జానకి అమ్మాళ్‌..టైలర్‌గా బతికిన గణిత మేధావి భార్య | Know About Srinivasa Ramanujan Wife Janakiammal | Sakshi
Sakshi News home page

National Mathematics Day 2021: జానకి అమ్మాళ్‌..టైలర్‌గా బతికిన గణిత మేధావి భార్య

Published Wed, Dec 22 2021 9:30 AM | Last Updated on Wed, Dec 22 2021 1:27 PM

Know About Srinivasa Ramanujan Wife  Janakiammal - Sakshi

శ్రీనివాస రామానుజన్‌ దేశం గర్వించే గణిత మేధావి. గణితంలో శేషం రాబట్టడం ముఖ్యం. కుడి చెవిలో అంకె ఎడమ చెవిలో అంకె ఇవే తెలుస్తుంటాయి. కాని ఆ లెక్కలు చేసే చేతులకు ఒక గుండె కావాలి. ఆ గుండె జానకి అమ్మాళ్‌. శ్రీనివాస రామానుజన్‌ను వివాహం చేసుకుని ఆమె ఎలాంటి జీవితం గడిపింది. భర్త ప్రేమ పొందిందా? 32 సంవత్సరాలకే భర్త మరణిస్తే ఆమె జీవితం ఎలా గడిచింది? 

మేధావులు లోకానికి తెలిసినట్టుగా వారి భార్యలు తెలియరు. మేధావులు తమ మేధస్సును దేశం కోసం ప్రపంచం కోసం ధారపోసి వెళ్లిపోతారు. వారితో పాటు బతికిన జీవిత భాగస్వాములు ఆ తర్వాతి జీవితాన్ని వారి జ్ఞాపకాలతో జీవిస్తారు. మహా గణిత మేధావి, భారత దేశానికి గర్వకారణం అయిన శ్రీనివాస రామానుజన్‌ (1887–1920) జన్మదినం డిసెంబర్‌ 22ను ‘జాతీయ గణిత దినోత్సవం’గా దేశం జరుపుకుంటుంది. అంతటి మహనీయుని భార్య అయిన జానకి అమ్మాళ్‌ భర్తతో పాటుగా, భర్త గతించాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవన్నీ చాలా కాలానికి లోకానికి తెలిశాయి. చాలా ఏళ్ల తర్వాతే సమాజం, దేశం ఆమెను గుర్తించింది.

11 ఏళ్ల వధువు
జానకి అమ్మాళ్‌కు రామానుజన్‌తో పెళ్లి నాటికి ఆమె వయసు 11. రామానుజన్‌కు 21. రామానుజన్‌ కుటుంబం కుంభకోణంలో నివసించేది. జానకి అమ్మాళ్‌ ఊరు మరుదూరు. జానకి తల్లితో రామానుజన్‌ తల్లికి స్నేహం ఉండేది. అలా జానకి తల్లిని రామానుజన్‌ తల్లి తన కుమారుడితో జానకి సంబంధానికి ఒప్పించింది. అయితే మరుదూరుకు, కుంభకోణానికి దాదాపు 7 గంటల దూరం ఉంది. అది ఈ కాలంలో. ఆ కాలంలో ఎంత సేపు పట్టేదో చెప్పలేము. జూలై 14, 1909 నాడు ముహూర్తం పెట్టుకుని ఐదు రోజుల పెళ్లి ప్లాన్‌ చేసుకుంటే తల్లి, బంధువులతోపాటు రామానుజన్‌ రావడం ఆలస్యం అయ్యింది. ముందే చేరుకోవాల్సిన పెళ్లికొడుకు రాకపోయేసరికి ఆడ పెళ్లి వాళ్లు చాలా ఆందోళన చెందారు. ఒక దశలో ముహూర్తం సమయానికి కూడా రాకపోతే ఇంకో అబ్బాయికి ఇచ్చి కట్టపెడదాం అనుకున్నారు. కాని రామానుజన్‌ రావడంతో పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో రామానుజన్‌ తండ్రి లేడు. ఆయన క్లర్క్‌ పని చేసేవాడు. సెలవులు కుదరక పెళ్లిళ్లకు తండ్రులు హాజరు కాకపోవడం ఆ రోజుల్లో మామూలుగా పరిగణించబడేది.

13వ ఏట నుంచి కాపురానికి
పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు జానకి తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయింది. ఈడేరాకే ఆమెను 13 ఏళ్లకు కాపురానికి తీసుకెళ్లారు. కాని రామానుజన్‌ ఆరోగ్యం ఎప్పుడూ సున్నితమే. అతను తరచూ జబ్బు పడేవాడు. పెళ్లి తర్వాత కూడా ఒక సర్జరీ అవసరమయ్యి అందుకు డబ్బులేక బాధ పడ్డాడు. తర్వాత ఒక డాక్టరు ఫ్రీగా చేస్తానని ముందుకు రావడంతో ఆ అవస్థ తప్పింది. రామానుజన్‌ చాలా బిడియ స్వభావి. పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు. అతడు ఒక పెద్ద పలక మీద తన థీరమ్స్‌ సాధన చేసేవాడు. నోట్‌ బుక్స్‌లో తన గణిత పరిష్కారాలు రాసేవాడు. ఆయన పిలిచినప్పుడు పలకడమే జానకి చేయవలసిన పని. ఇంట్లో రామానుజన్‌ తల్లి, బామ్మ ఉండేవారు. రామానుజన్‌ను, జానకిని ముద్దు చేస్తూ అన్ని వ్యవహారాలు వారే చూసుకునేవారు. వీరు ఒకరికి ఒకరే గాని రామానుజన్‌ మొదటి భార్య గణితమే కదా.

రెండేళ్ల కాపురం
జానకి అమ్మాళ్‌ రెండేళ్ల పాటే రామానుజన్‌తో కాపురం చేసిందని చెప్పాలి. 1912లో కాపురానికి వస్తే 1914 లో రామానుజన్‌ ఇంగ్లాండ్‌ వెళ్లాడు. 1919 లో జబ్బు పడి తిరిగి వచ్చే వరకూ అక్కడ ఒక్కడే ఉన్నాడు తప్ప భార్యను తెచ్చుకునే పరిస్థితి లేదు. జబ్బు పడినప్పుడు ఒక మనిషి తోడుగా ఉండాల్సి వచ్చినా మొదటి ప్రపంచ యుద్ధ రోజులు కనుక జానకి ఇంగ్లాండ్‌ వెళ్లలేక పోయింది. భార్యను పిలిపించుకుని ఇటలీ వంటి వెచ్చటి దేశానికి వెళ్లు అని డాక్టర్లు సలహా ఇచ్చినా వీలు లేకపోయింది. చివరకు చాలా అనారోగ్య స్థితిలో రామానుజన్‌ ఇండియా చేరుకున్నాడు. 1919లో ఏప్రిల్‌లో అతడు ఇండియా వస్తే 1920 ఏప్రిల్‌ 26న మరణించేనాటి వరకూ జానకి అతడికి సేవలు చేసింది. మరణించే నాటికి రామానుజన్‌ వయసు 32. ఆమె 20లలోనే ఉంది. అంత చిన్న వయసులో వైధవ్యం చూసిందామె. భర్త గొప్ప జీవితం చూడలేదు. ఆమె కూడా.

దర్జీగా జీవించి
భర్త మరణించాక కొన్నాళ్లు ముంబైలోని సోదరుడి దగ్గర ఉన్న జానకి అక్కడ టైలరింగ్‌ నేర్చుకుని మద్రాసు చేరుకుని రెండు గదుల ఇంట్లో దాదాపు 50 ఏళ్లు జీవించింది. ఆ ఇంట్లో ఉంటూ టైలర్‌గా బతుకుతూ నలుగురికీ టైలరింగ్‌ నేర్పించేది. ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు మరణిస్తే ఆమె ఏడేళ్ల కొడుకును దత్తత తీసుకుంది. ఆ పిల్లవాడే ఆమెకు ఆ తర్వాత అండా దండా అయ్యాడు.

1962లో పెద్ద గుర్తింపు
1962లో రామానుజన్‌ 75 వ జయంతి సందర్భంగా అందరి దృష్టి జానకి అమ్మాళ్‌ మీద పడింది. ఆమె ఒంటరిగా జీవిస్తున్నదని తెలిసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌ ప్రభుత్వాలు జీవిత కాల పెన్షన్‌ను మంజూరు చేశాయి. గణిత అభిమానులు అందరూ కలిసి ఆ రోజుల్లో ఆమెకు 20 వేల రూపాయల పర్సు ఇచ్చారు. హిందూజా ఫౌండేషన్‌ నుంచి నెలకు 1000 రూపాయల పెన్షన్‌ మంజూరు అయ్యింది. ఇంకా ఎందరో ఆమెను రామానుజన్‌ భార్యగా గౌరవించి సత్కరించారు.

అయితే ఆమె తన భర్తలాగే ఎంతో మొహమాటస్థురాలు. సంప్రదాయవాది. ఎవరినీ పెద్దగా కలిసేది కాదు. ‘నా భర్త జీవించి ఉండగా ఆయన చివరి రోజుల్లో నా చేతులతో ఆయనకు అన్నం, మజ్జిగ ఇచ్చాను. కాళ్లు పట్టాను. ఆయనకు అవసరమైన వేడి నీళ్లు కాచడానికి వాడిన రెండు గిన్నెలను ఆయన జ్ఞాపకంగా ఉంచుకున్నాను.’ అంటుంది జానకి అమ్మాళ్‌. జానకి అమ్మాళ్‌ తన 94వ ఏట భర్త మరణించిన నెలలోనే ఏప్రిల్‌ 13, 1994న తుది శ్వాస విడిచింది.

చదవండి: Toilet Cleaning Robot: టాయిలెట్‌ క్లీన్‌ చేసే రోబో.. ధర 40 వేల రూపాయలు!
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement