విందు భోజనానికి రమ్మని రాజప్రాసాదం నుంచి ఓ రోజు ముల్లా నస్రుద్దీన్‌కి ఆహ్వానం అందింది. వెళ్లాడు. అయితే అక్కడి సేవకులెవ్వరూ అతడిని పట్టించుకోలేదు. మాసి, చిరుగులు పట్టిన దుస్తుల్ని ధరించి ఉన్న నస్రుద్దీన్‌ని ఒక్కరూ భోజనానికి పిలవలేదు. నస్రుద్దీన్ వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. తనకు ఉన్నవాటిలో అతి ఖరీదైన దుస్తులను ధరించి మళ్లీ రాజప్రాసాదానికి చేరుకున్నాడు. ఈసారి ప్రవేశ ద్వారం దగ్గర్నుంచే అతడికి స్వాగతం మొదలైంది! కొందరు సేవకులు నస్రుద్దీన్ వెంటే వుండి అతడిని భోజన బల్లల దగ్గరికి తీసుకెళ్లి, విలాసవంతులు భుజించే వరుసలో కూర్చోబెట్టారు. వెంటనే మరికొందరు సేవకులు వచ్చి నస్రుద్దీన్‌కి భయభక్తులతో వేడివేడి విందు భోజనం వడ్డించారు.
అయితే నస్రుద్దీన్ భోజనాన్ని ఆరగించకుండా, ఆహార పదార్ధాలను చేత్తో తీసుకుని, తన దుస్తులకు పూసుకోవడం మొదలుపెట్టాడు! అది చూసి, పక్కనే ఉన్న మరొక అతిథి ఆశ్చర్యపోయి, ‘‘మీరేం చేస్తున్నారో.. మీకు తెలుస్తోందా?’’ అని అడిగాడు. నస్రుద్దీన్ నవ్వాడు. ‘‘తెలుస్తూనే ఉంది’’ అన్నాడు. ‘‘ఏం తెలుస్తోంది? ఆహారాన్ని బట్టలకు అలా పూసుకోవడం ఏంటి?’’ అని అడిగాడు అతిథి. నస్రుద్దీన్ మళ్లీ నవ్వాడు. ‘‘నేను భోజనం చేయడానికి ముందు.. నా బట్టలకు భోజనం పెట్టడం నా ధర్మం అనుకున్నాను. ఎందుకంటే ఈ బట్టల కారణంగానే ఈ రాజప్రాసాదంలో నేను భోజనాన్ని పొందగలిగాను’’అన్నాడు నస్రుద్దీన్. మనం ఎంత గొప్పవాళ్లం అయినా కావచ్చు, ఆ గొప్పదనాన్ని ప్రపంచం చేత గుర్తుపట్టించేవి మనం ధరించే దుస్తులేనని నస్రుద్దీన్ తన సహజమైన వ్యంగ్య ధోరణిలో చక్కగా చెప్పారు.
విందు భోజనం
Published Thu, Dec 21 2017 11:39 PM | Last Updated on Thu, Dec 21 2017 11:39 PM
Comments
Please login to add a commentAdd a comment