
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): అత్తను ఆమె అల్లుడే కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నైనవరం ఫ్లై ఓవర్‌పై శనివారం రాత్రి చోటుచేసుకుంది. మామను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. వేగంగా బైక్ నడిపి తప్పించుకోగలిగాడు. ఈ ఘటన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన గోగుల నాగమణి (50), గురుస్వామి భార్యాభర్తలు.
వీరికి ముగ్గురు సంతానం కాగా, రెండో కుమార్తె లలితను ఏకలవ్యనగర్‌కు చెందిన కుంభా రాజేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలంగా రాజేశ్, లలిత మధ్య గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. అప్పటి నుంచి లలిత పుట్టింట్లోనే ఉంటోంది. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. కేసు చివరి దశలో ఉంది. ఈ క్రమంలో రాజేశ్ తన అత్త, మామలను చంపేందుకు ప్లాన్ చేశాడు.
కాలనీ నుంచే అత్తమామలను వెంబడించి..
శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో వైఎస్సార్ కాలనీ నుంచి సాయిరాం థియేటర్ వద్ద ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి నాగమణి, గురుస్వామి బైక్‌పై బయలుదేరారు. వీరి బైక్‌ను ఇంటి నుంచే రాజేశ్ మరో వ్యక్తితో కలిసి మరో ద్విచక్ర వాహనంపై వెంబడించాడు. నైనవరం ఫ్లై ఓవర్ మధ్యన ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వద్దకు వచ్చేసరికి బైక్ వెనుక కూర్చున్న రాజేశ్ అత్త నాగమణిపై కత్తితో వేటు వేశాడు.
భుజంపై కత్తి వేటుపడగా.. నాగమణి పెద్దగా కేకలు వేస్తూ కిందపడిపోయింది. దీంతో ఆమె మెడపై కత్తితో నరికాడు. అదే సమయంలో బైక్‌పై ఉన్న గురుస్వామి భయంతో వేగంగా అక్కడి నుంచి వెళ్లి తప్పించుకున్నాడు. కాగా, రక్తం మడుగులో పడి ఉన్న నాగమణి కొద్దిసేపు గాయాలతో విలవిల్లాడింది. ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందింది. నాగమణి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఫ్లై ఓవర్‌కు మూడు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు రాజేశ్, అతడికి సహకరించిన వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.