మెన్‌టోన్
పురుషులందు పుణ్యపురుషులు వేరయా.. అని ‘ఉప్పుకప్పురంబు’ పద్యంలో వేమన సెలవిచ్చాడు. అంటే, పురుషులందరూ పుణ్యపురుషులు కాదని తేల్చేశాడు. పురుషుల మీద ఇది వేమన ఒక్కడి అభిమతమే కాదు, సమస్త సమాజానిది కూడా. ఇంచుమించు పుణ్యపురుషుల్లాంటి వాళ్లను ఇంగ్లిష్‌లో జెంటిల్‌మెన్ అంటార్లెండి. అనడమే గానీ, జంటిల్‌మెన్ అనగా ఎవరు..? వారి రూపురేఖా విలాసంబులెట్టివి..? వారి తీరుతెన్నులు మిగిలిన మెన్నాధములకు ఏ రీతిలో భిన్నముగా ఉండును..? అనే విషయాల మీద ఇంగ్లిష్ వాళ్లకే స్పష్టత లేదు. అయినా, ఏదో మర్యాద కోసం అలా అనేస్తూ ఉంటారు. ఎంతైనా ‘మగా’నుభావులంతా మర్యాదస్తులు కదా! సూటు బూటు హ్యాటు వంటి నానాలంకార భూషితులనే జంటిల్‌మెన్‌గా పొరబడతారు చాలామంది.
నికార్సయిన జంటిల్‌మెన్ అందుకు భిన్నమైన వేషధారణలో కనిపించవచ్చు. అంతమాత్రాన వాళ్లు జంటిల్‌మెన్ కాకుండాపోరు. అలాగే, సూటు బూటు హ్యాటాది అలంకారాలతో మెరిసిపోతూ కనిపించే మాఫియా డాన్‌లూ మనకు తారసిల్లవచ్చు. అలంకారాల మాయలో పడి వాళ్లతో సెల్ఫీలు దిగి, ఫేస్‌బుక్‌లో పెట్టామో..! ఇక అంతే..! అడ్డంగా బుక్కయిపోతాం. అందువల్ల... ఎవరు జంటిల్‌మెన్... ఎవరు మెంటల్‌మెన్... ఎవరు కన్నింగ్‌మెన్... ఎవరు దొంగ... ఎవరు దొర... వంటివి తేల్చుకోవాలంటే... ‘మగా’నుభావులారా..! ఉప్పుకప్పురంబు పద్యాన్ని ఉత్తనే బట్టీపట్టకుండా నరనరాల్లోకి ఇంకించుకోండి. అయినదానికీ, కానిదానికీ మొత్తం మగజాతినే ఈసడించుకుని, నిందించే మాయదారి లోకం కళ్లు తెరిపించండి.
- పన్యాల