కోరలు ఉన్నప్పుడు అది సెక్షన్ 377. కోరలు తీసేశాక స్త్రీసెవంటీసెవన్. అవును! ఈ చరిత్రాత్మక కేసును గెలిచిన బృందంలోని సారథ్య స్త్రీకి ఈ క్రెడిట్‌ను ఇవ్వాల్సిందే.
ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377 తలవంచింది. ఇంద్రధనుస్సు జెండా రెపరెపలాడింది! ఈ న్యాయ పోరాటాన్నే కాదు, ఎల్‌జీబీటీల మనసుల్నీ గెలిచిన ధీర వనిత మేనకా గురుస్వామి. కేసును వాదించి గెలిపించిన ఆల్ మెన్ లాయర్స్ టీమ్‌లో ఒకే ఒక్క మహిళ! మనుషులంతా సమానమే అని నమ్మే ప్రతి ఒక్కరి ప్రశంసలూ అందుకుంటున్న ఈ మానవీయ న్యాయవాది గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది.
మేనక హైదరాబాద్‌లో పుట్టింది. ఢిల్లీలో పెరిగింది. చదరంగం ఆటంటే చాలా ఇష్టం ఆమెకు. లా చదువుతున్నప్పుడే ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ కావాలనుకుంది. టీన్స్‌లో ఉన్నప్పుడు.. పాప్ సింగర్ మడోన్నాకు బ్యాకప్ సింగర్ కావాలని పాటలు, డాన్స్ ప్రాక్టీస్ చేసేదట. ‘‘నీకంత టాలెంట్ లేదు ఆపు’’ అంటూ కజిన్స్ ఆమె ఆశల మీద నీళ్లు పోశారు. ‘‘సన్నగా ఉన్న నేను స్టెప్పులేస్తుంటే.. స్కెలిటన్ డాన్స్ చేస్తున్నట్టుంది అంటూ నవ్వేవాళ్లు నా కజిన్స్, ఫ్రెండ్స్’’ అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటుంది మేనక.
మైండ్‌లో ఫిక్సైపోయింది
మేనకకు పుస్తకాలు చదవడమంటే చిన్నప్పటి నుంచీ ఆసక్తి. ప్రముఖ రచయిత జేమ్స్ బాల్డ్‌విన్ చెప్పిన ‘‘ఎదురైన ప్రతి పరిస్థితీ మారకపోవచ్చు.. కాని పరిస్థితులను ఎదుర్కోనిదే ఏ మార్పూ సాధ్యంకాదు’’ అనే మాటలను మైండ్‌లో ఫిక్స్ చేసుకుంది. అందుకే మడోన్నా, చెస్‌లను ఛస్ అనుకొని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలో బిఏ ఎల్‌ఎల్‌బీ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్లి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో బీసీఎల్, హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌మ్ పట్టా పుచ్చుకుంది.
అంతకన్నా విశేషం మేనకా రోడ్స్ (ఖజిౌఛ్ఛీట) స్కాలర్. ఆక్స్‌ఫర్డ్‌లోని రోడ్స్ (ఖజిౌఛ్ఛీట) హౌజ్‌లోని మిల్నర్ హాల్లో ఆమె చిత్రపటాన్ని కొలువుదీశారు. ఈ అరుదైన గౌరవం దక్కిన తొలి భారతీయ మహిళ ఆమే. ఆక్స్‌ఫర్డ్‌లో సివిల్ లా చదువుతున్నప్పుడు ఆ హాల్ వెంట నడుస్తూ చాలాసార్లు అనుకునేదట.. ఎందుకు ఈ హాల్లో నాలాంటి ఒక్క మహిళా పోట్రైట్ కనిపించదు? అని. ఆ టైమ్‌లో మేనక కనీసం ఊహించి కూడా ఉండదు తర్వాత కాలంలో తన పోట్రైటే అక్కడ ఉంటుందని.
ధారపోసేందుకే తిరిగి రాక
లా చదువుతున్నప్పడే ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటినీ అధ్యయనం చేసింది మేనక. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న విషయాన్నీ గ్రహించింది. న్యాయశాస్త్రం చదివాక అమెరికా వెళ్లింది. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా లో ఫ్యాకల్టీగా న్యాయశాస్త్రం బోధిస్తూనే ఇంకోవైపు యునైటెడ్ నేషన్స్‌కి హ్యూమన్‌రైట్స్ కన్సల్టెంట్‌గా పనిచేసింది.
క్షణం తీరికలేకుండా అమెరికాలో బిజీగా ఉంది కాని మేనక మనసంతా ఇండియాలోనే. ఎందుకంటే ఆమెకు కాన్‌స్టిట్యూషనల్ లా.. ముఖ్యంగా ఇండియన్ కాన్‌స్టిట్యూషనల్ లా అంటే ప్రాణం. రాజ్యాంగం కల్పించే హక్కుల పరిరక్షణ కోసమే తన కెరీర్‌ను ధారపోయాలనుకుంది అందుకే భారతదేశానికి తిరిగొచ్చేసింది. సుప్రీంకోర్ట్ అడ్వొకేట్‌గా ఢిల్లీలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది.
తొలి యుద్ధం.. విద్యహక్కు కోసం
రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఎన్ని దుర్వినియోగ మవుతున్నాయో తెలుసుకుంది మేనక. వాటి పోరుకి సిద్ధపడింది. అలాంటి వాటిల్లో ఆమె ఎక్కుపెట్టిన తొలి అస్త్రం రైట్ టు ఎడ్యుకేషన్. పేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇవ్వాలనే నియమం వచ్చింది మేనక వల్లే.
‘‘అయితే ఇప్పటికీ చాలాచోట్ల ప్రైవేట్ స్కూళ్లు ఆ రూల్‌ని అమలు చేయట్లేదు. పేద పిల్లలకు సీట్ ఇవ్వాల్సి వస్తుందని తమ స్కూళ్లను మైనారిటీ స్కూళ్లుగా మార్చేసుకున్న వాళ్లూ ఉన్నారు. దీని మీద ఇంకా వర్క్ చేయాలి’’ అంటుంది ఆమె. వృత్తి పట్ల అంత నిబద్ధత మేనకకు. తన 20 ఏళ్ల కెరీర్‌లో విజయం సాధించిన కేసులెన్నో.
ఇప్పుడీ.. సెక్షన్ 377
వలస పాలకులు తమ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని చట్టాలంటే మేనకా గురుస్వామికి గుర్రు. కాలం చెల్లిన ఆ చట్టాల్లో సెక్షన్ 377 ఒకటి. కాదు.. ముఖ్యమైనది. దాని ప్రకారం సమానత్వపు హక్కుకు దూరమై సమాజం దృష్టిలో హేళనకు గురవుతున్న ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి అండగా నిలిచింది.
వాళ్లు చేస్తున్న పోరాటానికి న్యాయ సహాయం అందిస్తున్న బృందంలో ఏకైక మహిళగా ముందుంది. వాళ్లకు మద్దతుగా వాదించింది. పర్యవసానమే.. మొన్న, ‘హోమోసెక్సువాలిటీ నేరం కాదు’ అంటూ సుప్రీంకోర్టు సెక్షన్ 377ను çసడలించడం. అది ఎల్‌జీబీటీలకు మేనక అందించిన గెలుపు. ఎల్‌జీబీటీ కమ్యూనిటీ కూడా మానవ సమూహమే.. వాళ్లకు గౌరవం అందాలని వాదించింది ఆమె.
ప్రయాణాలు అంటే ప్రాణం
నేపాల్ వంటి దేశాల రాజ్యాంగ రచనలో సహకారం అందించిన మేనకా యేల్ వంటి యూనివర్సిటీల్లో గెస్ట్ ప్రొఫెసర్‌గా న్యాయ పాఠాలు చెప్పేందుకు వెళుతుంటారు. ట్రావెలింగ్ ఆమె అభిరుచి. వియాన్నా, కేప్ టౌన్, టోక్యో, న్యూయార్క్ ఆమె ఫేవరేట్ ప్లేసెస్. ప్రపంచంలోని ప్రతి మూలా చుట్టి రావాలని ఆమె సంకల్పం. కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషించడం అంటే ఇష్టం. ‘‘వృత్తిలో భాగంగా చాలా దేశాలు, ఊళ్లూ తిరుగుతాను. కానీ ఢిల్లీ అంటే పడి చచ్చిపోతా. చలికాలం రాత్రుళ్లు ఇక్కడి చారిత్రక కట్టడాలను చూస్తూ ఆ పేవ్‌మెంట్స్ మీద నడవడమంటే పిచ్చి సరదా. అసలు నన్ను ఈ దేశానికి రప్పించిన రీజన్స్‌లో ఇదీ ఒకటి కావచ్చు’’ అంటుంది.
బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్? అని అడిగితే.. ‘‘న్యాయమైన తీర్పులో భాగమైనవన్నీ. అఫ్‌కోర్స్ అలాంటి సందర్భాలు తక్కువే కావచ్చు.. కానీ ఉంటాయి. అలాంటి తీర్పు వచ్చినప్పుడల్లా సంతోషంగా ఉంటుంది’’ అని చెప్తుంది మేనక. ‘‘లా .. వండర్‌ఫుల్ ప్రొఫెషన్. కాని ఈ దేశంలో ఓ మహిళగా.... మహిళా లాయర్‌గా.. నీ మనసు ఏం చెబుతుందో అదే వినాలి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. లేకపోతే ‘‘ఆడపిల్లవు.. నువ్వేం చేయగలవు.. నీకు ఇది అవసరమా’’ అంటూ అనుక్షణం వెనక్కిలాగే ఈ సొసైటీని జయించలేం. మన మీద మనకు నమ్మకం చాలా ఉండాలి.. అప్పుడే ఇలాంటివన్నీ ఓవర్‌కమ్ చేయగలం’’ అని తాను ఆచరించే సత్యాన్ని బయటపెట్టింది మేనకా గురుస్వామి.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment