స్వాతి లక్రా
మన రాజ్యాంగానికి స్ఫూర్తి ప్రకృతే! అందుకే స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా ఇద్దరికీ సమన్యాయం పంచింది. అది అర్థం చేసుకోలేక.. అమలులో తేడాలు కనిపిస్తున్నాయి. అవగాహన పెంచుకునే చైతన్యం కరువై నేరాలు జరుగుతున్నాయి. హక్కులు ఎరుగక దాష్టీకానికి బలవుతున్నారు ఆడవాళ్లు, పిల్లలు! నిర్భయ చట్టం వచ్చినా దిశ ఘటన జరిగింది. ఇలాంటి దుర్ఘటనలు ఇక జరగకుండా.. మహిళలు తమ హక్కులు, వాటిని పరిరక్షించే చట్టాల గురించి దిశానిర్దేశం చేసేందుకే నేడు సాక్షి ‘ఫన్‌డే’ను ‘దిశ ప్రత్యేక సంచిక’గా వెలువరించింది. మహిళల భద్రత ప్రభుత్వాల బాధ్యతేకాదు.. వ్యక్తిగత బాధ్యతగానూ భావించి.. ఈ సంచికను లీగల్ గైడ్‌గా.. హ్యాండ్‌బుక్‌గా భద్రపర్చుకోవచ్చు అంటూ ఇంకో రెండు మంచి మాటలూ చెప్పారు తెలంగాణ పోలీస్ విభాగంలోని ‘విమెన్ సేఫ్టీ వింగ్’ఐజీ స్వాతి లక్రా..‘‘ఈ పుస్తకంలో ఉన్నవి మహిళలే కాదు మగవాళ్లూ తెలుసుకోవాలి.
మహిళలకు సంబంధించిన హక్కులు, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాలను మగవాళ్లూ అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే ఒక కుటుంబంలోని వాళ్లంతా తెలుసుకోవాలి. అమ్మాయిల మీద ఆంక్షలు పెట్టడం కాదు అబ్బాయిల మీద బాధ్యత పెట్టాలి. ఆడపిల్లలను గౌరవించాలనే బాధ్యత పెట్టాలి. వాళ్లూ తన తోటి.. తనతో సమానమైన పౌరులే అనే స్పృహను కల్పించాలి. ఇది తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని. పేరెంట్స్ మగపిల్లలకు నేర్పించాల్సిన ముఖ్య విషయం. ఇది ప్రతి ఇంటినుంచి మొదలైనప్పుడే ఆడవాళ్ల మీద జరుగుతున్న నేరాలకు చెక్‌పడుతుంది. ఇంకో విషయం.. అమ్మాయికేదైనా జరిగితే అది అమ్మాయిదే తప్పు అనే భావనలోంచి బయటకు రావాలి సమాజం. ఆమె వస్త్రధారణనో ఇంకోటో కారణంగా చూపడం మానేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మాయిలో తప్పు వెదకడం మానేసి నేరం చేసిన వారి ప్రవర్తన మార్చే ప్రయత్నం జరగాలి. అలాగే అమ్మాయిలూ తప్పు తమదేనేమో అనే ఆత్మన్యూనతలోకి పోవద్దు. మహిళల మీద నేరాలకు సమాజం బాధ్యత వహించాలి.
మహిళలకు అండగా ఉండాలి. ఒక ఇంట్లో అమ్మాయికేదైనా జరిగింది అంటే అది అమ్మాయికి మాత్రమే కాదు మొత్తం కుటుంబ సభ్యులందరికీ బాధే. ఆ సమయంలో ఆ అమ్మాయి, ఆ కుటుంబం కుంగిపోకుండా సమాజం అండగా ఉండాలి. అంతేకాదు.. అన్యాయాన్ని, ఇబ్బందిని, హింసను, నేరాన్ని మౌనంగా భరించకుండా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దానివల్ల బాధితులకు న్యాయం జరగడమే కాదు.. తప్పు చేసిన వాళ్లకు శిక్షపడి.. భవిష్యత్‌లో ఇంకో అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. మహిళల మీద జరుగుతున్న దాష్టీకాలను మహిళల సమస్యలుగా చూడొద్దు. ఇవి అందరికీ సమస్యలే. మొత్తం సమాజానికే సమస్యలు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు భయవిహ్వలం కావాల్సిన అవసరంలేదు. హండ్రెడ్‌కు డయల్ చేయండి. పరిస్థితిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనండి. పోలీస్‌ల అండ మీకెప్పటికీ ఉంటుంది’’.
Comments
Please login to add a commentAdd a comment