మిస్టర్ పర్‌ఫెక్ట్
ఏబీ డివిలియర్స్...దక్షిణాఫ్రికా క్రికెటర్. మన లో చాలామందికి అంతవరకే తెలుసు. కానీ తనో అసాధారణ ఆల్‌రౌండర్ అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
సాధారణంగా ఏ క్రీడాకారుడైనా తాను ఎంచుకున్న క్రీడలో ప్రావీణ్యం సాధించేందుకు తీవ్రంగా చెమటోడుస్తాడు. ప్రొఫెషనల్‌గా మారాలంటే చాలా ఏళ్లు పడుతుంది. ఇక జాతీయ జట్టులో చోటు సంపాదించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అయితే మనవాడు మాత్రం ఒక్క క్రికెట్‌లోనే కాదు.. చాలా క్రీడల్లో అందె వేసిన చెయ్యి. ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, రగ్బీ, స్విమ్మింగ్, గోల్ఫ్, బ్యాడ్మింటన్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలి క్రీడల్లో మాంచి ప్రావీణ్యం ఉంది. అంతేకాదు.. అతడు ఆడే ఏ ఆట అయినా తన ప్రతిభతో అందరి మన్ననలు అందుకోవడం ప్రత్యేకత. క్రీడ ఏదైనా బరిలోకి దిగాడంటే మెడలో పతకం పడాల్సిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిలియర్స్ గతంలో చాలా క్రీడల్లో బరిలోకి దిగి అదుర్స్ అనిపించుకున్నాడు.
డివిలియర్స్ ఘనతలు
క్రికెట్‌లో ఎదురులేని ఆటగాడు. అన్ని ఫార్మాట్‌లలోనూ నిలకడగా ఆడతాడు. కెప్టెన్‌గానూ విజయవంతం.
దక్షిణాఫ్రికా హాకీ, ఫుట్‌బాల్ జట్ల సెలక్షన్‌కు షార్ట్‌లిస్ట్‌లో చోటు
జూనియర్ రగ్బీ జట్టు కెప్టెన్
బ్యాడ్మింటన్ అండర్-19 చాంపియన్
స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్‌లో ఆరు రికార్డులు. 100మీ. స్విమ్మింగ్‌లో రికార్డు ఇప్పటికీ తన పేరు మీదే ఉంది.
టెన్నిస్ ఆటలోనూ దిట్టే
గోల్ఫ్ ఆటలోనూ మాంచి ప్రావీణ్యం.