వచ్చినా మొదటి ప్రపంచ యుద్ధ రోజులు కనుక జానకి ఇంగ్లాండ్ వెళ్లలేక పోయింది. భార్యను పిలిపించుకుని ఇటలీ వంటి వెచ్చటి దేశానికి వెళ్లు అని డాక్టర్లు సలహా ఇచ్చినా వీలు లేకపోయింది. చివరకు చాలా అనారోగ్య స్థితిలో రామానుజన్ ఇండియా చేరుకున్నాడు. 1919లో ఏప్రిల్‌లో అతడు ఇండియా వస్తే 1920 ఏప్రిల్ 26న మరణించేనాటి వరకూ జానకి అతడికి సేవలు చేసింది. మరణించే నాటికి రామానుజన్ వయసు 32. ఆమె 20లలోనే ఉంది. అంత చిన్న వయసులో వైధవ్యం చూసిందామె. భర్త గొప్ప జీవితం చూడలేదు. ఆమె కూడా. దర్జీగా జీవించి భర్త మరణించాక కొన్నాళ్లు ముంబైలోని సోదరుడి దగ్గర ఉన్న జానకి అక్కడ టైలరింగ్ నేర్చుకుని మద్రాసు చేరుకుని రెండు గదుల ఇంట్లో దాదాపు 50 ఏళ్లు జీవించింది. ఆ ఇంట్లో ఉంటూ టైలర్‌గా బతుకుతూ నలుగురికీ టైలరింగ్ నేర్పించేది. ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు మరణిస్తే ఆమె ఏడేళ్ల కొడుకును దత్తత తీసుకుంది. ఆ పిల్లవాడే ఆమెకు ఆ తర్వాత అండా దండా అయ్యాడు. 1962లో పెద్ద గుర్తింపు 1962లో రామానుజన్ 75 వ జయంతి సందర్భంగా అందరి దృష్టి జానకి అమ్మాళ్ మీద పడింది. ఆమె ఒంటరిగా జీవిస్తున్నదని తెలిసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ ప్రభుత్వాలు జీవిత కాల పెన్షన్‌ను మంజూరు చేశాయి. గణిత అభిమానులు అందరూ కలిసి ఆ రోజుల్లో ఆమెకు 20 వేల రూపాయల పర్సు ఇచ్చారు. హిందూజా ఫౌండేషన్ నుంచి నెలకు 1000 రూపాయల పెన్షన్ మంజూరు అయ్యింది. ఇంకా ఎందరో ఆమెను రామానుజన్ భార్యగా గౌరవించి సత్కరించారు. అయితే ఆమె తన భర్తలాగే ఎంతో మొహమాటస్థురాలు. సంప్రదాయవాది. ఎవరినీ పెద్దగా కలిసేది కాదు. ‘నా భర్త జీవించి ఉండగా ఆయన చివరి రోజుల్లో నా చేతులతో ఆయనకు అన్నం, మజ్జిగ ఇచ్చాను. కాళ్లు పట్టాను. ఆయనకు అవసరమైన వేడి నీళ్లు కాచడానికి వాడిన రెండు గిన్నెలను ఆయన జ్ఞాపకంగా ఉంచుకున్నాను.’ అంటుంది జానకి అమ్మాళ్. జానకి అమ్మాళ్ తన 94వ ఏట భర్త మరణించిన నెలలోనే ఏప్రిల్ 13, 1994న తుది శ్వాస విడిచింది. చదవండి: Toilet Cleaning Robot: టాయిలెట్ క్లీన్ చేసే రోబో.. ధర 40 వేల రూపాయలు! -
గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ వర్ధంతి..
శ్రీనివాస రామానుజన్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధ గణిత మేధావుల్లో ఒకరు. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన రామానుజన్ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ గణితంపైనే కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత మద్రాస్‌లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరి గణిత సమస్యలను సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. 1913లో మద్రాస్ వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి నివ్వెరపోయారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపాడు. మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ రామానుజ¯Œ ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986–87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. హార్డీ స్కేలుపై వందకు వంద పాయింట్లు పొందిన ఏకైక గణిత శాస్త్రవేత్త రామానుజనే. ఆయన తర్వాత ఆ లోటును మరో శాస్త్రవేత్త భర్తీ చేయలేకపోడం విచారకరం. – ఎమ్.రామ్‌ప్రదీప్, తిరువూరు (నేడు ఎస్. రామానుజన్ వర్ధంతి) -
చిక్కు వీడితే.. లెక్క తేలికే..
విద్యార్థులు గణితం అంటే భయపడుతుంటారు. కానీ అర్థం చేసుకుంటే దానంత∙సులువుగా మరో సబ్జెక్ట్ ఉండదు. లెక్కలను భయంతో కాకుండా ఆసక్తితో నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గణితంలో రారాజు.. తమిళనాడుకు చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు.. వినూత్న పద్ధతిలో బోధన సాక్షి, దౌల్తాబాద్(దుబ్బాక): ఆయనకు గణితం అంటే ఎంతో ప్రేమ. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అంటే ఎంతో అభిమానం. అంతటితో ఆగి పోలేదు గణిత బోధనలో వినూత్నమైన కృత్యాదార పద్ధతులను అవలంభిస్తూ విద్యార్థులకు గణితం అంటే ఆసక్తి కలిగేలా బోధిస్తూ ముందుకు సాగుతున్నాడు. దౌల్తాబాద్ మండలం లింగరాజ్‌పల్లి మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కొత్త రామానుజం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గట్లపల్లెపల్లి గ్రామానికి చెందిన ఈయన చిన్న నాటి నుంచి గణితం పట్ల అమితమైన ఆసక్తితో ముందుకు సాగుతున్నాడు. రామానుజం పదో తరగతిలో గణితంలో మాత్రమే 91మార్కులు సాధించారు. ఇంటర్లో 150మార్కులకు 150మార్కులు సాధించి తనకు గణితం పట్ల ఉన్న ఆసక్తిని చాటి చెప్పాడు. గణితం పట్ల ఉన్న ఆసక్తితో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ గణిత బోధనలో కృత్యాదార పద్ధతులను పాటిస్తూ అనేక మంది విద్యార్థులకు గణితం పట్ల ఉన్న భయాన్ని దూరం చేశారు. చదవండి:లెక్కల ‘అంతు’ తేల్చినవాడు చదువే పరమావధిగా ముందుకు పాగిన రామానుజం ఎన్నో అవమానాలు ఎదురైనా పట్టువదలకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన గురుకులాలో పీజీటీ మ్యాథ్స్ టీచర్‌గా ఉద్యోగం సంపాధించాడు. అంతే కాకుండా శ్రీనివాస రామానుజన్ చిత్రంతో ఉన్న ఆయన జీవిత చరిత్ర వివరాల కాపీలను, ఆయన సాధించిన గణితం అంశాలను ప్రతీ విద్యార్థికీ అందజేస్తారు. గణిత శాస్త్రవేత్తగా శ్రీనివాస రామానుజన్ గణితంలో సాధించిన సున్నాను సున్నాతో భాగిస్తే ఏమి వస్తుందన్న అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలను సంధించి వారి చేత సమాధానం రాబడుతుంటారు. గణితం అంటే విద్యార్థులు ఎంతో భయపడుతుంటారని, ఆ భయం పోగొట్టేందుకు గణితం ఎంతో సులభం అని విద్యార్థులకు అవగాహన కలిగించేలా చేయడమే తన లక్ష్యం అని కొత్త రామానుజం వివరించారు. 90 శాతం వినికిడి సమస్యతో చదువులో నేను ముందుకు వెళ్తుంటే ఎంతో మంది నన్ను చూసి నవ్వుకునే వారు. ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినబడక ఎంతో ఇబ్బంది పడ్డాను. సొంతంగా చదువుకుని ఉద్యోగం సాధించాలని ముందుకు సాగి విజయం సాధించాను. రామానుజన్ జన్మదినాన్ని గణిత దినోత్సవంగా కాకుండా జీఎఎన్ఐటీ వీక్ గా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈ జీఎఎన్ఐటీ అనగా సంఖ్యా శాస్త్రంలోని అమరికలపై విద్యార్థులకు ఆసక్తిని పెంచుటకు శిక్షణ ఇచ్చుట. – రామానుజం, గణిత ఉపాధ్యాయుడు అన్నింటికీ మూలం.. గణితం నర్సాపూర్: సమాజంలో అన్నింటికి గణితం మూలమని నర్సాపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు సామ్యానాయక్ చెప్పారు. మనిషి నిత్య జీవితం గణితంతో ముడి పడి ఉంటుందని, ప్రతి ఘడియ, ప్రతి కదలికలో గణితం ఉంటుందన్నారు. తమకు తెలియకుండానే మనుషులు తమ దిన చర్యలో గణితాన్ని వాడుతారని ఆయన చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులు గణితంతో ముడిపడి ఉంటాయని ఆయన చెప్పారు. కాగా గణితానికి ప్రాధాన్యత తరగనిదన్నారు. గణితంలో చురుకుగా ఉండే వారు ఇతర అన్ని సబ్జెక్టులలో చురుకుగా ఉంటారన్నారు. శాస్త్రవేత్తలు చేపట్టే ప్రయోగాలలో గణితానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలు, సాధారణ వ్యక్తులతో పాటు అన్ని రంగాల వ్యక్తుల దినచర్య గణితంతో ముడిపడి ఉంటుందని సామ్యానాయక్ చెప్పారు. గణితం లేనిదే అభివృద్ధి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. – సామ్యానాయక్, మ్యాథ్స్ టీచర్, నర్సాపూర్ ప్రత్యేక శైలితో, విభిన్న రీతిలో.. సిద్దిపేటలోని ఇందిరానగర్ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి అంటే ఆ పాఠశాల విద్యార్థులకు చాలా ఇష్టం. ఎందుకంటే గణితం అంటే భయం ఉండే విద్యార్థుల్లో ఈ ఉపాధ్యాయుడు ఇట్టే భయం పొగోట్టేస్తాడు. వారితోనే సమస్యలకు సాధనలు సాధించేలా చేస్తాడు. కేవలం బోర్డు పైనే కాకుండా విద్యార్థులను మౌఖికంగా గణితం నేర్చుకునేలా చేయడంలో కృషి చేస్తున్నాడు. ఈ పాఠశాల నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో అధిక మంది విద్యార్థులకు గణితంలో 10 జీపీఏ సాధించటంలో లక్ష్మారెడ్డిది కీలక పాత్ర. కరోనా వైరస్ నేప«థ్యంలో ఆన్లైన్ లో విద్యార్థులకు గణిత పాఠాలు చెబుతున్నారు. వీరి సేవలను గుర్తించిన రాష్ట్ర ఆర్థికశాఖ మాత్యులు హరీశ్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా సాక్షి పలుకరించగా..ముందుగా గణితం అంటే భయం ఉండకూడదని అంటారు. విద్యార్థులతో మిత్రుల వలే ఉంటు వారికి భోధన చేయాలంటారు. ముఖ్యంగా మనం నిత్యం గృహల్లో చేసే లెక్కలను మౌఖికంగా విద్యార్థులచే చేయించాలి. ఇదే విధంగా సులువు నుంచి∙ఘటువు వరకు రావాలి. దీంతో విద్యార్థుల్లో భయం అనేది ఉండదంటారు. భయంతో కాదు.. ఇష్టంగా చేయాలి గణితం అనేది చేయడం ద్వారా నేర్చుకునేది. పూర్ణభావనలపై ఆధారపడి ఉండడం వలన చాలామంది విద్యార్థులు ఈ గణితం అంటే భయపడుతున్నారు. గణిత భావనలను కృత్యాల ద్వారా, వీడియోస్ ద్వారా, డిజిటల్ కంటెంట్ ద్వారా నేర్చుకుంటే సులువుగా అర్థమవుతుంది. ముఖ్యంగా గణిత కృత్యాలు, ఫజిల్లు, ముఖ్యమైన ప్యాటర్న్లు, సుత్రాలు, ఆవిష్కరణల గురించి ముందుగా నేర్చుకుంటే గణితం ఇట్టే అర్థమవుతుంది. ఉపాధ్యాయులు ఉత్తమంగా బోధిస్తే..విద్యార్థికి మంచి సాధన ఉండాలి. ఈ విధంగా ఉంటే విద్యార్థులు గణితంలో అధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. – అజయ్‌కుమార్‌రెడ్డి, గణిత ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూకునూరుపల్లి ఉపాధ్యాయుల సహకారంతో.. ఉపాధ్యాయుల సహకారంతో మండల, జిల్లా స్థాయి గణిత పోటీలలో పాల్గొన్నాను. ట్రిబుల్ ఐటీ బాసరలో సీటు సాధించడానికి ఈ అనుభవం ఎంతగానో తోడ్పడింది. ఉపాధ్యాయులు చెప్పే అంశాల పట్ల శ్రద్ధ వహించడం వలన ఎలాంటి విషయాన్నైనా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు అందించిన సహకారం వలనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. – కార్తీక్, ట్రిపుల్ ఐటీ బాసర (మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థి) శాస్త్రాలన్నింటికీ ఆధారం.. దౌల్తాబాద్(దుబ్బాక): నెమళ్ళకు శిఖల వలే, పాములకు మనుల వలే, వేదాంగ శాస్త్రాలన్నింటికీ శిరస్సు గణితం. 20వ శతాబ్దపు గణిత మేధావులలో శ్రీనివాస రామానుజన్ అగ్రగణ్యుడు. రామానుజన్‌కు గురువు, దైవం, మిత్రులు సర్వం గణితంగానే భావించి జీవించారు. గణిత శాస్త్రంలో వీరు చేసిన కృషికి గాను 2012వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రామానుజన్ జన్మదినాన్ని జాతీయ గణితశాస్త్ర∙దినోత్సవంగా ప్రకటించారు. గణిత శాస్త్ర అభ్యాసనం ద్వారా విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, ఏకాగ్రత, వేగం, కచ్ఛితత్వం, మానసిక క్రమశిక్షణ కలుగుతాయి. గణితంపై విద్యార్థులకు ఆసక్తి పెంచడానికి గణిత దినోత్సవం ఎంతగానో తోడ్పడుతుంది. గణితా క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు, నాటకాలు ప్రదర్శించి విద్యార్థులు గణితంపై అభిమానాన్ని చాటుకుంటారు. – సత్యప్రమోద్, పీజీటీ మ్యాథ్స్, మోడల్ స్కూల్ దౌల్తాబాద్ రేఖా గణితం, గ్రాఫ్‌లపై శ్రద్ధ వహించాలి బెజ్జంకి(సిద్దిపేట): ప్రశ్న: మ్యాథ్స్‌లో మంచి మార్కులు ఎలా సాధించాలి? జవాబు: కరోనా నేపథ్యంలో తగ్గించిన సిలబస్‌పైన అవగాహన అవసరం. ప్రశ్నాపత్రాన్ని అధ్యయనం చేసి ప్రశ్నల సరళిని గమనించాలి. ముఖ్యంగా గ్రాఫ్ సమస్యలు, రేఖా గణితంలోని నిర్మాణాల పైన ప్రత్యేక శ్రద్ధ వహించి సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. ప్రశ్న: గణితానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? జవాబు: భవిష్యత్తులో గణితానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి కాంపిటీషన్ పరీక్షలలోను గణితం తప్పనిసరి. అరిథమేటిక్స్, జనరల్ ఇంటెల్లిజెన్స్, మెంటల్ ఎబిలిటీ, డేటా ఎనాలసిస్లాంటి అనేక అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. గణితంలో రాణిస్తే అన్ని రంగాలలో విజయం సాధించవచ్చు. – హరికృష్ణ, మ్యాథ్స్ టీచర్, వడ్లరు బేగంపేట పాఠశాల భయం పోగొట్టాలి వట్పల్లి(అందోల్): ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు గణితంపై భయం లేకుండా చేయాలి. అందుకు చతుర్విత ప్రక్రియల్లో కృత్యాల ద్వారా బోధన చేయాలి. పరిసరాల్లో లభించే వస్తువులను టీఎల్ఎంగా ఎంపిక చేసుకొని విద్యార్థి స్వేచ్ఛగా నేర్చుకునేలా ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడిగా ఉంటూ బోధన చేయాలి. – నవీన, గణిత ఉపాధ్యాయురాలు, వట్పల్లి గణితం.. నిత్య జీవితంలో భాగమే కొండాపూర్(సంగారెడ్డి): గణిత అభ్యసనాన్ని కేవలం మార్కులు తెచ్చుకోవడమే కాకుండా పాఠశాల బయట, నిజజీవితంలో ఎన్నో సందర్భాల్లో గణితం ఉపయోగపడేలా బోధన చేయాలన్నారు. గణిత బోధన కేవలం మూస పద్ధతిలో కాకుండా ప్రయోగాత్మకంగా బోధన చేయడం ద్వారా విద్యార్థులకు గణితంపై ఆసక్తి కలుగుతుంది. ప్రాథమిక భావనలు, సూత్రాలపై అవగాహన చేసుకొని వాటిపై పట్టు సాధించడంతో మార్కులు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫజిల్స్, క్విజ్లు, ఒలంపియాడ్‌లు వంటి పోటీలలో పాల్గొనే విధంగా గణిత ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. దీంతో గణితం అంటే భయం పోవడంతో పాటు ఆసక్తిగా గణితం సబ్జెక్టును ఇష్టపడతారు. – రామానుజన్, గణిత ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్ఎస్ ఘనాపూర్ గణిత క్లబ్ నిర్వహణ వల్లే.. మా పాఠశాలలో నిర్వహించిన గణిత క్లబ్ మూలంగా నాకు గణితంపై ఆసక్తి ఏర్పడింది. ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా లభిస్తుంది. మా ఉపాధ్యాయులు నిరంతరం గణిత అభ్యాసనం పట్ల ఆసక్తిని పెంచేలా బోధించడం వలన గణితం అంటే భయం తొలగిపోయింది. ఇప్పుడు ఎలాంటి విషయాన్నైనా అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నాను. – శివాణి, 9వ తరగతి విద్యార్థిని మోడల్‌స్కూల్ గణితంపై ఇష్టం పెరిగింది.. మొదటి నుంచి మా పాఠశాలలో ఉపాధ్యాయులు గణితాన్ని సులువుగా అర్థమయ్యేలా బోధించేవారు. ఫజిల్స్, క్విజ్, టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించడం వలన గణితంపైన భయం పోయి ఇష్టం పెరిగింది. ఉపాధ్యాయులు చెప్పిన విధంగా ప్రిపేర్ అవ్వడం వల్ల పదో తరగతిలో 10 జీపీఏ సాధించడమే కాకుండా పాలిటెక్నిక్‌లో రాష్ట్ర స్థాయిలో 600 ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మకమైన మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈసీఈలో సీటు సాధించాను. ఇవే కాకుండా అగ్రికల్చర్ పాలిసెట్, ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలోను మంచి ర్యాంకు సాధించాను. ఇవన్నీ గణితం పైన ఇష్టం వల్లనే సాధ్యమయ్యాయి. – చిప్ప సాత్విక, ఈసీఈ, మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల -
లెక్కల ‘అంతు’ తేల్చినవాడు
శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించాడు. ఒకసారి ఓ ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుందని చెబితే– ఈ నియమం సున్నాకు కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించాడు. పన్నెండేళ్ళ వయసులోనే డిగ్రీ స్థాయి గణిత పుస్తకాల్లోని త్రికోణమితి, ఆయిలర్ సూత్రా ల్లో నిక్లిష్ట సమస్యలను సులువుగా సాధించేవాడు. 15 ఏళ్ల వయసులో గణిత శాస్త్రవేత్త జి.ఎస్.కార్ రాసిన ‘సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ మాటిక్స్’ చదివి, అందులోని ఆరువేల పైచిలుకు సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. కళాశాలలో గణితంలో కనబరచిన ప్రతిభ కారణంగా ఉపకార వేతనం అందుకున్నాడు. గణితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ మిగిలిన సబ్జెక్టులను సరిగా చదవక పోవటంతో పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ ఉపకార వేతనం రద్దయింది. 1913లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ గణిత ప్రొఫెసర్ జి.హెచ్.హార్డీకి తన 120కి పైగా సిద్ధాంతాలను, సూత్రాలను వివరిస్తూ ఉత్తరం రాశాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన హార్డీ కేంబ్రిడ్జ్‌కి పిలిపించుకు న్నారు. రామానుజన్ కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో పరిశోధక విద్యార్థిగా చేరాడు. అనంత శ్రేణులు, సంకలనం, ప్రధాన సంఖ్యలు, మాక్ తీటా ప్రమేయాలు, శృంఖలిత భిన్నాలపై అనేక పరిశోధనలు చేశాడు. 20వ శతాబ్దపు గణిత మేధావుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. అనారోగ్యంతో భారతదేశం తిరిగి వచ్చిన రామానుజన్ 1920 ఏప్రిల్ 26న తన 33వ ఏట కన్నుమూశాడు. ఆయన జన్మదినాన్ని జాతీయ గణితశాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. (నేడు జాతీయ గణితశాస్త్ర దినోత్సవం) చల్లా చంద్రశేఖర్ రెడ్డి కలువాయి, నెల్లూరు జిల్లా. మొబైల్: 94409 28666 -
అంకెల తపస్సులో లెక్క తప్పిన జీవితం
‘గణితంలోని పరమోన్నత సత్యం ఏమిటో తెలుసుకోవాలి! దాని కోసం నేను అన్వేషిస్తాను.’ఇది ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ఎవరో పరిశోధక విద్యార్థి ప్రకటించిన జీవితాశయం కాదు. తీసుకున్న ప్రతిజ్ఞ కూడా కాదు. పెద్ద పురస్కారం అందుకున్న శాస్త్రవేత్త జీవితంలో ఇక తాను సాధించవలసినది అది మాత్రమే అంటూ ఉద్వేగంతో వెల్లడించిన ఉద్దేశం కూడా కాదు. ఒక పదేళ్ల బాలుడు ప్రాథమిక పాఠశాలలో తన ఉపాధ్యాయునితో అన్నమాట ఇది. నిజంగానే ఆ బాలుడు అందుకోసమే జీవితం మొత్తం వెచ్చించాడు. ప్రపంచంలో ఒక అద్భుత గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు. ఆ శాస్త్రానికి సంబంధించి ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండానే, పిన్న వయసులోనే ఆయన తయారు చేసి పెట్టిన ప్రతిపాదనలు, సిద్ధాంతాలు ఇప్పుడు సంఖ్యా సిద్ధాంతానికీ, భౌతికశాస్త్రానికీ విలువైన ఉపకరణాలయ్యాయి. ఆయనే శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. శ్రీనివాస రామానుజన్ ఇరవయ్యో శతాబ్దపు గణితశాస్త్ర అద్భుతం. భారతదేశంలో ఆర్యభట్టు, భాస్కరాచార్యుల తరువాత అంతటి గణిత శాస్త్రవేత్త మళ్లీ ఆయనేనని గట్టి అభిప్రాయం ఉంది. పుట్టుకతో కళాకారులు ఉంటారని అంటారు. పుట్టుకతోనే గాయకులైనవారు ఉంటారు. కానీ శ్రీనివాస రామానుజన్ పుట్టుకతోనే గణిత శాస్త్రవేత్త. వయసుకు మించిన, కాలాన్ని అధిగమించిన ప్రతిభను ఆయన గణితంలో చూపించారు. జగ్గీ వాసుదేవ్ విద్యార్థులతో ముచ్చటిస్తున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ‘గణితశాస్త్రంలో రామానుజన్ అంత గొప్పవాడు ఎలా కాగలిగారు? అసలు ఈ విశ్వం మొత్తం ఆయనకు తెలుసునని అంటారు. ఇదెలా?’ ఇందుకు అద్భుతమైన వివరణ ఇచ్చారు జగ్గీ వాసుదేవ్. చరిత్ర ప్రస్థానంలో, జ్ఞానం అభివృద్ధి చెందుతున్న కాలంలో మనిషి తన సామర్థ్యాన్ని ఇంకాస్త పెంచుకునే పనిలోనే కనిపిస్తాడు. లేదంటే ఆ సామర్థ్యాన్ని మరింత వేగంగా సాధించడానికి ప్రయత్నించడం కూడా కనిపిస్తుంది. కానీ, మనిషి ఆలోచనకూ, అంచనాకూ అందకుండా ఉండిపోయిన అంశాల జోలికి అతడు వెళ్లడం లేదు. రామానుజన్ మాత్రం అలాంటి ప్రయత్నం చేశారు. ఇక, అసలు రామానుజన్ ఒక శాస్త్రంలో అంత ఎత్తుకు ఎలా వెళ్లగలిగారు? నిజంగానే ఆలోచించవలసిన ప్రశ్న. ఆయన వందేళ్ల క్రితమే కృష్ణబిలాల గురించి మాట్లాడారు.అప్పటికి అలాంటి ఒక ఖగోళ రహస్యం ఉందని లోకానికి తెలియదు. అసలు విజ్ఞానశాస్త్రం ముందుకు సాగే విధానం ఒకటి ఉంటుంది. అందులో మొదటి దశ భావన. రెండో దశ సిద్ధాంత ప్రతిపాదన. మూడోదశ అందుకు సంబంధించిన గణితం. కానీ రామానుజన్ మొదటి రెండు దశలు అవసరం లేకుండానే ఆయా అంశాలకు చెందిన గణితం గురించి వెల్లడించారని జగ్గీ వాసుదేవ్ చెప్పారు. ఇంకొక చక్కని విశ్లేషణ కూడా ఇచ్చారు. గణితంతో మమేకమైపోయే మేధస్సు కలిగిన రామానుజన్ దక్షిణ భారతంలో పుట్టడం ఆయన అదృష్టం అంటారాయన. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఇలాంటి శాస్త్రాలు లుప్తమైపోయాయి.కారణం విదేశీ దండయాత్రలు. దక్షిణ భారతం అలాంటి దండయాత్రల బారిన పెద్దగా పడకపోవడం వల్ల చాలా శాస్త్రాలను రక్షించుకోగలిగింది. అందుకే దక్షిణాదిన జన్మించడం వల్ల రామానుజన్ విద్య మరింత పరిఢవిల్లిందన్నదే వాసుదేవ్ అభిప్రాయం. రామానుజన్ (డిసెంబర్ 22, 1887–ఏప్రిల్ 26, 1920) తమిళనాడులోనే ఈరోడ్‌లో అమ్మమ్మ ఇంట పుట్టారు. తండ్రి కె. శ్రీనివాస అయ్యంగార్. పేద కుటుంబం. శ్రీనివాస ఒక చీరల దుకాణంలో గుమాస్తా. తల్లి కోమలతామ్మాళ్. రామానుజన్ తొలి గురువు తల్లే. ఆమె సాధారణ గృహిణి. కానీ మంచి గాయకురాలు. స్థానికంగా ఉండే ఒక ఆలయంలో పాటలు పాడుతూ ఉండేవారు. తండ్రి బట్టల దుకాణంలోనే ఎక్కువ కాలం గడిపేవాడు. దీనితో తల్లితోనే రామానుజన్‌కు ఎక్కువ చనువు ఉండేది. పురాణాగాథలు ఆమె నుంచి విన్నాడాయన. పురాణాలు, దేవతల లీలల్లో కూడా ఆయన గణితాన్నే దర్శించారు. శ్రీనివాస స్వస్థలం తంజావూరు జిల్లా. తరువాత కుంభకోణం చేరిందా కుటుంబం. ఆ చిన్న ఊరిలోనే రామానుజన్ పెరిగారు. అప్పటికే ఆ పుణ్యక్షేత్రం విద్యానిలయంగా ఉండేది. సారంగపాణి సన్నిధి వీధిలోనే వారి ఇల్లు. అంతటి ఖ్యాతి అక్కడే ఏదో పెద్ద విశ్వవిద్యాలయం పరిఢవిల్లినందువల్ల కాదు. శేషు అయ్యర్ వంటివారు నడపే వీధి బడులతోనే అంతటి ఖ్యాతి వచ్చింది. రామానుజన్ కూడా అలాంటి వీధి బడిలోనే చదువుకున్నారు. రామానుజన్ తరువాత మరో ముగ్గురు పుట్టారు. కానీ ఎవరూ తొలి పుట్టినరోజు వరకు కూడా జీవించలేదు. రామానుజన్ చిన్నతనంలో అంటే 1889లో కుంభకోణాన్ని మశూచి కుదిపేసింది. మొత్తం నాలుగు వేల మంది చనిపోయారు. రామానుజన్ మాత్రం ఆ దారుణమైన జబ్బు బారిన పడినప్పటికీ బతికి బట్టకట్టారు. దీనితో ఆయన కొంతకాలం కాంచీపురంలో కూడా ఉన్నారు.తరువాత కుంభకోణంలో కాంగాయన్ ప్రాథమిక పాఠశాలలో చదివారాయన. ఆ తరువాత మద్రాసులో చేర్పించారు. కానీ ఆ పాఠశాల రామానుజన్‌కు నచ్చలేదు. బాల రామానుజన్ బడికి సరిగ్గా వెళుతున్నాడో లేదో చూసేందుకు ఒక పోలీసును కూడా నియమించారు (తండ్రి తరఫు తాతగారు పెద్ద ప్రభుత్వోద్యోగి కావడం వల్ల). అయినా రామానుజన్ దారికి రాలేదు. దీనితో ఆరుమాసాలకే మళ్లీ కుంభకోణంలోనే చేర్పించారు. ఆయన పదకొండో ఏటనే ఒక అద్భుతం జరిగింది. ఇద్దరు కాలేజీ విద్యార్థులు రామానుజన్ ఇంటికి దగ్గరలో ఉండేవారు. వారికి రామానుజన్ లెక్కలు చెప్పేవాడు. వారి ద్వారానే, కళాశాల గ్రంథాలయం నుంచి ఎస్ఎల్ లోనే అనే అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న గణితశాస్త్రవేత్త రాసిన ‘త్రికోణమితి’ పుస్తకం తెప్పించుకుని చదివారు. 1903లోనే తన పదహారవ ఏట జీఎస్ కార్ అనే గణితశాస్త్రవేత్త రాసిన ‘ఎనాలిసిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లయిడ్ మ్యాథమేటిక్స్’ అన్న పుస్తకం చదివారు. ఇదే ఆయనను ఆ శాస్త్రంలో ఇంకొక స్థాయికి వెళ్లడానికి సోపానంగా ఉపయోగపడింది. ఇవన్నీ ఉన్నా ఆయనకు రోజు గడవడం కష్టంగా ఉండేది. అందుకే ఉద్యోగం కోసం అన్వేషించి, మద్రాస్ నౌకాశ్రయంలో గుమాస్తాగా కొలువుదీరాడు. అది 1913. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ఆచార్యుడు జీఎస్ హార్డీకి ఒక లేఖ అందింది. తరువాత ఇంకొన్ని లేఖలు కూడా అందాయి. వాటి నిండా కొన్ని గణిత సిద్ధాంతాలు ఉన్నాయి. నిజానికి అవన్నీ ప్రపంచానికి కొత్త. ఆ లేఖలన్నీ గుమాస్తా ఉద్యోగంలో ఉన్న రామానుజన్ నుంచి వెళ్లినవే. కానీ, ‘ఆ లేఖలు చదివితే, ఒక మహా గణిత మేధావి రాసినవని వెంటనే అర్థమైపోతుంది’ అన్నారు హార్డీ తరువాత కాలంలో. అంతేకాదు, ఆ లేఖలలో రామానుజన్ ప్రతిపాదించిన థియరమ్స్ ‘పూర్తిగా (తనను, తన మిత్రులను కూడా) ఓడించాయి’ అని కూడా ఆయన చెప్పుకున్నారు. ఆ ప్రతిభను చూసిన తరువాత హార్డీ పెద్ద మనసు చేసుకుని రామానుజన్‌కు కేంబ్రిడ్జ్ వచ్చే ఏర్పాటు చేయించారు.గణితానికి ఆయన చేసిన సేవ చూస్తే చిన్నతనంలో ఆయన చెప్పిన మాట నిజమేననిపిస్తుంది. ఆయన గణితంలో సమున్నత సత్యాన్ని శోధించదలిచాడు. ఆయన కృషి కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది. సంఖ్యా సిద్ధాంతానికి రామానుజన్ సేవ అమోఘమైనది. ఇది అంకెల అధ్యయనానికి సంబంధించినది. గణితంలోనే ఒక శాఖ. ఈ శాఖకు చెందిన శాస్త్రవేత్తలు ప్రైమ్ నెంబర్స్ అంటే 0, 1,2,3,4,5 వంటి వాటి గురించి అధ్యయనం చేస్తారు. ఎందుకంటే మొత్తం గణిత నిర్మాణంలో, లెక్కల రూపకల్పనలో ఇటుకల పాత్రను పోషిస్తాయి. ఈ శాస్త్రం మరింత అభివృద్ధి చెందడానికి రామానుజన్ సిద్ధాంతాలు ఉపకరించాయి. రామానుజన్ ఫ్రేడ్ బుక్స్ పేరుతో ఉన్న మూడు నోట్ బుక్కులలో నాలుగు థియరమ్స్ను(అంగీకృత తత్వాల ఆధారంగా సిద్ధాంతం చేయదగిన వాక్యం లేదా నియమం) ఆయన రాశారు. ఇందులో 3,900 థియరమ్స్ ఉన్నాయి. తన 14వ ఏటనే ఇవన్నీ ఆయన సొంతంగా ప్రతిపాదించిన సిద్ధాంతాలు కావడం విశేషం.గుణకారాలు, భాగాహారాలు ఎంత పెద్దవైనా మెదడులోనే లెక్క కట్టి చెప్పే సామర్థ్యం రామానుజన్‌కు ఉండేది. ఆయన తనను తాను ఒక గణిత శాస్త్రవేత్తగా నిర్మించుకున్నాడు. మేథమెటికల్ ఎనాలిసిస్,నంబర్ థియరీ, ఇన్ఫినిటీ థియరీలతో పాటు, కంటిన్యూడ్ ఫ్రాక్షన్‌కు, పరిష్కరించడం సాధ్యం కాదనుకున్న ఇంకొన్ని అంశాలకు ఆయన సిద్ధాంతాలతో పరిష్కారాలు దొరికాయి. వందేళ్ల క్రితం ఆయన ఏమి ఆలోచించారో, దానిని మనం ఇప్పుడు అభ్యాసం చేస్తున్నాం అంటారు ప్రపంచ శాస్త్రవేత్తలు. 1997లో స్ప్రింజర్ సైన్స్, బిజినెస్ మీడియా కలసి ‘రామానుజన్ జర్నల్’ను స్థాపించారు. ఇది గణితానికి సంబంధించిన పత్రికే అయినా, అసలు ఉద్దేశం రామానుజన్ రాసిపెట్టి వెళ్లిన సిద్ధాంతాలను లోకానికి తెలియచేయడమే. సింపుల్ ప్రాపర్టీస్, సింపుల్ ఔట్‌పుట్స్ గురించి ఆయన రాసిన వ్యాఖ్యానాల గురించి 2011, 2012 వరకు కూడా పరిశోధనలు జరిగాయి. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీలో గౌరవం దక్కించుకున్న అతి పిన్న వయస్కుడు ఆయనే. ట్రినిటీ కళాశాల ఫెలోగా ఎంపికైన తొలి భారతీయుడు రామానుజన్. ఏ విధంగా చూసినా రామానుజన్ ఈ విశ్వంలోనే ఒక అద్భుతం. కానీ ఆయన ఆ గొప్పతనాన్ని తన కులదేవతకు ఆపాదించేవారు. ఆ దేవత పేరు లక్ష్మీ నమ్మక్కళ్. ‘నేను నిద్రలో ఉన్నప్పుడల్లా ఒక అనుభవం కలుగుతూ ఉండేది. రక్తధారతో ఏర్పడిన ఒక ఎర్రటి తెర కనిపించేది. ఒక హస్తం దాని మీద హఠాత్తుగా రాయడం ఆరంభించేది. నేను శ్రద్ధగా చూడడం మొదలుపెట్టేవాడిని. వాక్యంలా రాయడానికి అవసరమయ్యేటట్టు పరిపూర్ణత్వంతో ఉన్న పదాలు కనిపించేవి. లేచిన తరువాత నేను వాటినే యథాతథంగా కాగితాల మీద రాసేవాడిని.’ అని చెప్పుకున్నారాయన. రామానుజన్‌కు అంకెలే ఉచ్చ్వాస నిశ్వాసాలు. జీవితం ప్రతి నిమిషం అంకెలతో నిండిపోయి కనిపిస్తుంది. కానీ, చిత్రం. అలాంటి జీవితం లెక్క తప్పింది. ‘35’కు కూడా చేరుకోలేదు. రామానుజన్ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పెరిగారు.చిన్నతనం నుంచి ఆహారం విషయంలో నియమాలు పాటించారు. అందుకే కేంబ్రిడ్జ్‌లో ఆయనకు తిండి అతి పెద్ద సమస్యగా మారిపోయింది. అయినా పట్టుదలతో ఆ మహోన్నత సంస్థ ట్రినిటీ కళాశాలలో హార్డీతో కలసి పనిచేశారు. అసలే మొదటి ప్రపంచయుద్ధ కాలం. కొలిచి ఇచ్చేవారు ఆహార పదార్థాలు. ఇవన్నీ ఆయన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించాయి. ఆయనకు క్షయ సోకిందని భావించి వైద్యం చేశారు. నిజానికి ఆయనను వేధించిన వ్యాధి అమీబియాసిస్. 1919లో భారత్ తిరిగి వచ్చిన రామానుజన్ ఆ మరుసటి సంవత్సరమే తుది శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 32 ఏళ్లు. (రామానుజన్ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ‘ది మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ’. మ్యాథ్యూ బ్రౌన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజంగా ఓ అద్భుతం. స్లమ్‌డాగ్ మిలియనీర్ హీరో దేవ్‌పటేల్ రామానుజన్ పాత్రను గొప్పగా పోషించారు.) ∙డా. గోపరాజు నారాయణరావు -
ప్రతిభా నైపుణ్యాలు అవసరం
ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సీఈఓ జగన్మోహన్ రెడ్డి బుక్కరాయసముద్రం: విద్యార్థులకు ప్రతిభా నైపుణ్యాలు ఎంతో అవసరమని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సీఈఓ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీనివాస రామానుజన్ ఇంటెలిజెస టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్ర«థమ, ద్వితీయ సంత్సరం చదువుతున్న 1924 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలైనవారికి ఈ నెల 22న శ్రీనివాస రామానుజ¯ŒS జయంతిని పురస్కరించుకుని బహుమతులు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. మొదటి బహుమతిగా ల్యాప్‌టాప్, ద్వితీయ బహుమతిగా 10 ఇ¯న్చెస్ ట్యాబ్లెట్, తృతీయ బహుమతిగా 7 ఇంచుల ట్యాబ్లెట్ ప్రదానం చేస్తామన్నారు. వీటితో పాటు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఏఓ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, నిజాం భాషా, అద్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
మహా గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్
రేపు జాతీయ గణిత దినోత్సవం అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త మన శ్రీనివాస రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఆయన తలిదండ్రులు కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్. పన్నెండేళ్ల వయసులోనే అసాధారణ బాలునిగా గుర్తింపు పొందిన రామానుజన్ ‘ఆయిలర్’ సూత్రాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను స్వయంగా సాధించాడు. రామానుజన్‌లోని తెలివితేటలను బయటకు తీసుకువచ్చిన గ్రంథం కార్ రాసిన ‘సినాప్సిస్’, అందులో ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉండేవి. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం ఎన్నో పుస్తకాలు రిఫర్ చేసినా అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండా వాటి సాధనలను అలవోకగా కనుక్కునేవాడు. అప్పటికే అందులో చాలా సమస్యలు నిరూపించబడ్డాయన్న విషయం తెలియకపోవడంతో వాటిని తన పద్ధతితో సాధించాడు. కుంభకోణం గవర్నమెంటు కాలేజీలో చేరిన రామానుజన్ ఎఫ్.ఎ. పరీక్ష తప్పాడు. తర్వాత మద్రాస్‌లోని వచ్చయ్యప్ప కాలేజీలో చదువుకు చేరాడు. అక్కడ గణితోపాధ్యాయునిగా ఉన్న ఎన్.రామానుజాచారి సమస్యలను కఠినంగా చెప్తుంటే, రామానుజన్ వాటిని తనదైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించే వాడు. రామానుజన్ ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సింగారవేలు ముదలియార్, రామానుజన్తో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలను చర్చించి సాధిస్తుండేవారు. తర్వాత రామానుజం 1909లో జానకి అమ్మాళ్‌ను పెళ్లి చేసుకున్నాడు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించేవాడు. 1913లో మద్రాస్ పోర్ట్‌ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డా॥వాకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డి (1877-1947)కి పంపాడు. ఉన్నతస్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ను జి.హెచ్.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. అక్కడ రాత్రనకా, పగలనకా గణితం పైనే ఏకాగ్రత పెట్టి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టాడు రామానుజన్. ఫిబ్రవరి 28, 1918లో ‘ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ’ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగా, 1918 అక్టోబర్‌లో ‘ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. మనదేశ ఔన్నత్యాన్ని జగతికి చాటిన రామానుజన్, అనారోగ్య కారణంగా చివరకు ఏప్రిల్ 26, 1920న అస్తమించాడు. అప్పటికి ఆయన వయసు 33. చివరిదశలో ‘మ్యాజిక్ స్క్వేర్’, ‘ప్యూర్ మాథ్స్‌కు చెందిన నంబర్ థియరీ’, ‘మాక్ తీటా ఫంక్షన్స్’ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ఆధారంగా ఆధునికంగా కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంతి ఉత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్ ఇనిస్టిట్యూట్‌లో, అమెరికాలోని ‘ఇలినాయిస్’ యూనివర్సిటీలో నేటికీ రీసెర్చ్ జరుగుతోంది. గణితశాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘జాతీయ గణితదినోత్సవం’గా ప్రకటించింది. 1729 ను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. దీనిని రెండు సంఖ్యల ఘనాల మొత్తంగా రెండు విధాలుగా రాయవచ్చు. 1729 = 103+93 = 123+13 - నాగేష్ -
'40 సార్లు గుండు గీశారు'
