నాటి ఉష... నిన్నటి అశ్విని బాటలో.
ప్రతిభ
అది 2012వ సంవత్సరం... సింగపూర్‌లో 800 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానంలో నిలిచింది పవిత్ర. ఆ మరుసటి ఏడాది 2013లో మలేసియాలో జరిగిన అంతర్జాతీయ పోటీలలోనూ మొదటి స్థానం సంపాదించింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో ఒకటో తరగతిలో పవిత్ర పరుగుల ప్రస్థానం మొదలైంది. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్స్‌లో పాల్గొని గెలవాలన్న ఆశయం ఆమె ముందుంది. పి.టి. ఉష, అశ్వినీ నాచప్పల స్ఫూర్తితో పరుగులో వేగం పెంచుతోంది.
ఒక్కసారి గతంలోకి వెళితే... 2009వ సంవత్సరం డిసెంబర్15న చెన్నైలోని పోలీసు అకాడమి గ్రౌండ్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం జరుగుతున్నాయి. పరుగు పందెంలో పాల్గొంటున్న వారిలో తిరుచ్చి జిల్లా నుండి వచ్చిన 14 ఏళ్ళ పవిత్ర రాకెట్‌లా ముందుకు దూసుకెళ్లి మొదటి స్థానాన్నిసొంతం చేసుకుంది. అప్పుడు అందరి దృష్టి ఆమె మీద కేంద్రీకృతమైంది. ఎవరీ అమ్మాయి? ఎక్కడ సాధన చేసింది? ఆమెకు శిక్షణ ఎవరిచ్చారు? అనే ప్రశ్నలు.
యాభై ఏళ్ల కిందట తమిళనాడుకు వెళ్లి స్థిరపడిన తెలుగు కుటుంబం వీరిది. పవిత్ర తండ్రి రాజేంద్రన్ తిరుచ్చిలో టీ స్టాల్ నడుపుతారు. తల్లి రాజకుమారి గృహిణి. తమ్ముడు తొమ్మిదవ తరగతి.
మొదటిసారి బహుమతి!
ఒకటో తరగతిలో పాఠశాలలో ఆటల పోటీలో డజను మందిని ఓడించి బహుమతిని అందుకుంది పవిత్ర. ఆమెకు విజయం అంటే ఏమిటో తెలిసిన పరుగు అది. ఆ తరవాత ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌లో పాల్గొంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే తపనను తల్లిదండ్రులకు వివరించింది పవిత్ర. అన్ని మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఎదురయ్యే సమస్యే ఇక్కడ కూడా. ‘చదువుకోవడానికి పాఠశాలకు పంపితే ఈ పరుగులేంటి, వద్దులే’ అంటూ ఆమె ఆశలను మొగ్గలోనే తుంచేసేందుకు ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు.
నాటి పరుగుల రాణి బాటలోనే...
కానీ, పవిత్ర ఆలోచన వేరు. పరుగుల రాణిగా పేరుపడ్డ పి.టి.ఉష, అశ్వినీ నాచప్పల జీవిత చరిత్రల స్ఫూర్తితో తన ఆశయాన్ని వదులుకోకూడదని గట్టిగా భావించింది. తల్లిదండ్రులను ఒప్పించింది. పదవ తరగతిలో 91 శాతంలో ఉత్తీర్ణత సాధించిన ఈ అమ్మాయి తిరువణ్ణామలైలోని హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చేరింది. క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే ఆ పాఠశాలలో శిక్షణతో అంతర్జాతీయంగా రాణించి మువ్వన్నెల జెండాను ఎగురవేసింది.ప్రస్తుతం చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో బీటెక్ చదువుతున్న పవిత్ర... క్రీడలలో భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సాధన చేస్తోంది.
- కోనేటి వెంకటేశ్వర్లు న్యూస్‌లైన్, తిరువళ్లూరు
ఒలింపిక్స్‌లో రాణించాలి!
భారతదేశం తరఫున ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని విజయం సాధించాలనేదే నా ధ్యేయం. ఇప్పుడు మా టీచర్లు, కోచ్‌తోపాటు మా అమ్మానాన్నలు సహకరిస్తున్నారు. అనుకున్నది సాధించగలననే నమ్మకం ఉంది.
- పవిత్ర, క్రీడాకారిణి