థెరిసా కెన్ | Mother therisatherisa Ken. | Sakshi
Sakshi News home page

థెరిసా కెన్

Published Mon, Jul 18 2016 9:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

థెరిసా కెన్

థెరిసా కెన్

థెరిసా మే.. బ్రిటన్ కొత్త ప్రధాని! గత వందేళ్లలో బ్రిటన్ 24 సార్లు... ఎన్నికలతో నిమిత్తం లేకుండా తన ప్రధాన మంత్రుల్ని మార్చింది. కాబట్టి థెరిసా మే అకస్మాత్తుగా ప్రధాని అవడంలో ప్రత్యేకత ఏమీ లేదనిపించవచ్చు. అది నిజం కాదు. థెరిసాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ పార్లమెంటు సభ్యురాలిని ప్రధానిని చేసిన ప్రత్యేకత మాత్రం.. ‘ఆఖరి నిమిషంలో మనసు మార్చుకోవడం’!
 
కలిసి ఉన్నా కలివిడిగా లేరు!
బ్రిటన్‌కు వారం క్రితం వరకు ఉన్న ప్రధాని డేవిడ్ కామెరాన్. ఆయన టీమ్‌లో హోంశాఖ కార్యదర్శి థెరిసా మే. ‘ఐరోపా సమాఖ్యతో బ్రిటన్ కలిసే ఉండాలా? విడిపోవాలా?’ అనే అంశంపై గత నెలలో బ్రిటన్ తలపెట్టిన జనవాక్య సేకరణకు (రెఫరెండమ్) ముందు.. ప్రధాని కామెరాన్, ఆయన బృందం కలిసి.. ‘ఇ.యు.తో బ్రిటన్ కలిసే ఉండాలి’ అని గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారంలో థెరిసా మనస్ఫూర్తిగా పాలుపంచుకోలేదు! దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే... ఇ.యు.తో కలిసి ఉండే విషయంలో ఆమె కామెరాన్‌తో కలిసే ఉన్నారు కానీ... కామెరాన్‌తో కలివిడిగా లేరు! దానర్థం.. ఇ.యు. నుంచి బ్రిటన్ విడిపోవాలని థెరిసా మే కోరుకుంటున్నారని!
 
సింహాన్ని స్వారీ చేయగలరా?
రెఫరెండమ్ ఫలితాలు కామెరాన్ అభీష్టానికి వ్యతిరేకంగా వచ్చాయి. కామెరాన్ నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఆ స్థానంలోకి.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని (విడిపోవడానికి అనుకూలంగా) ‘నైతికత’ సాధించిన థెరిసా మే... వచ్చేశారు. జూలై 13 న ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు మీడియాతో ఆమె ‘‘బ్రెగ్జిట్ మీన్స్ బ్రెగ్జిట్. అండ్ వియ్ ఆర్ గోయింగ్ టు మేక్ ఎ సక్సెస్ ఆఫ్ ఇట్’’ అన్నారు. ఈ మాట ‘కోట్ ఆఫ్ థెరిసా’ అయింది! ప్రధానిగా ప్రస్తుతం ఆమె ముందున్న సవాలు కూడా ఇదే! విడిపోయే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం. అంటే సింహం పెకైక్కి స్వారీ చెయ్యడం.
 
మార్గరెట్... మెర్కెల్... మదర్
పాలిటిక్స్‌లో మార్గరెట్ థాచర్, పోలికల్లో ఏంజెలా మెర్కెల్, పేరులో మదర్ థెరిసా... ఈ ముగ్గురు వ్యక్తుల్నీ గుర్తుకు తెస్తారు థెరిసా మే. మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాని (1979-1990). బ్రిటన్ రెండో మహిళా ప్రధాని థెరిసా మే. థాచర్‌కు ‘ఐరన్ లేడీ’ అని పేరు. థాచర్‌లా థెరిసా కూడా దృఢమైన నాయకురాలిగా వ్యవహరించగలరా? ‘బ్రెగ్జిట్’తో బ్రిటన్‌కు ప్రయోజనాలను సాధించిపెట్టడం, గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న స్కాట్లాండ్‌ను నియంత్రించడం.. వీటితో పాటు మరికొన్ని పాత భూతాలను సీసాలో పెట్టి బంధించడంలో థెరిసా తెగువ , విజ్ఞత చూపించగలరనే పరిశీలకుల అంచనా.
 
ఒకేలా అనిపిస్తారు... కనిపిస్తారు!
జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కి, థెరిసా మే కి ఉన్న పోలికలు ప్రధానంగా వాళ్ల వ్యక్తిత్వానికి, దృఢచిత్తానికి, నిర్భీతికి, నిర్మొహమాటానికి సంబంధించినవి. మాటల్లో, కదలికల్లో ఇద్దరిలోనూ ఒకే విధమైన ఆత్మవిశ్వాసం వ్యక్తమౌతుంటుంది. ఇద్దరివీ క్రైస్తవ సేవా సంఘాలకు పనిచేసిన కుటుంబ నేపథ్యాలే. మెర్కెల్ తండ్రి లూథరన్ పాస్టర్. థెరిసా తండ్రి చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ మతాధికారి. థెరిసా ప్రధాని అయ్యారనగానే బి.బి.సి. ‘ఈజ్ థెరిసా మే.. ది యూకేస్ మెర్కెల్?’ అనే స్టోరీని ఇచ్చింది. ‘యూరప్స్ టూ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ అంటూ వాషింగ్టన్ పోస్ట్ ఇద్దరి మధ్యా రాజకీయ సారూప్యతలను వెదకి పట్టింది.
 
మరో పోలిక... మదర్ థెరిసా!
విశ్వమాత థెరిసాకు, రాజకీయనేత థెరిసాకు ఎక్కడా పొంతన కుదరదు. థెరిసా అన్న పేరున్నంత మాత్రాన థెరిసా మే కు ప్రాముఖ్యం వచ్చేయదు. మరి ఎలా పోలిక? లేకపోవడమే పోలిక! థె రిసా మే లో ‘మదర్’ అన్న మాట లేదు. థెరిసా జీవితంలో మదర్ అనే అపురూప భావన లేదు. అవును. థెరిసా మే కి పిల్లలు లేరు! ‘‘మీ పిల్లలేం చేస్తున్నారు’’ అని ఎవరైనా అడిగితే థెరిసా ఆవేదనకు లోనవుతారట. ఆరోగ్య కారణాల రీత్యా మదర్ కాలేక పోయిన థెరిసాను ‘మదర్’ అనే మాట.. ఆమె ప్రధాని అయ్యే ముందు వరకు కూడా వెంటాడింది!
 
‘మదర్ కామెంట్’పై క్షమాపణ
బ్రిటన్ ప్రధానిగా కామెరాన్ వైదొలగుతున్నట్లు ప్రకటన వెలువడగానే.. థెరిసా మే తో పాటు, బ్రిటన్ ఇంధన వనరుల శాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్ బరిలోకి వచ్చారు! థెరిసా కన్నా ఆండ్రియా ఆరేళ్లు చిన్న. ప్రధాని అభ్యర్థిత్వానికి ఇద్దరి మధ్యా పోటీ మొదలైంది. ఇద్దరి బలాబలాలపై ఎంపీల మధ్య చర్చ ప్రారంభం అయింది. ‘‘ప్రధాని పదవికి మీకున్న అదనపు అర్హత ఏమిటి?’’ అని ఓ చానల్ ఆండ్రియాను ప్రశ్నించింది. ఆండ్రియా ఏమాత్రం తడుముకోకుండా... ‘‘నేను మదర్‌ని. తల్లిగా నాకు అనుభవం ఉంది’’ అని చెప్పారు. ఆ వెంటనే తప్పు తెలుసుకున్నారు. ‘‘నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే వారిని క్షమాపణ కోరుతున్నాను’’ అని అపాలజీ చెప్పారు. దీనిపై థెరిసా ఏమీ స్పందించలేదు. కానీ ఆమె నొచ్చుకునే ఉంటారు. ఆ రాత్రి థెరిసా భర్త ఫిలిప్ ఆమెను ఊరడించే ఉంటారు. అన్నట్టు.. క్షమాపణ చెప్పాక, ఆండ్రియా పోటీ నుంచి వైదొలిగారు. థెరిసా ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైదొలగడానికి ఆండ్రియా చెప్పిన కారణం... తనకు తగినంత మద్దతు లేదని!
 
రాజకీయ రంగ ప్రవేశం
చక్కగా చదువుకుంటున్న అమ్మాయి రాజకీయాల్లోకి ఎందుకొచ్చింది! థాచర్‌ను చూసి స్ఫూర్తి పొందారు థెరిసా. థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాని అయినప్పుడు థెరిసా వయసు 22 ఏళ్లు. బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ప్రమాణ స్వీకారం రోజున థాచర్ వేసుకున్న నీలిరంగు ‘పవర్ సూట్’ థెరిసా మనసులో ఇప్పటికీ ఉండిపోయిందట! బట్టల మాట అలా ఉంచితే.. థాచర్ హయాంలోని రాజకీయ విధానాలకు ‘థాచరిజం’ అనే పేరు రావడం థెరిసాను ఊపేసింది. రాజకీయాల్లో ఆసక్తిని కలుగజేసింది. 29 ఏళ్ల వయసులో.. అప్పటికి చేస్తున్న ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వచ్చేశారు థెరిసా. కౌన్సిలర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి.. ఎంపీగా, బ్రిటన్ ప్రధానిగా ఎదిగారు.
 
నా అన్నవారు లేని ప్రధాని!
థెరిసామే కు తోబుట్టువుల్లేరు. ఇంట్లో ఒకే అమ్మాయి. తల్లిదండ్రుల్లేరు. థెరిసా పెళ్లయిన ఏడాదికే తల్లీతండ్రీ చనిపోయారు. కన్నబిడ్డల్లేరు. ఆమె మాతృమూర్తి కాలేకపోయారు. భర్తే ఇప్పుడు ఆమెకు అన్నీ! జీవితంలోని ప్రతి దశలోనూ థెరిసాకు ఒంటరితనం తోడుగా ఉంటూ వచ్చింది. మరో తోడు.. రాజకీయాలు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక అగ్రరాజ్యానికే తోడుగా నిలబడి, నడిపించవలసిన స్థానంలోకి వచ్చారు. బ్రిటన్‌కు ‘నేనున్నాను’ అనే ధీమాను ఇవ్వవలసిన బాధ్యతను చేపట్టారు.
 
మరికొన్ని విశేషాలు
థెరిసాకు ఆమె భర్త ఫిలిప్ మే..  ఉమ్మడి స్నేహితురాలైన బేనజీర్ భుట్టో ద్వారా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పరిచయం అయ్యారు  థెరిసా భర్త.. ఆమె కన్నా ఏడాది చిన్న. థెరిసా 23వ యేట, ఫిలిప్ మే 22వ యేట 1980లో వాళ్ల వివాహం జరిగింది  థెరిసాకు పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లిదండ్రులు మరణించారు. తండ్రి 1981లో కారు యాక్సిడెంట్‌లో చనిపోతే, తల్లి ఆ తర్వాతి ఏడాదే అనారోగ్యం (మల్టిపుల్ స్క్లెరోసిస్)తో కన్నుమూశారు  థెరిసాకు షూస్ అంటే పిచ్చి. గత ఏడాది మార్చిలో రాణిగారిని కలవడానికి వెళ్లినప్పుడు ఆమె ధరించిన నల్లటి, మోకాళ్ల వరకు ఉండే పేటెంట్ (మెరిసే) లెదర్ షూ మీడియాను విపరీతంగా ఆకర్షించింది   థెరిసా టైప్ 1 షుగర్ పేషెంట్. రోజుకు రెండుసార్లు ఇన్సులిన్‌ను  ఇంజక్ట్ చేసుకుంటారు   పార్లమెంటులో ప్రసంగించే అవకాశం వస్తే థెరిసా ఏమాత్రం వదులుకోరు. పార్లమెంటులో ఎక్కువమంది మహిళలు ఉండాలనేది కూడా ఆమె అభిమతం. థెరిసా ఫెమినిస్టు. మహిళల్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించే ‘ఉమెన్2విన్’ ఉద్యమ కమిటికీ ఒకప్పుడు ఆమె అధ్యక్షురాలిగా ఉన్నారు.
 
చదువు - కొలువు - రాజకీయాలు
బి.ఎ. జాగ్రఫీ    :    ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (1977)
ఉద్యోగం    :    బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (1977-83)
ఫైనాన్షియల్ కన్సల్టెంట్    :    1985-1997
మున్సిపల్ కౌన్సిలర్    :    1986-1994
ఎంపీగా పోటీ    :    1992 (ఓటమి)
ఎంపీగా పోటీ    :    1997 (గెలుపు)
కన్సర్వేటివ్ పార్టీ తొలి మహిళా చైర్మన్‌గా నియామకం : 2002
షాడో కేబినెట్ సభ్యత్వం :    1999-2010
స్త్రీ, సమానత్వం శాఖల మంత్రి : 2010-2012
హోం శాఖ కార్యదర్శి    :    2010-2016 (ఆరేళ్ల రికార్డు కాలం)
ప్రధాన మంత్రి    :    13-7-2016 నుంచి
 
థెరిసా మే (59) బ్రిటన్ కొత్త ప్రధాని
పూర్తి పేరు  థెరిసా మేరీ బ్రేసియర్
జన్మదినం: 1 అక్టోబర్ 1956
జన్మస్థలం ఈస్ట్‌బోర్న్, ఇంగ్లండ్, యు.కె.
తల్లిదండ్రులు జైడీ బ్రేసియర్ (తల్లి) హ్యూబెర్ట్ బ్రేసియర్ (తండ్రి)
భర్త: ఫిలిప్ మే (బ్యాంకర్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement