నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇంతవరకు పిల్లలు లేరు. కొన్నాళ్ల క్రితం స్కానింగ్ తీయిచాం. ఓవరీలలో సిస్ట్ ఉందని తెలిసింది. భవిష్యత్తులో అది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందని మా ఫ్రెండ్స్ చెబుతుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. సిస్ట్ ఉన్నవారికి సంతానం పొందే అవకాశాలు ఎలా ఉంటాయి. ఈ విషయమై నాకు వివరంగా చెప్పండి.
ఓవేరియన్ సిస్ట్ (అండాశయాల్లో నీటితిత్తులు) ఉండటం అన్నది చాలా సాధారణ సమస్య. ఇవి చాలామందిలో కనిపిస్తుంటాయి. ఈ నీటితిత్తులు క్యాన్సర్ కణాలుగా మారవు. చాలామందిలో అవి కొద్దికాలం పాటు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న మహిళలు డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయించాల్సి వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకొని అలా వాళ్ల కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చి ఉంటే వారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒవేరియన్ సిస్ట్‌లు వాటంతట అవే తగ్గిపోతాయి.
అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్ అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చేయడం కూడా చాలామందిలో సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్‌లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్ కారణంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. ఇక గర్భధారణ అవకాశాల విషయానికి వస్తే మీకు గర్భధారణ జరగకపోవడానికి ఇంకా ఏయే అంశాలు కారణమో పూర్తిగా విశ్లేషించాల్సి ఉంటుంది. దాంతోపాటు మీలో వస్తున్న సిస్ట్‌లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరమే. అంతేకాకుండా మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి.
ఎండోమెట్రియాసిస్‌కు సర్జరీ అయ్యింది... పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా?
నా వయసు 35 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు అవుతోంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్‌ను కలిశాను. అక్కడ నాకు ‘ఎండోమెట్రియాసిస్’ ఉందని వైద్యులు నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలున్నాయా? నాకు పీరియడ్స్ సమయంలో మళ్లీ మళ్లీ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయా?
ఎండోమెట్రియాసిస్ సమస్య రావడం అన్నది చాలామంది మహిళల్లో కనిపించ. సాధారణమైన విషయం. ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో ఈ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అయితే మరి కొంతమందిలో మాత్రం నొప్పి మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో దాన్ని నియంత్రించవచ్చు. అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడంతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతూ నొప్పిని అదుపులో ఉంచవచ్చు. కానీ కొందరిలో మాత్రం నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో వాళ్లు మళ్లీ గర్భధారణను కోరుకోకపోతే... వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. అయితే నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు.
మీ లేఖను బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్’ (అంటే గర్భధారణకు అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది. మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్/మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండటం వల్ల లాపరోస్కోపిక్ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల (ఒవ్యులేషన్) అయ్యేలా చేసి, ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్) వంటి ప్రక్రియలను అనుసరిస్తే... మీలో గర్భధారణకు కొంతవరకు అవకాశాలు ఉండవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్ (సివియర్ ఎండోమెట్రియాసిస్) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతాన సాఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు సంబంధిత నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ ప్రీతిరెడ్డి
సీనియర్ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
బర్త్ రైట్ బై రెయిన్‌బో, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment