నా పరుగు ఆగిపోలేదు | My run did not cease here, says Ashwini Nachappa | Sakshi
Sakshi News home page

నా పరుగు ఆగిపోలేదు

Published Sat, Aug 2 2014 12:12 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

నా పరుగు ఆగిపోలేదు - Sakshi

నా పరుగు ఆగిపోలేదు

ఆటకు అందం జత చేరితే అది అచ్చు అశ్వని నాచప్పలా ఉంటుంది. పాతికేళ్ల క్రితమే ఆమె క్రీడా గ్లామర్‌కు ఓనమాలు నేర్పింది. ఒకప్పటి అందాల అమెరికన్ అథ్లెట్ ఫ్లోరెన్స్ జాయ్‌నర్ తరహాలో ఇండియన్ ఫ్లోజోగా గుర్తింపు తెచ్చుకుంది. అదే సౌందర్యం ఆమెను సినీ తారను చేసింది. పరుగులో పీటీ ఉషను వెనక్కి నెట్టినా...ఆటకంటే అందమే ఆమెను ఎక్కువ సార్లు అందలమెక్కించింది. ఈ ‘కన్నడ కస్తూరి’ ఇప్పటికీ క్రీడలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పిల్లలకు చేయూతనివ్వడం తనకు ప్రస్తుతం అత్యంత సంతృప్తినిస్తోందంటూ అశ్వని చెప్పిన అనేక విశేషాలు ఆమె మాటల్లోనే...
 
అథ్లెటిక్స్ తర్వాత...
 
ట్రాక్‌కు దూరమైనా...నేను ఆటకు దూరం కాలేదు. ఇంకా చెప్పాలంటే గతంలోకంటే ఎక్కువగా బిజీ అయ్యాను. ముఖ్యంగా నా సొంత స్కూల్, స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా స్వస్థలం కొడగులో 30 ఎకరాల విస్తీర్ణంలో  ఐసీఎస్‌ఈ స్కూల్ ఒకటి నేను నిర్వహిస్తున్నాను. అక్కడ రెగ్యులర్ స్టడీస్‌తో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం అథ్లెటిక్స్,హాకీ, 10 మీ. ఎయిర్ రైఫిల్ క్రీడాంశాలు ఉన్నాయి. అంతే కాదు...పరిక్రమ అనే స్వచ్ఛంద సేవా సంస్థను గత 12 ఏళ్లుగా నడిపిస్తున్నాను. ఇందులో వేయికి పైగా చిన్నారులకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్నాను. ఇది నా జీవితంలో చాలా సంతృప్తినిస్తున్న కార్యక్రమంగా చెప్పవచ్చు.
 
ఆటలకు సంబంధించి...
 
స్పోర్ట్స్ ఫౌండేషన్ మాత్రం పూర్తి స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే పనిలో ఉంది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో టాలెంట్ సెర్చ్ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు ఉన్నారు. గత నాలుగేళ్లుగా మా ఫౌండేషన్‌కు చెందిన అనేక మంది అథ్లెట్లు జాతీయ స్థాయిలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇకపై మరిన్ని మంచి ఫలితాల సాధనపై దృష్టి పెట్టాను. కిరణ్ మజుందార్‌షా తదితర కార్పొరేట్ దిగ్గజాలు నాకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. బెంగళూరు జిల్లాతో పాటు కర్ణాటక అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా ఆటతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది.
 
నాటి గుర్తులు

ఒక అథ్లెట్‌గా నేను సంతృప్తికరంగానే  కెరీర్‌ను ముగించానని భావిస్తున్నాను. ఆసియా, శాఫ్ క్రీడల్లో పతకాలైనా, ఏషియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఇతర విజయాలైనా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటి సౌకర్యాలవంటివాటితో పోలిస్తే మేం పరిమిత అవకాశాలతోనే సత్తా చాటామని చెప్పగలను. ఆనాడు పీటీ ఉష స్థాయి ఏమిటో అందరికీ తెలుసు. నేషనల్స్‌లో రెండు సార్లు ఆమెను ఓడించగలిగాను. సహజంగానే చాలా మంది అథ్లెట్లలాగే గాయాలు నా కెరీర్ కీలక దశలో ఇబ్బంది పెట్టడంతో పరుగుకు బ్రేక్ వేయాల్సి వచ్చింది.
 
తొలి సినిమా అనుభవం

నా జీవితంలో అదో ప్రత్యేక దశ. నటన గురించి ఏ మాత్రం తెలియని సమయంలో నా స్టోరీ అంటూ చెప్పేసరికి అశ్వినిలో అథ్లెట్‌గా నటించాను. నేను జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. అలాంటిది ఆ సమయంలో ఏడుపు సన్నివేశాల్లో కూడా నవ్వుతూ నేను భానుచందర్‌ను, దర్శకుడిని సతాయించిన రోజులు బాగా గుర్తున్నాయి. అయితే ఆ తర్వాత అందరూ నన్ను ప్రతీ సినిమాలో పరుగెత్తాలనే కోరుకునేవారు. ఈ సమయంలో నేనే కాదు, యూనిట్ మొత్తానికి ఉదయమే రన్నింగ్, ఎక్సర్‌సైజ్ ఉండేది. అందరినీ తీసుకొని నేను బయల్దేరే దాన్ని. అదో సరదా అనుభవం.
 
ఆ తర్వాతి సినిమాలు...

అశ్విని తర్వాత మరో నాలుగు సినిమాలు చేశాను. అయితే అవన్నీ ఒకే దర్శకుడివి కావడంతో ఇబ్బంది రాలేదు. పైగా నేనెప్పుడూ గ్లామర్ చూపించాల్సిన అవసరం లేకపోయింది. ప్రతీ సినిమాలో ఏదో వేరే ఒక జంట పాటల కోసం ఉండేది. అయితే ఇవి చేశాక ఇక నాకు చాలనిపించింది. ఫైటింగ్స్ కూడా అయిపోయాయి ఇక చేసేదేముంది అనిపించడంతో ఇక సినిమాలు చాలు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. చాలా మంది అడిగినా నిరాకరించాను.
 
భారత అథ్లెటిక్స్‌పై...

నిస్సందేహంగా సౌకర్యాల పరంగా చూస్తే మనం ఎవరికీ తక్కువ కాదు. అయితే ఒలింపిక్స్ స్థాయితో పోలిస్తే అథ్లెటిక్స్ ఇంకా చాలా వెనుకబడే ఉంది. మిడిల్ డిస్టెన్స్‌లో మంచి ఫలితాలే వస్తున్నా స్ప్రింట్స్‌లో ఎంతో మెరుగు పడాల్సి ఉంది. గత కామన్వెల్త్ క్రీడలు మన దేశంలో జరగడం ఎంతో మంచి చేసింది. ఆ తర్వాత ప్రతిభాన్వేషణతో పాటు కార్పొరేట్లు కూడా సహకారానికి ముందుకు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో మనకు ఎక్కువ సంఖ్యలో పతకాలు గెలిచే అవకాశం ఉంది. ప్రత్యేకంగా పేర్లను ప్రస్తావించలేను కానీ ఓవరాల్‌గా అథ్లెటిక్స్ పరిస్థితి రోజు రోజుకూ మెరుగవుతూనే ఉంది. కాస్త ఓపిక పడితే రాబోయే కొన్నేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే మిషన్ 2020 పేరుతో క్రీడల్లో అనేక లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. సరైన కోచ్‌లతో ప్రణాళికలు సమర్థంగా అమలు చేయాల్సి ఉంది.
 
క్రీడల్లో అవినీతిపై...
 
కామన్వెల్త్ వ్యవహారంలో కల్మాడీ పరిస్థితి ఏమైందో చూశారుగా. ఇలా అవినీతిని రూపుమాపాలనే ఆటగాళ్లం అందరం కలసి క్లీన్ స్పోర్ట్స్ సంస్థను స్థాపించాం. క్రీడల్లో అవినీతి బయటపెట్టడంలో మేం కూడా కీలక పాత్ర పోషించామని గర్వంగా చెప్పగలం. వాస్తవంగా చూస్తే ఆటలో ఇంత అవినీతి ఉంటుందా అనేది ఒక అథ్లెట్‌గా ఉన్న సమయంలో తెలీలేదు. కానీ అలాంటివాటిని పరిహరిస్తే భారత్ మరింత వేగంగా దూసుకుపోగలదని అనిపించింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం. గత ప్రభుత్వం క్రీడా సంఘాల్లో రాజకీయ నాయకులు ఉండరాదన్న సూచనకు మేం గట్టిగా మద్దతిచ్చాం. ఇకపై కూడా దీనిని మరింత సమర్థవంతంగా నిర్వహించి క్రీడలను క్లీన్‌గా ఉంచుతామని చెప్పగలం.
 
కుటుంబం....

నా భర్త ఆటోమొబైల్ వ్యాపారంలో చాలా ఏళ్లుగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు అనీషా, దీపాలి. ఆరంభంలో ఆటలపై ఆసక్తి చూపిన అనీషా జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌లో రాణించింది. అయితే ఆ తర్వాత చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయింది. ఇక చిన్న అమ్మాయికి కూడా పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి నా కుటుంబంనుంచి మరో అథ్లెట్ లేనట్లే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement