
న్యూఢిల్లీ: తొడ కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వన్డే ప్రపంచకప్ టోరీ్నకి దూరమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ కోసం ఈనెల 5న బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అక్షర్ పటేల్ ఉన్నాడు. అయితే ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్–4 మ్యాచ్‌లో గాయపడ్డ అక్షర్ పటేల్ ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు.
అక్షర్ పటేల్ కోలుకునేందుకు కనీసం నాలుగు వారాలు పట్టే అవకాశం ఉండటంతో వన్డే ప్రపంచకప్ కోసం అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్, తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆడిన అశ్విన్ తన వైవిధ్యభరిత బౌలింగ్‌తో ఆకట్టుకొని నాలుగు వికెట్లు తీశాడు.
శనివారం ఇంగ్లండ్‌తో జరిగే వామప్ మ్యాచ్ కోసం గువాహటి బయలుదేరిన భారత జట్టుతో అశ్విన్ కూడా ఉన్నాడు. అశ్విన్‌కిది మూడో వన్డే ప్రపంచకప్ కానుంది. స్వదేశంలో ధోని సారథ్యంలో 2011 వన్డే వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గిన భారత జట్టులో అశ్విన్ సభ్యుడిగా ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లోనూ అశ్విన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు అశ్విన్ 115 వన్డేలు ఆడి 155 వికెట్లు తీయడంతోపాటు 707 పరుగులు సాధించాడు.
అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ప్రపంచకప్ కోసం తుది జట్లలో మార్పులు చేర్పులకు గురువారంతో గడువు ముగిసింది. మరోవైపు ఆ్రస్టేలియా వరల్డ్ కప్ జట్టులోనూ ఒక మార్పు చోటు చేసుకుంది. పిక్క కండరాల గాయం నుంచి ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఎంపిక చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో లబుషేన్ 283 పరుగులు... భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 138 పరుగులు సాధించాడు. చేతి వేలి గాయంతో బాధపడుతున్నప్పటికీ ట్రావిస్ హెడ్‌ను వరల్డ్ కప్ జట్టులో కొనసాగించాలని క్రికెట్ ఆ్రస్టేలియా నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment