సోగ్గాడు
అద్దం ముందు అరనిమిషం నుంచుంటే... ఆడవాళ్లలా అంతసేపేమిటో మేకప్ అంటూ ఎద్దేవా... కాసింత బాగా డ్రెసప్ అయితే చాలు అబో!్బ అమ్మాయిల్ని మించిపోయి సోకులు చేస్తున్నావే అంటూ వ్యంగ్యోక్తులు... ఇవన్నీ ఇప్పుడు గతమైపోయాయి. పురుషులు సైతం మహిళలను తలదన్నేలా సౌందర్యాన్ని సంతరించుకునే పనిలో పడ్డారు. చక్కదనాల చుక్కడు... వంపుసొంపుల వయ్యారుడు... అంటూ పొగిడించుకోవాలనే స్థాయిలో ఈ తపన పెరిగిపోతుండడంతో మెన్స్ పార్లర్ సేవలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి.
ఆడది మాత్రమే కాదు మగవాడైనా సరే అందంగా కనపడకపోతే ఎలా... అనే ఆలోచన విస్తరించి, ఇప్పుడు ఈ విషయంలో ఆడవారిని మించి మగాడు ముందుకొచ్చేస్తున్నాడు. నీల్సన్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం... దాదాపు 34 శాతంగా ఉన్న ఇండియన్ మెన్స్ గ్రూమింగ్ మార్కెట్‌కు ఇప్పుడు ఊపు నిస్తోంది మగవాళ్ల సౌందర్యస్పృహే. ఈ మార్కెట్ పెరుగుదల వేగం మహిళల గ్రూమింగ్ మార్కెట్ వేగాన్ని అధిగమించిందట.
తారలే స్ఫూర్తిగా...
మగవాళ్లలో పెరుగుతున్న సౌందర్యపోషణ నేపథ్యంలో వారివైపు దృష్టి సారించాయి కాస్మెటిక్ బ్రాండ్స్. అందమైన కేశాలివిగో అంటూ గార్నియర్‌కు జాన్ అబ్రహాం, చర్మ సౌందర్యానికి నివియా టాక్ వాడమని అర్జున్ రామ్‌పాల్ వంటి బాలీవుడ్ నటులు ప్రకటనల సాక్షిగా చెప్పే మాటలకి ఆకర్షితులవుతున్న మగవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ‘‘చక్కగా కనిపించడం మగవాళ్లకి కూడా అవసరం. ఎండలో ఎక్కువ గడిపే పురుషుల చర్మంపై సూర్యుని యువి రేసెస్ తీవ్ర ప్రభావం చూపుతాయి’’ అంటూ మాజీక్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్నితెరపై ప్రకటనలు మగవాళ్లను బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం బారులు తీరేలా చేస్తున్నాయి. మరోవైపు చక్కగా పనిచేయడం మాత్రమే కాదు చక్కగా కనపడడం కూడా అంతే ముఖ్యం అంటూన్న కార్పొరేట్ కంపెనీలు సిబ్బంది లుక్‌కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. విభిన్న నేపథ్యాల నుంచి ఐటీ రంగంలోకి ప్రవేశించే పురుషుల్లో అందంపై స్పృహ పెంచడానికి ప్రత్యేకంగా గ్రూమింగ్ క్లాసెస్ సైతం నిర్వహిస్తున్నాయి. బెస్ట్ డ్రెస్డ్ ఎంప్లాయీ ఆఫ్ ది వీక్ వంటి అవార్డ్స్‌తో మగవాళ్లలో సెల్ఫ్‌లుక్ పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
రోజువారీ...
సౌందర్యపోషణే మరి
వారాంతపు దినాల్లో మాత్రమే కాదు, ప్రతి రోజూ పార్లర్‌కు వెళ్లే మగవాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రోజువారీ మీటింగ్‌లు, పార్టీస్‌కి అటెండవ్వాల్సి రావడం వంటి అవసరాలతో డైలీ గ్రూమింగ్ రొటీన్‌కు పురుషులు అలవాటు పడుతున్నారు. ‘‘ప్రతి రోజూ మా సెలూన్‌కి వచ్చి మినిమం థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ దాకా స్పెండ్ చేసే మగవాళ్లకి కొదవలేదు’’ అని బంజారాహిల్స్‌లోని మేనియా సెలూన్ నిర్వాహకులు సచిన్ అంటున్నారు. పురుషులకు ఉపకరించే స్కిన్ లెటైనింగ్, హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ పార్లర్స్‌లో తప్పనిసరిగా ఉంచాల్సిన ఉత్పత్తులుగా మారాయి. పలు రకాల క్రీమ్స్, లోషన్స్, ఫేస్ స్కర్బ్స్, షవర్ జెల్స్ వంటివి వాడకానికి వీరు సిగ్గుపడడం లేదు. దేశంలో స్కిన్ క్రీమ్ ఉత్పత్తుల మార్కెట్ 27 శాతం కాగా అందులో పురుషులకు సంబంధించినవి 41 శాతం ‘‘మేల్ స్కిన్ కేర్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్‌లో ఒకటి. ఎక్సర్‌సైజ్, మంచి ఫుడ్‌తో పాటు గ్రూమింగ్ రొటీన్ కూడా పురుషుల దినచర్యలో భాగమైంది’’ అని ది బాడీషాప్ ఇండియా సీనియర్ మేనేజర్ సంజాలి గిరి అంటున్నారు.
బాగా కనిపించడమే బాగా కొనిపిస్తోంది...
బ్యూటీ గ్రూమింగ్ మీద పెరిగిన ఆసక్తి మగవాళ్లలో షాపింగ్ సరదాను ప్రేరేపిస్తోందని అసోసియేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (అసోచామ్) చేసిన సర్వే ప్రకారం... మగవాళ్లు గ్రూమింగ్ మీద ఆడవాళ్ల కన్నా బాగా ఖర్చు పెడుతున్నారట. సర్వే చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 85 శాతం మంది తమ సౌందర్య పోషణ ఉత్పత్తులను ఇంటి అవసరాలతో, భార్యల కొనుగోళ్లతో సంబంధం లేకుండా విడిగా కొనుగోలు చేస్తున్నారట. షేవింగ్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్స్, ఎక్స్‌ఫొలయేటర్స్, హెయిర్‌కేర్, హెయిర్ స్టైలింగ్ సొల్యూషన్స్... వంటి వి పురుషుల ఎంపికగా మారుతున్నాయి. బాత్, షవర్ జెల్స్, ఫేస్ వాష్, డియోడరెంట్స్... తదితర అవసరమైన బాతింగ్ ఉత్పత్తులు తమకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. మార్కెట్ విస్తృతికి ఇది దోహదం చేస్తోందని అసోచామ్ ప్రతినిధులు అంటున్నారు. ‘‘మగవాళ్లు తమకు మాత్రమే ప్రత్యేకించిన అప్‌టుడేట్ ఉత్పత్తుల కోసం తరచుగా వాకబు చేస్తున్నారు’’ అని ఐటిసి లిమిటెడ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్‌కు చెందిన బిజినెస్ హెడ్ నిరంజన్ ముఖర్జీ అంటున్నారు. వెటైనింగ్- ఫెయిర్‌నెస్ అంశాల్లో ఎదుగుతున్న పట్టణాలకు చెందిన పురుషులు ఆసక్తి చూపుతున్నారని నివియా ఇండియా రక్షిత్ హర్గావె వెల్లడించారు.
- ఎస్.సత్యబాబు