ఎల్.ఎస్.డి. సోకిన ఆవు శరీరంపై కణుతులు
కొద్ది నెలలుగా పశువులకు అక్కడక్కడా లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్.ఎస్.డి.) సోకుతూ రైతులను బెంబేలెత్తిస్తోంది. ఇది క్యాప్రిపాక్స్ అనే వైరస్ కారణంగా సోకుతోంది. దోమలు, పిడుదులు, ఇతర కీటకాల ద్వారా బలహీనంగా ఉన్న పవువులకు సోకుతుంది. కలుషిత దాణా, నీరుతో పాటు.. సరిగ్గా శుభ్రం చేయిన పరికరాలతో భారీ స్థాయిలో వాక్సిన్లు వేయడం, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా ఈ అంటు వ్యాధి ప్రబలుతోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) పేర్కొంది.
పశువు వంటిపైన అనేక భాగాల్లో బొబ్బలు, కణుతుల మాదిరిగా రావటం దీని ప్రధాన లక్షణం. కుంకుడు గింజ నుంచి చిన్న నిమ్మకాయ అంతటి కణుతులు వస్తాయి. వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల్లో జ్వరం, దురదలు, ముక్కులు, కళ్ల నుంచి స్రావాలు కారటం కనిపిస్తాయి. కనుగుడ్లు ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవటంతో పశువు నీరసిస్తుంది. తగిన చికిత్స అందకపోతే కణుతులు పగిలి పశువును బాధిస్తాయి. మందలలో 10–20 శాతం పశువులకు ఇది సోకుతున్నట్లు గుర్తించారు.
అయితే, ఈ వైరస్ బారిన పడిన పశువుల్లో తగిన చికిత్స లభించని పక్షంలో 2 నుంచి 4 శాతం చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. పశువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకదని నిపుణులు చెబుతున్నారు. ఇది పాడి పశువులకు ఈ వైరస్ సోకితే పాల దిగుబడి తగ్గిపోతుంది. అయితే, దూడలకు ఎక్కువగా సోకుతుంది. సాధారణంగా పశువైద్యులు ఈ వ్యాధి వచ్చిన పశువులకు ఇంజక్షన్లు, యాంటిబయోటిక్స్‌తో చికిత్స చేస్తున్నారు.
అయితే, కేవలం ఇంటి వైద్యంతోనే ఈ వైరస్ వ్యాధిని 4–5 రోజుల్లో సంపూర్ణంగా నయం చేయవచ్చని, పశు మరణాల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని పశు వైద్య నిపుణులు డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు(99122 92229) తెలిపారు. ఔషధ మొక్కల ఆకులతో చేసిన కషాయం, పైపూత లేపనంతో లంపీ స్కిన్ డిసీజ్‌ను పారదోలవచ్చని ఘంటాపథంగా చెప్పారు.
హైదరాబాద్‌కు చెందిన గోసేవకుడు రవికి చెందిన గిర్ ఆవుకు ఈ వైరస్ సోకి వంటిపైన కణుతులు వచ్చాయి. డా. సాయి బుచ్చారావు సూచన మేరకు.. ఔషధ మొక్కలతో తయారు చేసిన ద్రావణం ఆవుకు తాగించి, ఔషధ మొక్కల ఆకులు నూరి ఆవు శరీరానికి పూయటంతో నాలుగైదు రోజుల్లో ఈ జబ్బు నుంచి ఆవు పూర్తిగా కోలుకుందని రవి (90007 00020) తెలిపారు. ఈ ఫలితం చూసి తొలుత ఇంజక్షన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారని అన్నారు. తనతోపాటు ఇతర రైతులు కూడా ఈ చికిత్సతో మంచి ఫలితాలు సాధించారన్నారు.
కషాయం తయారు చేసే విధానం
100 గ్రాములు వేప ఆకులు, 100 గ్రాములు తులసి ఆకులు, 100 గ్రాములు పసుపు, 50 గ్రాములు మిరియాలను అర లీటరు (500 ఎం.ఎల్.) నీటిలో వేసి మరిగించాలి. రెండు పొంగులు వస్తే చాలు. ఇలా తయారు చేసిన 200 గ్రాముల కషాయాన్ని పశువుకు తాగించాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 నుంచి 5 రోజులు తాగించాలి.
పైపూత మందు తయారు చేసే విధానం
కలబంద ఆకుల గుజ్జు, పసుపు, గోరింటాకులను కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్దను పశువు వంటికి లేపనంగా పట్టించాలి. శరీరం అంతా రాస్తే మంచిది. ఒకవేళ వీలుకాకపోతే కణుతులు తేలిన ప్రాంతాల్లో రాసినా పర్వాలేదు.
ఈ లేపనం పూయక ముందు 2 శాతం (వంద లీటర్ల నీటికి 2 కిలోల ఉప్పు) ఉప్పు ద్రావణంతో పశువును శుభ్రంగా కడగాలి. ఖర్చు లేకుండా రైతులు ఈ చికిత్స ద్వారా లంపీ స్కిన్ డిసీజ్ బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment