కామెరాన్ సన్నిహితులకు చెక్
మంత్రివర్గంపై థెరిసా మార్క్!
లండన్: బ్రిటన్ ప్రధానిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన థెరిసా మే, గురువారం మంత్రివర్గానికి షాక్ ఇచ్చారు. కామెరాన్ ప్రధానిగా ఉన్నప్పుడు కీలక స్థానాల్లో కొనసాగిన వారికి ఉద్వాసన పలికారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా గట్టి ప్రచారం నిర్వహించిన బోరిస్ జాన్సన్‌కు అనూహ్యంగా విదేశాంగ మంత్రి పదవి కట్టబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని పదవి రేసులో థెరిసాకు పోటీగా నిలిచిన న్యాయమంత్రి మైకేల్ గోవ్, తొలగింపుల్లో ఆమె తొలి లక్ష్యమయ్యారు. కామెరాన్ మంత్రివర్గంలోని నిక్కీ మోర్గాన్, ఆలివర్ లెట్విన్, జాన్ విట్టింగ్డేల్‌లను కూడా పదవుల నుంచి థెరిసా తొలగించారు.
లిజ్ ట్రస్, జస్టిన్ గ్రీనింగ్‌లకు కొత్తగా మంత్రివర్గంలో చోటుదక్కింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి బాధ్యతలను డేవిడ్ డేవిస్‌కు అప్పగించారు. థెరిసాకు భారత ప్రధాని నరేంద్రమోదీ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషిచేస్తామని అన్నారు.