హెయిర్ డై
జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీపడకూడదు. జుట్టు సువాసనలు వెదజల్లాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రే వాడచ్చు. జుట్టు సిల్కీగా మారాలనుకుంటే స్ట్రెయిటనింగ్ షాంపూ, కండిషనర్ వాడితే కొంతవరకు ఫలితం ఉంటుంది.
ముల్తానీ మిట్టి
ముల్తానీ మిట్టి ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం టైట్ అవుతుందని, కాంతిమంతం కూడా అవుతుందని అంటారు. అయితే కాలుష్యం, సరైన జీవనశైలి లేని ఈ కాలంలో ముల్తానీ మిట్టిని వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ముల్తానీ మిట్టి చర్మాన్ని మరింతగా పొడిబారేలా చేస్తుంది. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అంతగా కావాలనుకుంటే 1ఎమ్.ఎల్, 2 ఎమ్.ఎల్ మాత్రమే అదీ ముల్తానీ మిట్టి లిక్విడ్‌ను ఫేస్‌ప్యాక్‌లలో ఉపయోగించవచ్చు.
స్టీమ్
ఫేసియల్ చేసే సమయంలో ముఖానికి ఆవిరి పట్టడం చూస్తుంటాం. అధికంగా ఆవిరిపట్టడం వల్ల చర్మంలోని పోర్స్ ఓపెన్ అయ్యి, చర్మం వదులయ్యే అవకాశాలు ఉన్నాయి. అమితంగా స్క్రబ్ చేయడం, స్టీమ్ పట్టడం వంటివి చర్మంలోని సహజతేమను పోగొడతాయి. అప్పటికి కాంతిగానే అనిపించినా, తర్వాత చర్మం జీవం కోల్పోయినట్టు తయారవుతుంది. అందుకని వీలైనంత వరకు స్టీమ్‌ను తగ్గించడం మేలు.
మొటిమలు
మొటిమలు రావడానికి తలలో చుండ్రు ప్రధాన కారణం. తలలో చుండ్రు ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి ఆ నీటితో తలను శుభ్రపరుచుకోవాలి. ముఖం మీద జిడ్డు లేకుండా జాగ్రత్తపడాలి. అప్పటికీ మొటిమల సమస్య వదలకపోతే చిరోంజి పప్పును పొడి చేసి, పచ్చిపాలలో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తుంటే మొటిమలు, నల్లమచ్చలు తగ్గి, ముఖం ఫెయిర్‌గా అవుతుంది.
ట్యాన్
స్నానం చేయడానికి అరగంట ముందు కమలాపండు తొక్కను గుజ్జులా చేసి, కొద్దిగా పాలు కలిపి మేనికి పట్టించి, స్క్రబ్ చేయాలి. ఇవి ట్యాన్‌ని పోగొట్టడమే కాకుండా, చర్మాన్ని కాంతిమంతంగా చేస్తాయి.