మొటిమలకు పుదీనా...
బ్యూటిప్స్
అదేం చిత్రమో ఏమో.... రాత్రి నిద్రపోయే ముందు అందంగా ఉన్న ముఖంపై రాత్రికి రాత్రే మొటిమలు పుట్టుకొస్తుంటాయి. ఉదయం లేచిన వెంటనే వాటిని చూసి భయం కానీ బాధ కానీ పడాల్సిన అవసరం లేదు. చిన్న ఇంటి చిట్కాతో పరిష్కారం పొందొచ్చు. కొన్ని తులసి ఆకులు, పుదీనా ఆకులు తీసుకొని వాటిని బాగా పిండాలి. ఆ రసంలో ఒక నిమ్మకాయ పిండి ఆ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. అది ఆరాక ముఖాన్ని కడుక్కోవాలి. ఈ చిట్కా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ముఖంపై చర్మం గరుకుగా ఉన్నవారు దాని నుంచి బయట పడటానికి పెద్దగా శ్రమించాల్సిన పని లేదు. ఇంట్లో క్యాబేజీ వండేటప్పుడు దాని నీళ్లలో ఉడికిస్తారు. అప్పుడు ఆ నీటిని పడేయకుండా ఓ గిన్నెలో తీసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకుంటూ కడుక్కుంటే చాలు. ముఖం మృదువుగా మారడంతో పాటు చక్కటి రంగు వస్తుంది.
ముఖంపై కాలిన గాయాలు, మొటిమలు తగ్గాక కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి. వాటిని పోగొట్టే మార్గం తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా పాటించి చూడండి. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోండి. ఆ తర్వాత తేడా మీకే తెలుస్తుంది.