ఢిల్లీ 6:మహిళల కోసం ఆరు ‘కట్టడాలు’
సౌకర్యం
ఇది మామూలు విషయమే కానీ, ఎంతో మంచి విషయం! నార్త్ ఢిల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ వాళ్లు, ఢిల్లీ పౌరుల సహకారంతో మహిళల కోసం ఆరు ‘కట్టడాలను’ ఏర్పాటు చేయబోతున్నారు. వాటిల్లో ఒక కట్టడం ఇటీవలే కాశ్మీరీ గేట్ మార్కెట్ ప్రాంతంలో పూర్తయి, వారం క్రితమే మహిళలకు అందుబాటులోకి వచ్చింది కూడా. మహిళలకు కట్టడం అనగానే మనకు తాజ్‌మహల్ గుర్తుకు రావచ్చు. ఒక విధంగా ఈ ఆరు కట్టడాలూ మహిళల గౌరవార్థం, అంతకన్నా కూడా వారి అవసరార్థం నిర్మిస్తున్నవే. ఢిల్లీ ప్రభుత్వ ‘భాగీదారి’ (ప్రజల భాగస్వామ్య పథకం) కింద ‘మై ఢిల్లీ ఐ కేర్’ ప్రాజెక్టు పేరుతో ఫెడరేషన్ నిర్మిస్తున్న ఈ కట్టడాలు... వాష్ రూమ్‌లు!
ఇటీవలి ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో ఓటు వేసేందుకు మహిళా ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇలాంటి సందర్భంలోనైనా, ఇలాంటి చోటనైనా మహిళలకు వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయలేకపోయారు అధికారులు. మహిళా సంక్షేమం కోసం పెద్దపెద్ద పథకాలు ప్రకటించే నాయకులు మహిళలకు అత్యవసరమైన పబ్లిక్ టాయ్‌లెట్‌ల నిర్మాణంలో, వాటి నిర్వహణల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారో... ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే!
‘‘ఇవి మాకెంతో ఉపయోగపడతాయి. మగవాళ్లలా మేము ఢిల్లీ వీధులను బహిరంగ మూత్రశాలలుగా మార్చకపోవచ్చు. అంతమాత్రాన మాకు వాష్‌రూమ్‌ల అవసరం లేదని కాదు కదా. ఇది ఎంతో చిన్న విషయంగా మీకు అనిపించవచ్చు. మహిళలకు మాత్రం అత్యవసరమైనది’’ అని కాశ్మీరీ గేట్ వాష్‌రూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా రాగిణి (22) అనే సేల్స్ ఉమన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నార్త్ ఢిల్లీ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని మరో ఐదు ప్రాంతాలలో మహిళల వాష్‌రూమ్‌లు ఏర్పాటు అయ్యాయి. హనుమాన్ మందిర్ రోడ్, కమలానగర్ మార్కెట్, రోషనార బాగ్ సింగ్ సభ గేట్, రోషనార బాగ్ క్లబ్ గేట్ 2, హిందూరావ్ ఆసుపత్రిలోని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మెడికల్ కాలేజీ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో నిర్మాణం పూర్తయిన దశలో ఉన్న ఈ ఐదు వాష్‌రూమ్‌లు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ఈ వాష్‌రూమ్‌లు మహిళలకు అందుబాటులో ఉంటాయి. భద్రతగా అక్కడ మహిళా సిబ్బంది ఒకరు ఉంటారు.
‘‘ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుకోడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. వాష్‌రూమ్ పరిశుభ్రతతో పాటు, భద్రతా సిబ్బంది ఏర్పాటుకు కాస్త పెద్ద మొత్తంలోనే డబ్బు అవసరమౌతుంది. అందుకే ఢిల్లీ పౌరుల చేయూతను మేము అర్థించాం. వారి నుంచి సానుకూల స్పందన రావడంతో ఇంతదూరం రాగలిగాం’’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్ భాసిన్ అన్నారు. ‘‘గత ఆరేళ్లుగా దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లు తమ బడ్జెట్‌లో ‘మహిళా టాయ్‌లెట్’ల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాయి. ఢిల్లీ అయితే అంతకు ముందు నుంచే ఈ ప్రాజెక్టు కోసం మల్లగుల్లాలు పడుతోంది.
చివరికి ఎలాగైతేనే అందరి సహకారంతో ఆరు వాష్‌రూమ్‌లను నిర్మించగలిగాం’’ అని అశోక్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం ఢిల్లీలో మగవాళ్ల కోసం మొత్తం 3,712 పబ్లిక్ టాయ్‌లెట్‌లు ఉండగా, మహిళలకు ఉన్నవి కేవలం 269 మాత్రమే! ఎప్పుడూ రద్దీగా ఉండే చాందినీ చౌక్, కరోల్‌బాగ్ మార్కెట్ ప్రాంతాల్లో అయితే మహిళలకు వాష్‌రూమ్‌ల కొరత మరింత తీవ్రంగా ఉంది. ‘‘మాకిది ప్రధాన సమస్య.
వాష్‌రూమ్‌లో అందుబాటులు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి శుభ్రంగా ఉండవు. పైగా వాటి దరిదాపుల్లో మాదకద్రవ్యాలకు బానిసలైనవారు తూలుతూ, వాగుతూ కనిపిస్తారు’’ అని చాందినీ చౌక్ దుకాణదారు అరుణిమా కపూర్ అనడంలో... ఇకనైనా మాకు ఈ ఇబ్బందులు తొలగితే మంచిదే కదా అనే ఆశాభావం కనిపిస్తుంది. నార్త్ ఢిల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్‌లా ప్రతి రాష్ర్టంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన ఇలాంటి సమస్యలపై దృష్టి సారిస్తే అరుణిమ లాంటి మహిళల అసౌకర్యాలు తొలగినట్లే!