
కొండమల్లెల నడుమ కొత్త పరిమళం...
కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు మనలోకి మనం ప్రయాణించేలా చేసి కొత్తదారిని కనుక్కునేలా చేస్తాయి.
కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు మనలోకి మనం ప్రయాణించేలా చేసి కొత్తదారిని కనుక్కునేలా చేస్తాయి. రోడ్డు ప్రమాదానికి గురైన డా.మాలా శ్రీకాంత్...ఆ ప్రమాదాన్ని గుర్తు తెచ్చుకొని బాధ పడ్డారో లేదో తెలియదుగానీ... తనలోకి తాను ప్రయాణించారు. కొత్తదారిలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. పుట్టింది బెంగాల్‌లో అయినా తండ్రి వృత్తిరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో చదువుకున్నారు.
మిలిటరీ అధికారి కుమార్తె అయిన మాల తండ్రి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నారు. తల్లి చెప్పే కథల్లో నుంచి దయాగుణాన్ని అలవర్చుకున్నారు. రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల రకరకాల వ్యక్తులతో, సంస్కృతి, సంప్రదాయాలతో పరిచయం ఏర్పడింది.
వైద్యవిద్యను అభ్యసించిన మాల వృత్తిలో భాగంగా ఒమన్ వెళ్లారు. అక్కడి ఎడారి గ్రామాల్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రజలతో మరింతగా కలిసిపోవడానికి అరబిక్ నేర్చుకొని దానిలో పట్టు సాధించారు. ‘ప్రజల డాక్టర్’గా పేరు తెచ్చుకున్నారు. పుష్కరం తర్వాత మన దేశానికి తిరిగివచ్చి ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’లో ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా చేరారు. ఢిల్లీలో ‘క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పని చేస్తున్న సమయంలో మాల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం వల్ల ఆమె శారీరకంగా, మానసికంగా దెబ్బ తిన్నారు. జ్ఞాపకశక్తి దూరమై పోయింది. మెల్లగా కోలుకోవడం ప్రారంభమైన తరువాత- ‘‘ఇది నాకు రెండో జీవితం’’ అనుకున్నారు.
జీవితం అంటే ఏదో ఒక రకంగా జీవించడం కాదని, ఒక మంచి పని కోసం జీవించడమనే తత్వాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఈ సరికొత్త జీవితంలో తన గురించి, పిల్లల గురించి, బంధువుల గురించి ఆలోచించడం కాకుండా పదిమందికి ఉపయోగపడే పనుల గురించి ఆలోచించాలనుకున్నారు. తన ఇంటిని ఢిల్లీ నుంచి ఉత్తరఖండ్ రాష్ట్రం ఆల్మోరా జిల్లాలో ఉన్న రాణిఖేత్ అనే హిల్‌స్టేషన్‌కి మార్చారు. ‘‘ఈ వయసులో ఒంటరిగా ముక్కూముఖం తెలియని వారి మధ్య...’’ అని సన్నిహితులు నసిగారు. కానీ ఆ అభ్యంతరాలను మాల పట్టించుకోలేదు.
కొత్త ప్రదేశాలకు వెళ్లడం, వారితో కలిసిపోవడం ఆమెకు కొత్త ఏమీ కాదు. అందుకే ధైర్యంగా ముందడుగు వేశారు. రాణిఖేత్ కొండ ప్రాంతంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి రకరకాల అల్లికలు అంటే మాలకు ఎంతో ఇష్టం. ఆ అల్లికలే చాలామంది జీవితాల్లో వెలుగు నింపుతాయని ఆమె ఊహించి ఉండరు. కొండ ప్రాంత మహిళలకు చాలా అల్లికలు వచ్చు. వారి ఉత్పత్తులకు మార్కెట్ కలిపించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా మార్కెట్‌లో వాటికి ‘‘నాణ్యత లేదు’’ అనే మాట తరచుగా వినిపించేది. ఈ నేపథ్యంలో సరికొత్త అల్లికలను నేర్చుకొని, తాను నేర్చుకున్న వాటిని అక్కడి మహిళలకు చెప్పడం మొదలుపెట్టారు మాల. దీంతో మునపటి కంటే ఎక్కువ ఉత్సాహం, నైపుణ్యంతో రాణిఖేత్ మహిళలు రకరకాల అల్లికలు చేపట్టేవారు. మార్కెట్‌లో వాటికి డిమాండ్ పెరగడం మొదలైంది.
‘‘ఇక్కడి ప్రజలకు కష్టపడే తత్వం ఉంది. దానికి నైపుణ్యం తోడైతే తిరుగేముంది? అనుకున్నాను. అందుకే అల్లికలలో కొత్తవి, నాణ్యమైనవి నేర్చాను. నేర్పాను’’ అంటారు మాల. ‘‘ఆమె రావడానికి ముందు చాలా విషయాలు తెలిసేవి కావు. ఇప్పుడు చాలా విషయాల మీద అవగాహన పెరిగింది’’ ‘‘డాక్టర్‌గారు ఇక్కడికి రావడానికి ముందు అల్లిక అనేది అభిరుచిగానే ఉండేది. దాన్ని ఆర్థికంగా ఉపయోగపడేటట్లు చేశారు. స్వయం సహాయక గ్రూపులు స్థాపించారు’’ రాణిఖేత్ మహిళలను కదిలిస్తే మాల గురించి ఇలాంటి ప్రశంసలు ఎన్నో వినిపిస్తాయి.
అల్లికలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా ఆమె అందరికీ అర్థమయ్యేలా చెబుతారు. రాణిఖేత్ వాసులలో ఆరోగ్యస్పృహ కలిగించడానికి తన వంతుగా ప్రయత్నిస్తున్నారు మాల. పట్టణాలలో రణగొణ ధ్వనులకు అలవాటు పడిన ఆమె చెవులకు రాణిఖేత్‌లోని ప్రశాంతత, పచ్చదనం అంటే ఎంతో ఇష్టం.ప్రకృతి అందాలే కాదు స్థానిక ప్రజలతో బాగా కలిసి పోవడం, వారు చెప్పే విషయాలు వినడం అంటే కూడా ఆమెకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం తన మనసులో ఒక నవల రూపుదిద్దుకుంటుంది. అది అక్షరాల్లోకి వస్తే...వైద్యురాలిగా, నలుగురికి దారి చూపే వ్యక్తిగా పరిచయమైన మాల శ్రీకాంత్ రచయిత్రిగా కూడా పరిచయమవుతారు.