బాలికపై మహిళా పోలీస్ అఘాయిత్యం!
న్యూఢిల్లీ: 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన మహిళ పోలీసు అధికారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తనపై లైంగిక దాడి చేశాడంటూ ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు విచారణాధికారిగా ఉన్న మహిళా పోలీసు అధికారి తనపై లైంగికంగా దాడి చేసిందంటూ బాలిక కోర్టుకు తెలిపింది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్య తీసుకోలేదని నివేదించింది.
ఈ నేపథ్యంలో బాలికపై లైంగికంగా దాడి చేసినందుకు, నిందితుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా లబ్ధి చేకూర్చేలా తప్పుడు ఆధారాలు సృష్టించినందుకు సదరు మహిళా ఎస్సైపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. కేసు దర్యాప్తు పురోగతిని తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నిందితుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనోజ్ రాఠీ మూడో బెయిల్ అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. బాధితురాలైన బాలిక ఈశాన్య ఢిల్లీలోని అమన్ విహార్ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.
ఏకాంతంగా కలువాలంటూ పిలిచిన ఉపాధ్యాయుడు తనను లైంగికంగా వేధించాడని, దీని గురించి ఫిర్యాదు చేసేందుకు తన తల్లిదండ్రులు రావడంతో వారిని బెదిరించాడని, తన తండ్రితో తెల్లకాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించి.. తనపై తండ్రే లైంగిక దాడి చేసినట్టు తప్పుడు రాతలు రాశాడని బాధితురాలైన బాలిక కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.