మా తోటలోని అధ్బుతమైన మర్రివృక్షం కింద కట్టుకున్న రెండంతస్తుల ఇల్లు.. మన మనుషుల కోసం అనుకుని ఎంతో పొరబడ్డాను. మొదటి వేసవికాలంలో, కొన్ని చెట్టుకప్ప(Tree Frog) లు వచ్చి చక్కగా నివసిస్తుంటే, అది చూసి నేను ఎంతో ముచ్చటపడ్డాను. వాటి శరీరం కింద పొందికగా పెట్టిన వాటి నాజూకైన పాదాలతో, పెద్ద జాలిగొన్న కళ్ళతో చూసే వాటికి నేను ఇంత చోటు ఇవ్వడానికి వెనకాడలేదు. కానీ ఈ విషయం స్పష్టంగా మిగిలిన కప్ప వంశానికి తెలిసిపోయి, ముని ముని మనవలు, ముని ముని మేనల్లుళ్లు, మేనకోడలు మరియు అవ్వలూ, అందరూ వచ్చి చేరారు. అతి త్వరలో ప్రతీ చూరు, పుస్తకము, కప్పు, ఇంకా పటములు వాటితో నిండిపోయాయి. కొన్నయితే వాషింగ్ మెషీన్ సబ్బు పెట్టెలో కూడా దూరాయి; కొన్ని వాషబేసిన్ నుంచి బయటకి వెళ్లే పైపులలో, మరికొన్నైతే సుఖంగా ఫ్లష్ ట్యాంక్ గోతిలో, ఇక చాలా అయితే గోడకీ బీరువాకి మధ్యనున్న చిన్న చోటిలో దూరి పడుక్కున్నాయి. ఒక దయ నిండిన ఉద్వేగ క్షణంలో, మా బతుకు మేము బతకటానికి మాకు ఇంత చోటు వదిలాయి.
అర దశాబ్దం క్రితం, ఒక ఏడాది నగరంలో గడిపినప్పుడు, నేను ఒక పిల్లిని కానీ, కుక్కని కానీ పెంచుకునే స్థోమత లేకపోయింది. వాటికి బదులుగా నేను ఒక చిన్న చెట్టు కప్పను పెంచుకున్నాను. తను ఉన్న చిన్న గదిలో నిత్యకృత్యాల కోసం ఒక చిన్న బేసిన్ పెట్టి, ఆహారం కోసం పురుగులను ఆకర్షించడానికి లైటు వేసి ఉంచాను.
ఇది ఒక బాధ్యతారహిత బంధం: నేను నడిపించడానికి తీసుకువెళ్లాలని కానీ, భోజనం పెట్టాలని కానీ, విద్యలు నేర్పాలని కానీ నా పెంపుడు కప్ప ఆశించలేదు. తన మనుగడ మొత్తం ఆ ఒక చిన్న తేమ నిండిన గదిలో సాగించింది. కిటికీ బయట తనకి బ్రతికి బట్ట కట్టే అవకాశం ఆట్టే లేని ఒక గందరగోళ కాంక్రీట్ అడవి ఉంది. చెప్పడానికి మేము ఒకరినొకరు హత్తుకుని గడపకపోయినా, ఆ కప్ప అక్కడ ఉండడం వల్ల నేను కొంత సేద తీరాను. అంత బాగానే సాగుతున్నంతలో, ఒక పుస్తకం పడి కప్ప ప్రాణం పోయింది. ఈ విపత్తును ఊహించనందుకు నాకు తీరని ఆవేదన కలిగింది.
కానీ ఇప్పుడు దాని ఖర్మ ఫలంగా, పురాతన ఈజిప్టు మమ్మీ శాపమంత ఖచ్చితంగా ఈ చెట్టు కప్ప శాపం నాకు చుట్టుకుంది. మా కొత్త ఇంట్లో ఆ కప్పలు కేవలం కాస్త చోటే ఆశిస్తే, నేను శాంతి వహించి ఉండేదాన్ని. కానీ అవి వాటి కింది భాగం ఎంతో వ్యూహాత్మక కోణంలో బయటికి తిప్పి, విచక్షణ లేకుండా వంటగది అరుగులనూ, బల్లలనూ, తువ్వాళ్లనూ, కంచాలనూ ఆక్రమించాయి. కొన్ని గదుల్లో ఎండిపోయిన కప్ప మూత్రం చారలు కట్టాయి. టాయిలెట్ పై కూర్చోవడం ఒక పెద్ద ప్రహసనంగా మారింది. టాయిలెట్ మూత కింద మరిన్ని కప్పలు నక్కి ఉండి, అప్రమత్తంగా లేని అతిధులను అతి సున్నితమైన శరీర భాగాలపై తట్టి ‘భౌ’ మని దాగుడుమూతలు ఆడేవి. ఒక పెద్ద తల్లి కప్ప, బాత్రూంలో లైట్ వేసే దురదృష్టవంతులు ఎవరిపైనైనా సరే మూత్ర జల్లు కురిపించేది. చీకటి బాత్రూములూ, కప్ప మూత్రపు వాసనగొట్టే తువ్వాళ్ళు వాడవలసి వచ్చినందుకూ, పలుమార్లు ప్లేట్లు కడుక్కోవలసి వచినందుకూ అలసి, విసిగి, ఆ గెంతే దౌర్భాగ్యులపై సున్నితమైన యుద్ధం ప్రకటించాము.
మొత్తం 289 కప్పలను పట్టి, పొరుగునున్న నూతుల్లో వదలడంలో ఒక ఆదివారం గడిపాము. కానీ అదంతా వ్యర్ధ ప్రయాసే. అవి చిన్న జంతువులే కానీ వాటికి పరిసర జ్ఞానాం ఖచ్చితంగా ఉంది. మేము ఆఖరి కప్పను తొలంగించేలోపే, వాటి ఆరితేరిన ఇంటితోవ తెలుసుకునే నైజం వాటిని ఇంటికి చేర్చింది. అంతేకాదు, ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు అవన్నీ వాటికి ఇంట్లో ప్రీతి అయినా స్థలాల్లోకి వచ్చేశాయి; అసల అవి వెళ్లనేలేదు అన్నట్టు. నేను వాటి అత్యుత్తమ ప్రతిభకు వంగి నమస్కరించాను.
చాలా కప్పలు వంటగదిలోని మూల బీరువా తలుపు కింద దూరి, బూరెలమూకుళ్లపై, ప్రెషర్ కుక్కర్ పై, ఇంకా మిక్సీ జార్ల పై యాజమాన్యాన్ని ప్రకటించాయి. నిన్న నేను వెల్లుల్లిపాయలు వేయిస్తుండగా మూకుడి నుంచి ఒక ఘాటైన దుర్గంధం వచ్చింది….అది…కాదు… అయి ఉండదు... చెట్టు కప్ప మూత్రం! కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలవడానికే నాకు కొన్ని యుగాలు పట్టింది. మరి కాసిన్ని వలవడానికి మిగిలి ఉన్న జీవితాన్ని వృధా చేయదలచలేదు. అంచేత ఆ వాసన మాపడానికి మరిన్ని మసాలా దినుసులు వేశాను. కానీ తర్వాత వచ్చిన పొగడ్తలు, నా అద్భుతమైన వంట నైపుణ్యానికి వచ్చాయో, లేదా దాగిఉన్న ఆ…. వంటవారి రహస్య దినుసు అందామా … దానివల్ల వచ్చాయో, నేను ఖచ్చితంగా చెప్పలేను.
రచయిత : జానకి లెనిన్
ఫోటోలు : సచిన్ రాయ్
Comments
Please login to add a commentAdd a comment