తన తలకు కనీసం నలభై సార్లు గుండు కొట్టారని దక్షిణాది నటుడు అభినయ్ వడ్డి వెల్లడించారు. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అభినయ్ బుధవారం చెన్నైలో విలేకర్లతో మాట్లాడారు. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం జీవిత కథ ఆధారంగా తమిళ, ఇంగ్లీషు భాషలలో నిర్మితమవుతున్న 'రామానుజన్' చిత్రానికి సంబంధించిన విశేషాలను అభియన్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఆ చిత్రంలోని ముఖ్యపాత్ర కోసం గుండుతో కనిపించాల్సి ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు తనకు ముందే చెప్పారని తెలిపారు. అందుకు తాను మనస్పూర్తిగా అంగీకరించానని తెలిపారు. దాంతో అన్ని సార్లు గుండు గీస్తారని చెప్పారు. తమిళనాడు కుంభకోణంలో చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో భాగంగా క్షరకుడు ఎల్లప్పుడు తనతో ఉండేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్ర షూటింగ్లో భాగంగా లండన్ వెళ్లినప్పుడు విగ్ పెట్టుకుని తిరగాలని తెగ అరాటపడ్డానని అయితే తన తలకు జుట్టు కొద్దికొద్దిగా వస్తున్న క్రమంలో విగ్ తన తలకు అతకలేదన్నారు. దాంతో విగ్గు పెట్టుకునేందుకు గుండె గీయించుకోవలసి వచ్చిందని షూటింగ్ నాటి విశేషాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కర్పూర సినిమా నిర్మిస్తున్న ఆ చిత్రంలో బామా, సుహాసిని మణిరత్నం, నిళగళ రవి, శరత్ బాబు, విజయ్, అబ్బాస్, ఢిల్లీ గణేష్, వై.జీ మహేంద్రలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
గణితశాస్త్ర స్నేహితుడు
సంక్షిప్తంగా... శ్రీనివాస రామానుజన్ త్రీ ఇడియెట్స్ ఆధారంగా వచ్చిన తెలుగు డబ్బింగ్ చిత్రం ‘స్నేహితుడు’లో పంచభట్ల సారంగపాణి అనే కుర్రాడు ఉంటాడు. బ్రిలియెంట్! బట్టీ పట్టడు. బుర్రకు పట్టించుకుంటాడు. పుస్తకాల్లోని ఈ సిద్ధాంతాలు, నిర్వచనాలు చదువును తేలికపరచాలి కానీ విద్యార్థుల్ని జడిపించి భారంగా నడిపించకూడదంటాడు! స్టూడెంటుగా సరిగ్గా అలాంటి వాడే శ్రీనివాస రామానుజన్. చిన్నప్పుడు వాళ్ల ఇల్లు కుంభకోణంలోని సారంగపాణి వీధిలో ఉండేది. పెంకుటింట్లో నివాసం. ఇప్పుడది రామానుజన్ మ్యూజియం. రామానుజన్ తల్లి గుడిలో పాటలు పాడేవారు. తండ్రి చీరల దుకాణంలో గుమస్తా. రామానుజానికి ఆయన దగ్గర చనువు లేదు. అందుకే అస్తమానం తల్లి చుట్టూ తిరిగేవాడు. ఆవిడే అన్నీ నేర్పేవారు. మంచీమర్యాద, పూజాపునస్కారం. ఇవన్నీ ఉండేవి కానీ సరైన తిండే ఉండేది కాదు. పేదరికం. పదేళ్ల వయసుకే రామానుజానికి తమిళం, ఆంగ్లం, గణితం, భూగోళశాస్త్రం పరిచయం అయ్యాయి. అయితే అతడు పూర్తిగా గణితం మాయలో పడిపోయింది మాత్రం ప్రాథమికోన్నత పాఠశాలలో. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్‌లో 1887లో జన్మించారు. పద్నాలుగవ యేట గణితంలో అతడికి ఆసక్తి మొదలైంది. పాశ్చాత్య గణిత పండితులు యూలర్, జార్జి షూబ్రిడ్జ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు కొత్త గణిత లోకాలకు శ్రీనివాసన్ కోసం దారులు పరిచాయి. అలా రామానుజన్ తనకు తానుగా 6,165 గణిత సూత్రాలను కనుక్కున్నారు. అతడికి వచ్చే సందేహాలను తీర్చే పుస్తకాలు అందుబాటులో లేకపోవడమే అతడి గణితప్రావీణ్యానికి కారణం అయింది! త్రికోణమితులు, బీజగణిత శ్రేణుల విశ్లేషణలో రామానుజన్ అన్ని పరిమితులను దాటుకుని ముందుకు వెళ్లారు. వివాహం అయ్యాక (1909) కూడా రామానుజన్ చిన్నా చితక ఉద్యోగాలు చూస్తూనే, గణితశాస్త్ర పరిశోధనలను కొనసాగించారు. ఆ క్రమంలోనే 1914లో కేంబ్రిడ్జ్ వెళ్లారు. భిన్నాలు, రేఖాగణిత సూత్రాల విశ్లేషణలకు తనను తను ఒక రఫ్బుక్గా మార్చుకుని గణితంలో ముప్ఫై రెండు పరిశోధనా పత్రాలు సమర్పించారు! ‘‘ఆయన ప్రతిభను కనుక ప్రపంచం మరి కాస్త ముందుగా గుర్తించినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గణిత మేధావిగా రామానుజన్ చరిత్రలో నిలిచిపోయేవారు’’ అని ఆంగ్ల గణితశాస్త్ర వేత్త జి.హెచ్.హార్డీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. 1918లో రామానుజన్ కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజ్‌లో, రాయల్ సొసైటీలో ఫెలోషెప్కి ఎంపికయ్యారు. ఆ తర్వాతి ఏడాది ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఇండియా తిరిగి వచ్చేశారు. ముప్ఫై రెండేళ్ల వయసులో 1920 ఏప్రిల్ 26న ఆయన మరణించారు. రామానుజన్ ప్రతిపాదించిన కొన్ని అంశాలు ఇప్పటికీ పరిష్కారం కానట్లే, అంత చిన్న వయసులో దేవుడు ఆయన్ని తీసుకెళ్లడం గణితశాస్త్ర ప్రేమికులు ఎప్పటికీ జీర్ణించుకోలేని విధి వైపరీత్యం. రామానుజన్ శుద్ధ శాకాహారి. లండన్‌లో ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాంసాహారం తప్ప సరైన శాకాహార భోజనం దొరక్క రామానుజన్ పౌష్టికాహార లోపానికి గురయ్యారు. అదే ఆయన మరణానికి కారణమైంది. రామానుజన్ 125వ జన్మదినం సందర్భంగా భారత ప్రభుత్వం డిసెంబర్ 22ను ‘నేషనల్ మేథమెటిక్స్ డే’గా ప్రకటించడం ద్వారా ఆయన కృషిని, పరిశోధనలను గౌరవించుకుంది.