
తక్కువ గంటలతోనే ఎక్కువ పని
ఎక్కువ పని జరగాలంటే, ఎక్కువ గంటలు పనిచేయాలా? తక్కువ గంటలు పనిచేయాలా?
ఎక్కువ పని జరగాలంటే, ఎక్కువ గంటలు పనిచేయాలా? తక్కువ గంటలు పనిచేయాలా? అని ఎవరైనా అడిగారనుకోండి. ఏమిటా పిచ్చి ప్రశ్న. ఎక్కువసేపు పనిచేస్తేనే కదా, ఎక్కువ పని అయ్యేది అని మెడకాయ మీద తలకాయ ఉన్నవాళ్ళు ఎవరైనా అంటారు. అంతేనా! అయితే, మెడకాయ మీద తలకాయతో పాటు దానిలో కాస్తంత బుర్ర ఉన్నవాళ్ళు మాత్రం ఠా..ఠ్ అలా కాదు అంటున్నారు. ఎక్కువసేపు పని చేసినంత మాత్రాన ఎక్కువ పని పూర్తవుతుందనేమీ అనుకోనక్కర్లేదంటున్నారు. ఈ విషయంపై స్వీడన్‌లో ఇటీవల ఒక ప్రయోగం చేసి చూశారు. స్వీడన్‌లోని కొందరు యజమానులు తమ ఉద్యోగులకు ఒక అవకాశం కల్పించారు. రోజుకు 6 గంటలే పనిచేసేలా పని విధానం ప్రవేశపెట్టారు. దీని వల్ల ఆఫీసులో పని ఎంత బాగా జరుగుతుందో అని చూశారు.
ఈ ప్రయోగంలో తేలింది ఏమిటంటే, ఆఫీసులో మరీ ఎక్కువ పని గంటలు పనిచేసినా, చేయించినా పని ఎక్కువ జరగట్లేదట! పెపైచ్చు, పని నాణ్యత తగ్గుతోందట! స్వీడన్‌లో నర్సుల విషయంలో ఈ ప్రయోగం మరెన్నో ఆసక్తికర అంశాల్ని వెలికి తెచ్చింది. గత ఏడాది వారందరికీ రోజుకు 6 గంటల మించి పని చేయాల్సిన అవసరం లేదని హుకుం జారీచేశారు. ఇలా రోజుకు 6 గంటల పని విధానం వల్ల ఉద్యోగుల్లో ఆనందం మునుపటి కన్నా బాగా ఎక్కువైంది. ఇంటా, బయటా హుషారు పెరిగింది. పనిలో ఉత్పాదకతా ఎక్కువైంది.
సాక్షాత్తూ స్వీడన్ ప్రభుత్వం నిధులు వెచ్చించి ఈ అధ్యయనం జరిపింది. పని ఒత్తిడి పెంచి, ఎక్కువ పని గంటలు చేయించే కన్నా - ఇలా ఒత్తిడి తగ్గించడం వల్ల నర్సుల నైతిక స్థైర్యం పెరిగిందట! అలాగే, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించగలిగారట! ఎక్కువ పని గంటలు పనిచేస్తున్నవాళ్ళతో పోలిస్తే వీళ్ళు ‘అనారోగ్యంతో సెలవు’ పెట్టడం సగానికి సగం తగ్గింది. అలాగే, మామూలు సెలవులు పెట్టడం కూడా తగ్గింది. వీటన్నిటితో పాటు అదనపు పని గంటలు చేయాల్సిన అవసరం లేని నర్సులు మునుపటి కన్నా 64 శాతం ఎక్కువ పని చేయగలిగారు.
పని గంటలకు, నిజంగా జరిగే పనికీ మధ్య అనుబంధం విషయంలో స్వీడన్‌లో ఇప్పటికి దశాబ్దకాలంగా చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఉద్యోగుల్ని మానసికంగా ఒత్తిడికి దూరంగా పెట్టినకొద్దీ, వారి ఉత్పాదకత పెరుగుతుందనే విషయం స్వీడన్‌లో పరిశోధకులు పదే పదే నిరూపిస్తున్నారు. మరి, ఈ విషయాన్ని మిగతా ప్రపంచం వింటోందా? పని తీరు మెరుగవడంతో పాటు ఉద్యోగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్న మాటను చెవికెక్కించుకుంటుందా?