Ashwini Nachappa
-
అక్టోబర్ 21న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: అశ్వనీ నాచప్ప (క్రీడాకారిణి, నటి), శరణ్ దీప్ సింగ్ (మాజీ క్రికెటర్) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. పుట్టినతేదీ 21. ఇది కూడా బృహస్పతికి చెందిన సంఖ్యే కావడం వల్ల వీరు బృహస్పతి ప్రభావంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. వీరిని విజయాలు వరిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడి, వాటివల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులకు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరమంతా సుఖసంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇంటాబయటా మాటకు విలువ ఏర్పడుతుంది. ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యంతో ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. లక్కీ నంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు. సూచనలు: దక్షిణామూర్తి, సాయిబాబా, దత్తాత్రేయస్వామి వంటి గురుపరంపరకు చెందిన వారిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
నా పరుగు ఆగిపోలేదు
ఆటకు అందం జత చేరితే అది అచ్చు అశ్వని నాచప్పలా ఉంటుంది. పాతికేళ్ల క్రితమే ఆమె క్రీడా గ్లామర్‌కు ఓనమాలు నేర్పింది. ఒకప్పటి అందాల అమెరికన్ అథ్లెట్ ఫ్లోరెన్స్ జాయ్నర్ తరహాలో ఇండియన్ ఫ్లోజోగా గుర్తింపు తెచ్చుకుంది. అదే సౌందర్యం ఆమెను సినీ తారను చేసింది. పరుగులో పీటీ ఉషను వెనక్కి నెట్టినా...ఆటకంటే అందమే ఆమెను ఎక్కువ సార్లు అందలమెక్కించింది. ఈ ‘కన్నడ కస్తూరి’ ఇప్పటికీ క్రీడలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పిల్లలకు చేయూతనివ్వడం తనకు ప్రస్తుతం అత్యంత సంతృప్తినిస్తోందంటూ అశ్వని చెప్పిన అనేక విశేషాలు ఆమె మాటల్లోనే... అథ్లెటిక్స్ తర్వాత... ట్రాక్‌కు దూరమైనా...నేను ఆటకు దూరం కాలేదు. ఇంకా చెప్పాలంటే గతంలోకంటే ఎక్కువగా బిజీ అయ్యాను. ముఖ్యంగా నా సొంత స్కూల్, స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా స్వస్థలం కొడగులో 30 ఎకరాల విస్తీర్ణంలో ఐసీఎస్ఈ స్కూల్ ఒకటి నేను నిర్వహిస్తున్నాను. అక్కడ రెగ్యులర్ స్టడీస్‌తో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం అథ్లెటిక్స్,హాకీ, 10 మీ. ఎయిర్ రైఫిల్ క్రీడాంశాలు ఉన్నాయి. అంతే కాదు...పరిక్రమ అనే స్వచ్ఛంద సేవా సంస్థను గత 12 ఏళ్లుగా నడిపిస్తున్నాను. ఇందులో వేయికి పైగా చిన్నారులకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్నాను. ఇది నా జీవితంలో చాలా సంతృప్తినిస్తున్న కార్యక్రమంగా చెప్పవచ్చు. ఆటలకు సంబంధించి... స్పోర్ట్స్ ఫౌండేషన్ మాత్రం పూర్తి స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే పనిలో ఉంది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో టాలెంట్ సెర్చ్ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు ఉన్నారు. గత నాలుగేళ్లుగా మా ఫౌండేషన్‌కు చెందిన అనేక మంది అథ్లెట్లు జాతీయ స్థాయిలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇకపై మరిన్ని మంచి ఫలితాల సాధనపై దృష్టి పెట్టాను. కిరణ్ మజుందార్‌షా తదితర కార్పొరేట్ దిగ్గజాలు నాకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. బెంగళూరు జిల్లాతో పాటు కర్ణాటక అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా ఆటతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. నాటి గుర్తులు ఒక అథ్లెట్‌గా నేను సంతృప్తికరంగానే కెరీర్‌ను ముగించానని భావిస్తున్నాను. ఆసియా, శాఫ్ క్రీడల్లో పతకాలైనా, ఏషియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఇతర విజయాలైనా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటి సౌకర్యాలవంటివాటితో పోలిస్తే మేం పరిమిత అవకాశాలతోనే సత్తా చాటామని చెప్పగలను. ఆనాడు పీటీ ఉష స్థాయి ఏమిటో అందరికీ తెలుసు. నేషనల్స్‌లో రెండు సార్లు ఆమెను ఓడించగలిగాను. సహజంగానే చాలా మంది అథ్లెట్లలాగే గాయాలు నా కెరీర్ కీలక దశలో ఇబ్బంది పెట్టడంతో పరుగుకు బ్రేక్ వేయాల్సి వచ్చింది. తొలి సినిమా అనుభవం నా జీవితంలో అదో ప్రత్యేక దశ. నటన గురించి ఏ మాత్రం తెలియని సమయంలో నా స్టోరీ అంటూ చెప్పేసరికి అశ్వినిలో అథ్లెట్‌గా నటించాను. నేను జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. అలాంటిది ఆ సమయంలో ఏడుపు సన్నివేశాల్లో కూడా నవ్వుతూ నేను భానుచందర్‌ను, దర్శకుడిని సతాయించిన రోజులు బాగా గుర్తున్నాయి. అయితే ఆ తర్వాత అందరూ నన్ను ప్రతీ సినిమాలో పరుగెత్తాలనే కోరుకునేవారు. ఈ సమయంలో నేనే కాదు, యూనిట్ మొత్తానికి ఉదయమే రన్నింగ్, ఎక్సర్సైజ్ ఉండేది. అందరినీ తీసుకొని నేను బయల్దేరే దాన్ని. అదో సరదా అనుభవం. ఆ తర్వాతి సినిమాలు... అశ్విని తర్వాత మరో నాలుగు సినిమాలు చేశాను. అయితే అవన్నీ ఒకే దర్శకుడివి కావడంతో ఇబ్బంది రాలేదు. పైగా నేనెప్పుడూ గ్లామర్ చూపించాల్సిన అవసరం లేకపోయింది. ప్రతీ సినిమాలో ఏదో వేరే ఒక జంట పాటల కోసం ఉండేది. అయితే ఇవి చేశాక ఇక నాకు చాలనిపించింది. ఫైటింగ్స్ కూడా అయిపోయాయి ఇక చేసేదేముంది అనిపించడంతో ఇక సినిమాలు చాలు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. చాలా మంది అడిగినా నిరాకరించాను. భారత అథ్లెటిక్స్‌పై... నిస్సందేహంగా సౌకర్యాల పరంగా చూస్తే మనం ఎవరికీ తక్కువ కాదు. అయితే ఒలింపిక్స్ స్థాయితో పోలిస్తే అథ్లెటిక్స్ ఇంకా చాలా వెనుకబడే ఉంది. మిడిల్ డిస్టెన్స్‌లో మంచి ఫలితాలే వస్తున్నా స్ప్రింట్స్‌లో ఎంతో మెరుగు పడాల్సి ఉంది. గత కామన్వెల్త్ క్రీడలు మన దేశంలో జరగడం ఎంతో మంచి చేసింది. ఆ తర్వాత ప్రతిభాన్వేషణతో పాటు కార్పొరేట్లు కూడా సహకారానికి ముందుకు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో మనకు ఎక్కువ సంఖ్యలో పతకాలు గెలిచే అవకాశం ఉంది. ప్రత్యేకంగా పేర్లను ప్రస్తావించలేను కానీ ఓవరాల్‌గా అథ్లెటిక్స్ పరిస్థితి రోజు రోజుకూ మెరుగవుతూనే ఉంది. కాస్త ఓపిక పడితే రాబోయే కొన్నేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే మిషన్ 2020 పేరుతో క్రీడల్లో అనేక లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. సరైన కోచ్‌లతో ప్రణాళికలు సమర్థంగా అమలు చేయాల్సి ఉంది. క్రీడల్లో అవినీతిపై... కామన్వెల్త్ వ్యవహారంలో కల్మాడీ పరిస్థితి ఏమైందో చూశారుగా. ఇలా అవినీతిని రూపుమాపాలనే ఆటగాళ్లం అందరం కలసి క్లీన్ స్పోర్ట్స్ సంస్థను స్థాపించాం. క్రీడల్లో అవినీతి బయటపెట్టడంలో మేం కూడా కీలక పాత్ర పోషించామని గర్వంగా చెప్పగలం. వాస్తవంగా చూస్తే ఆటలో ఇంత అవినీతి ఉంటుందా అనేది ఒక అథ్లెట్‌గా ఉన్న సమయంలో తెలీలేదు. కానీ అలాంటివాటిని పరిహరిస్తే భారత్ మరింత వేగంగా దూసుకుపోగలదని అనిపించింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం. గత ప్రభుత్వం క్రీడా సంఘాల్లో రాజకీయ నాయకులు ఉండరాదన్న సూచనకు మేం గట్టిగా మద్దతిచ్చాం. ఇకపై కూడా దీనిని మరింత సమర్థవంతంగా నిర్వహించి క్రీడలను క్లీన్‌గా ఉంచుతామని చెప్పగలం. కుటుంబం.... నా భర్త ఆటోమొబైల్ వ్యాపారంలో చాలా ఏళ్లుగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు అనీషా, దీపాలి. ఆరంభంలో ఆటలపై ఆసక్తి చూపిన అనీషా జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌లో రాణించింది. అయితే ఆ తర్వాత చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయింది. ఇక చిన్న అమ్మాయికి కూడా పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి నా కుటుంబంనుంచి మరో అథ్లెట్ లేనట్లే. -
నాటి ఉష... నిన్నటి అశ్విని బాటలో.
ప్రతిభ అది 2012వ సంవత్సరం... సింగపూర్‌లో 800 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానంలో నిలిచింది పవిత్ర. ఆ మరుసటి ఏడాది 2013లో మలేసియాలో జరిగిన అంతర్జాతీయ పోటీలలోనూ మొదటి స్థానం సంపాదించింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో ఒకటో తరగతిలో పవిత్ర పరుగుల ప్రస్థానం మొదలైంది. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్స్‌లో పాల్గొని గెలవాలన్న ఆశయం ఆమె ముందుంది. పి.టి. ఉష, అశ్వినీ నాచప్పల స్ఫూర్తితో పరుగులో వేగం పెంచుతోంది. ఒక్కసారి గతంలోకి వెళితే... 2009వ సంవత్సరం డిసెంబర్15న చెన్నైలోని పోలీసు అకాడమి గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం జరుగుతున్నాయి. పరుగు పందెంలో పాల్గొంటున్న వారిలో తిరుచ్చి జిల్లా నుండి వచ్చిన 14 ఏళ్ళ పవిత్ర రాకెట్లా ముందుకు దూసుకెళ్లి మొదటి స్థానాన్నిసొంతం చేసుకుంది. అప్పుడు అందరి దృష్టి ఆమె మీద కేంద్రీకృతమైంది. ఎవరీ అమ్మాయి? ఎక్కడ సాధన చేసింది? ఆమెకు శిక్షణ ఎవరిచ్చారు? అనే ప్రశ్నలు. యాభై ఏళ్ల కిందట తమిళనాడుకు వెళ్లి స్థిరపడిన తెలుగు కుటుంబం వీరిది. పవిత్ర తండ్రి రాజేంద్రన్ తిరుచ్చిలో టీ స్టాల్ నడుపుతారు. తల్లి రాజకుమారి గృహిణి. తమ్ముడు తొమ్మిదవ తరగతి. మొదటిసారి బహుమతి! ఒకటో తరగతిలో పాఠశాలలో ఆటల పోటీలో డజను మందిని ఓడించి బహుమతిని అందుకుంది పవిత్ర. ఆమెకు విజయం అంటే ఏమిటో తెలిసిన పరుగు అది. ఆ తరవాత ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌లో పాల్గొంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే తపనను తల్లిదండ్రులకు వివరించింది పవిత్ర. అన్ని మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఎదురయ్యే సమస్యే ఇక్కడ కూడా. ‘చదువుకోవడానికి పాఠశాలకు పంపితే ఈ పరుగులేంటి, వద్దులే’ అంటూ ఆమె ఆశలను మొగ్గలోనే తుంచేసేందుకు ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. నాటి పరుగుల రాణి బాటలోనే... కానీ, పవిత్ర ఆలోచన వేరు. పరుగుల రాణిగా పేరుపడ్డ పి.టి.ఉష, అశ్వినీ నాచప్పల జీవిత చరిత్రల స్ఫూర్తితో తన ఆశయాన్ని వదులుకోకూడదని గట్టిగా భావించింది. తల్లిదండ్రులను ఒప్పించింది. పదవ తరగతిలో 91 శాతంలో ఉత్తీర్ణత సాధించిన ఈ అమ్మాయి తిరువణ్ణామలైలోని హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరింది. క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే ఆ పాఠశాలలో శిక్షణతో అంతర్జాతీయంగా రాణించి మువ్వన్నెల జెండాను ఎగురవేసింది.ప్రస్తుతం చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో బీటెక్ చదువుతున్న పవిత్ర... క్రీడలలో భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సాధన చేస్తోంది. - కోనేటి వెంకటేశ్వర్లు న్యూస్‌లైన్, తిరువళ్లూరు ఒలింపిక్స్‌లో రాణించాలి! భారతదేశం తరఫున ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని విజయం సాధించాలనేదే నా ధ్యేయం. ఇప్పుడు మా టీచర్లు, కోచ్‌తోపాటు మా అమ్మానాన్నలు సహకరిస్తున్నారు. అనుకున్నది సాధించగలననే నమ్మకం ఉంది. - పవిత్ర, క్రీడాకారిణి -
ఐఓఏ తీరు సరిగా లేదు: నాచప్ప
న్యూఢిల్లీ: కళంకిత వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమ రాజ్యాంగాన్ని సవరించడం కేవలం కంటితుడుపు చర్యగానే ఉందని క్లీన్ సపోర్ట్స్ ఇండియా (సీఎస్ఐ) ఆరోపించింది. ‘ఐఓసీ హెచ్చరికల నేపథ్యంలో వారు తమ రాజ్యాంగాన్ని సవరించినట్టు చెబుతున్నారు. అయితే ఈ సవరణను జాగ్రత్తగా పరిశీలిస్తే చార్జిషీట్ దాఖలైన వ్యక్తుల వ్యవహారం తమ సొంత ఐఓఏ ఎథిక్స్ కమిషన్‌కు వెళుతుంది. అక్కడ వారికి క్లీన్చిట్ లభిస్తే తిరిగి వారు పదవి పొందేందుకు అర్హులవుతారు. అందుకే ఈ నిబంధన ప్రభావం చూపదని భావిస్తున్నాం. ప్రస్తుత జనరల్ బాడీ ఇప్పటికీ చౌతాలా, బానోత్ వెనకాలే ఉన్నారని స్పష్టమవుతోంది’ అని సీఎస్ఐ అధ్యక్షురాలు అశ్వనీ నాచప్ప పేర్కొంది. తమపై అభియోగం నమోదైన వారు కోర్టు నుంచి సచ్ఛీలుగా బయటపడాలే కానీ తమ ఎథిక్స్ కమిషన్ నుంచి కాదని నాచప్ప స్పష్టం చేశారు. -
అశ్విని నాచప్ప నగదు రికవరీ
మైసూరులో నిందితుడి అరెస్ట్ = రిపోర్టర్ ముసుగులో చోరీలు = ఎస్ఐ ఈశ్వరిని అభినందించిన సీపీ బెంగళూరు, న్యూస్‌లైన్: మాజీ అథ్లెట్ అశ్విని నాచప్ప ఏటీఎం కార్డులు చోరీ చేసి నగదు డ్రా చేసిన నిందితుడిని ఇక్కడి జయనగర పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు జిల్లా టీ. న రశీపుర పట్టణలోని ఎరగనహళ్లికి చెందిన రవి (44) అనే నిందితుడిని అరెస్టు చేసి రూ. 1.97 లక్షలు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సవ ూవేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 3న జయనగర రెండవ బ్లాక్‌లోని కిత్తూరు రాణి చెన్నమ్మ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగిం ది. ఈ కార్యక్రమానికి అశ్వినీ నాచప్ప ముఖ్యఅథిగా హాజరయ్యారు. ఆ సమయంలో వ్యానిటి బ్యాగ్‌ను స్టేజ్‌పై ఉన్న కుర్చీ మీద పెట్టి జెండా ఎగురవేయడానికి వెళ్లారు. ఆ సమయంలో రవి వ్యానిటీ బ్యాగ్‌లో ఉన్న చిన్న పర్సును చోరీ చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. పర్సులో ఉన్న మూడు ఏటీఎం కార్డులతో వివిధ బ్యాంకుల్లో రూ. 2.40 లక్షల నగదు డ్రా చేశాడు. మొబైల్లో నగదు డ్రా అయ్యిందని మెసేజ్ రావడంతో అశ్వినీ నాచప్ప జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఈశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం బెంగళూరు, మైసూరు నగరాలలో నిందితుడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మైసూరులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసిన ట్లు నగర పోలీసు కమిషనర్ ఔరాద్కర్ చెప్పారు. శ్రీమంతుడి అవతారం : అశ్వినీ నాచప్ప ఏటీఎం కార్డులు చోరీ చేసిన రవి సామాన్యుడు కాడు. దిన పత్రికల్లో వీఐపీల కార్యక్రమాలు తెలుసుకుని సూటు, బూటుతో అక్కడి చేరుకుని ఎవ రికి అనుమానం రాని తరహాలో నడుచుకుంటాడు. మరికొన్ని చోట్ల విలేకరి అంటూ మొదటి వరుసలో కూర్చుని విలువైన వస్తువులు తస్కరిస్తుంటాడని ఔరాద్కర్ చెప్పారు. ఇదే తరహాలో నిందితుడు రవి టౌన్ హాల్, రవీంద్ర కళాక్షేత్ర, హోటళ్లలో చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలి పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్ఐ ఈశ్వరి బృందాన్ని ఔరాద్కర్ అభినందించి నగదు బహుమతి అందజేశారు. -
అశ్విని నాచప్ప పర్సు మాయం
బెంగళూరు, న్యూస్‌లైన్: పరుగుల రాణి అశ్విని నాచప్ప పర్సును ఓ దుండగుడు మాయం చేశాడు. అందులోని రెండు ఏటీఎం కార్డులను ఉపయోగించి రూ.1.70 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ ఘటనపై అశ్విని మంగళవారం స్థానిక జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు.. గత శనివారం బెంగళూరులోని ఓ పాఠశాల నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలకు అశ్విని ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ సందర్భంలో ఆమె వేదికపై ఉంచిన పర్సు చోరీకి గురైంది. దానిలోని 2 ఏటీఎం కార్డులను ఉపయోగించిన దుండగుడు రూ. 1.70 లక్షలు డ్రా చేశాడు. అశ్వినికి తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని, పిన్ నంబర్ కూడా తెలిసి ఉండడంతోనే నగదునూ డ్రా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.