జాతులు నుడికారాలు
‘‘వాళ్ళందరూ ఒకే ప్రజ. వాళ్ళందరిది ఒకే భాష. తూర్పుదిశ నుండి పడమరగా పయనిస్తూ వాళ్ళు ‘షినోర్’ పీఠభూమి చేరుకుని, ఆ ప్రదేశాన్ని నివాసం చేసుకునేదాకా వాళ్ళ ప్రయాణం కొనసాగింది. ‘పదండి. ఇటుకలు తయారుజేసి వాటిని బాగా తంపటం పెడదాం.’ అంటూ వాళ్ళు పరస్పరం మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులుగా ఇటుకలు సమకూర్చుకున్నారు. అడుసుకు బదులుగా జిగురును రూపొందించుకున్నారు. ‘పదండి. మనమొక నగరాన్ని నిర్మించుకుందాం.
శిఖరం స్వర్గాన్ని తాకేలా ఒక గోపురం నిర్మిద్దాం. మనకు ఒక పేరు పెట్టుకుందాం. ఆనవాలు లేకపోతే మనం ఈ నేలమీద ఎక్కడెక్కడికో చెదిరిపోతాం’ అనుకున్నారు. మానవసంతానం నిర్మించిన నగరాన్నీ, గోపురాన్నీ చూసేందుకు దేవుడు దిగివచ్చాడు. ‘ఔరా! వీళ్ళంతా ఒకే ప్రజ. వీళ్ళందరికీ ఒకే భాష. కాబట్టే ఇంతటి కార్యానికి పూనుకున్నారు. తమ ఊహకు ఏది అందితే దాన్ని సాధించకుండా వీళ్ళను అడ్డుకోవడం ఎవ్వరికినీ సాధ్యంగాదు. పద. కిందికి దిగి వాళ్ళ భాషను అయోమయం చేద్దునుగాక. ఒకరు మాట్లాడింది మరొకరికి అర్థంగాకుండా చేద్దునుగాక’ అనుకున్నాడు. దరిమిలా దేవుడు వాళ్ళను నేల నాలుగు చెరగులకు వెదజల్లాడు. దాంతో వాళ్ళ నగర నిర్మాణం ఆగిపోయింది. ఆ కారణంగా దానికి ‘బేబెల్’ అనే పేరొచ్చింది.
ఇది శాస్త్ర విజ్ఞానం పరిణతి చెందని కాలంలో ఏర్పడిన ఊహలకు ప్రతిబింబంగా నిలిచే కథ మాత్రమే. మానవులు జాతులుగా విడిపోయే ప్రక్రియ క్రీస్తుకు పూర్వమే జరిగిపోయిందనే సూచన మినహా, ఈ కథ వల్ల చరిత్రకు ఒనగూరే ఉపకారం పెద్దగా లేదు.
దొరికిన ఆధారాలను బట్టి, క్రీ.పూ. 5000 సంవత్సరాల దరిదాపుల్లో కొంత జనసమూహం కొన్ని కొన్ని జాతులుగా ఏర్పడినట్టు చరిత్రకారులు నిర్ణయిస్తున్నారు. మధ్యధరా సముద్రం దక్షిణ కోస్తా - ఎర్ర సముద్రానికి తూర్పు భాగంలో నివసించిన వాళ్ళు సెమైట్లు, ఎర్రసముద్రానికి పడమరగా నివసించినవాళ్ళు ఇజిప్సియన్లు, వీళ్ళకు ఉత్తరంగా లిడియన్లూ హిట్టిటేట్లు, సెమైట్లుకు తూర్పున సుమేరియన్లూ అస్సీరియన్లు, మధ్యధరా సముద్రానికి ఉత్తరకోస్తా వెంట ఏజియన్లు - ఇలా వేరువేరు జాతులుగా వాళ్ళను గుర్తించారు.
అయితే, తమ జాతిని తాము ఏ పేరుతో వాళ్ళు పిలుచుకున్నారో మనకు తెలీదు. ఇందాకా అనుకున్న పేర్లన్నీ వారివారి నివాస ప్రాంతాలనుబట్టో, ఆచార వ్యవహారాలనుబట్టో, అవశేషాల ఆధారంగా నిర్ణయించిన పోలికనుబట్టో చరిత్రకారులు ఏర్పాటుజేసుకున్న అనుకూలత మాత్రమే. చనిపోయినవాళ్ళను పాతిపెట్టడం కాకుండా, దహనం చేయడం ఆచారంగా అవలంభించడం వల్ల అవశేషాల రూపంలో ఆర్యులకు సంబంధించిన ఆధారాలే కరువయ్యాయి. దానికి తోడు, వాళ్ళు వినియోగించిన సామగ్రి మొత్తం కొయ్య, వెదులు వంటి శాఖాజనిత పరికరాలు కావడంతో, అనతికాలానికే అవి కాలగర్భంలో కలిసిపోయి, భౌతికమైన ఆధారాలు దొరికే ఆస్కారం లేకుండా చేశాయి.
రచన: ఎం.వి.రమణారెడ్డి
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com
టూకీగా ప్రపంచ చరిత్ర - 61
Published Sat, Mar 14 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement