ఆ పెళ్లి పత్రిక...జాతి సంపదకు ప్రతీక!
పెళ్లి ఓ తీపి జ్ఞాపకంగా మిగలాలని కోరుకుంటారెవరైనా. ఫాతిమున్నీసాబేగం కూడా అలాగే అనుకున్నారు. పెళ్లి పత్రికను అపురూపంగా దాచుకున్నారు. ఇది జరిగి 55 ఏళ్లయింది. ఇప్పుడా పత్రిక ఓ చారిత్రక ఘట్టానికి తెరతీసింది.
డెబ్బై ఏళ్ల ఫాతిమా బేగంకి పదిహేనేళ్ల వయసులో పెళ్లయింది. మధురోహలతో తాను దాచుకుంటున్న ఈ పెళ్లిపత్రిక ఓ చారిత్రక సంపదకు సూచిక అవుతుందని అప్పుడామెకి తెలియదు. అమ్మానాన్నలు తనకు పెళ్లి కానుకగా ఇచ్చిన ముఖమల్ బోర్డరు భారతీయ వారసత్వ సంపద కానుందని కూడా తెలియదు. ఆ అంచు కుట్టిన చీరను ధరించి అనేక వేడుకలకు హాజరయ్యారామె. అయితే అప్పుడు ఆమెకి కానీ బంధువులకు కానీ అందులో ఉన్నది నవరత్నాలనీ, అవి మొఘల్ కాలం నాటివనీ తెలియదు.
తీరా రెండేళ్ల క్రితం వాళ్లకు నవరత్నాలతో కుట్టిన ముఖమల్ అంచు గురించి తెలిసింది. అప్పటి నుంచి ఫాతిమున్నీసా బేగం కుటుంబానికి కంటి మీద కునుకులేదు. కన్ను మూస్తే పూర్వీకులు కలలో కనిపించసాగారు. వాళ్లు పాటించే ఖురాన్ సూత్రాల ప్రభావంతో ‘ఇది జాతి సంపద కాబట్టి ప్రభుత్వానికి చేర్చాలి’ అని మనసు హెచ్చరించసాగింది. ఎవరి చేతుల్లో పెడితే ఎలా దారి తప్పుతుందోననే భయం ఒక పక్క, వారసత్వ సంపదను ప్రదర్శన శాలలకు ఎలా చేర్చాలో తెలియనితనం మరో పక్క. దీంతో విషయాన్ని ప్రసార మాధ్యమాల దృష్టికి తీసుకువస్తే ఓ మార్గం కనిపిస్తుందనుకున్నారు.
అసలింతకీ ఎవరీ ఫాతిమున్నీసాబేగం? అంత విలువైన ముఖమల్ బోర్డరు కథేమిటి? ఫాతిమున్నీసాబేగం వరంగల్ జిల్లా చేర్యాలలో నివసించేవారు. ఫాతిమా తల్లిదండ్రులు మహ్మద్ అబ్దుల్ వలీబ్ సాహెబ్, తల్లి రుకియా బీబీ. వారికి ఫాతిమున్నీసా బేగం ఏకైక పుత్రిక. ఫాతిమున్నీసా బేగం పూర్వీకులు మొఘల్ ఆస్థానంలో ఉర్దూ పండితులు. మొఘల్ రాజవంశీయుల నుంచి కానుకగా అందిన ముఖమల్ చున్నీలోని నవరత్నాలను వారు జాగ్రత్తగా దాచారు. రుకియా బీబీ తన కూతురు పెళ్లి కోసం ఆ నవరత్నాలను 24 అడుగుల ముఖమల్ వస్త్రం మీద 40 పువ్వులు, లతల డిజైన్‌లో ఎంబ్రాయిడరీ చేశారు. మొత్తం డిజైన్‌లో 40 వేల నవరత్నాలున్నాయి. ఆ ముఖమల్ వస్త్రాన్ని ఎనిమిది గజాల చీరకు అంచుగా అతికించి పెళ్లి కూతురికి బహూకరించారు. ఫాతిమున్నీసా బేగం ఆ చీరతో అనేక వేడుకలకు హాజరయ్యారు. చీర పాతదైపోయినప్పుడు బోర్డరు విడదీసి మరో చీరకు కుట్టించుకుంటూ వచ్చారు. 2002లో ఫాతిమున్నీసాబేగం భర్త మరణించడంతో అప్పటి నుంచి అలంకరణలకు దూరమైన ఆమె ముఖమల్ బోర్డరు చీరను ధరించడం మానేశారు. ఇదీ చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న ముఖమల్ బోర్డరు ఉదంతం.
ఫాతిమున్నీసాబేగం ఆ చీరను వాడడం మానేసిన తర్వాత రెండేళ్ల కిందట ఒకరోజు ఉన్న ఇల్లు ఖాళీ చేయడానికి ఒక్కోపెట్టె తెరిచి అవసరం లేని కాగితాలను తీసివేస్తున్నప్పుడు 1959లో పెళ్లి సందర్భంగా ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక ఆమె చేతికొచ్చింది. ఒక మధుర జ్ఞాపకంగా దాచుకున్న పత్రికతోపాటు బాండ్‌పేపర్ మీద రాసుకున్న అంగీకార పత్రం కూడా దొరికింది. అందులోని విషయాన్ని ఆమె ఆసాంతం చదివింది కూడా అప్పుడే. మొఘల్ కాలం నాటి నుంచి వారసత్వంగా వచ్చిన నవరత్నాలు పొదిగిన ముఖమల్ బోర్డర్ కుట్టిన చీరను తమ కుమార్తెకు బహూకరిస్తున్నట్లు ఉర్దూలో రాసి ఉంది. అది తెలిసి ఆమెలో ఆనందం వెల్లివిరిసింది.
అంతలోనే దానిని ఎలా భద్రపరచాలో తెలియక, ఎలా జాతికి అందచేయాలో అర్థం కాక అయోమయానికి లోనయ్యారు. అది చేరాల్సిన చోటికి చేరాలన్నా, అప్పటి వరకు అది భద్రంగా ఉండాలన్నా, ఆ విలువైన సంపద కారణంగా తమకు ప్రాణహాని కలగకుండా ఉండాలన్నా... తగినంత ప్రచారం కల్పించడమే మార్గం అనుకున్నారు ఆమె పెద్దకొడుకు సర్దార్. అలా ప్రసారసాధనాల ముందుకు వచ్చిందీ మొఘల్‌కాలం నాటి నవరత్నాలతో కుట్టిన ముఖమల్ బోర్డరు. ఈ విషయాన్ని తెలుసుకుని వరంగల్ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు. వారి ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ ఫాతిమున్నీసా బేగంను కలిసి చేర్యాల పట్టణంలోని అంగడి బజార్‌లో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాకరు తెరిపించి ఈ చారిత్రక సంపదను భద్రం చేయించారు.
నవరత్నాలను అమ్మితే లక్షలు వస్తాయి. కానీ నాటి కుట్టుపని నైపుణ్యం తర్వాతి తరాలకు తెలియకుండా పోతుంది. అందుకే దానిని యథాతథంగా ఉంచడానికే మొగ్గు చూపుతున్నారు ఫాతిమున్నీసా బేగం కుటుంబీకులు. వారికి వారసత్వంగా అందిన ఈ కానుక జాతి సంపద కూడా. దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది.
నేను హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో డోర్‌పాలిష్ వర్కుల వంటి ప్రైవేట్ సర్వీస్ చేస్తుంటాను. మా తమ్ముడు పండ్ల వ్యాపారం చేస్తాడు. చేర్యాల ఇంటిలో అమ్మ పెట్టెలో ఉన్న కాగితాల్లో ఉన్న పెళ్లి పత్రికతోపాటు బాండ్‌పేపర్‌ను చదివిన తర్వాత మా అమ్మ నాకు చూపించింది. నేను ఆ ముఖమల్ బోర్డరును చార్మినార్‌లో జవహరీ అనే జెమాలజిస్టుకు చూపించాను. ఆయన వృద్ధుడు, ఈ రంగంలో చాలా పరిణితి చెందిన వ్యక్తి. ఆయన దీనిని చూసి ఆశ్చర్యపోయారు. కొన్ని కోట్ల విలువ చేస్తుందని చెప్పారు. దీనిని సాలార్‌జంగ్ మ్యూజియంలో పెడితే ఎక్కువ మంది చూస్తారు. విదేశీయులకు మన దేశంలో ఉన్న పనితనం, జాతిరత్నాల విలువ తెలుస్తుంది. అయితే మాకు దీనిని మ్యూజియానికి ఎలా చేర్చాలో తెలియదు.
- సర్దార్, ఫాతిమున్నీసా బేగం పెద్దకొడుకు
వస్తువును దాచి విషయాన్ని తెలియచేయాలి!
ఎవరైనా ఒక పురాతన వస్తువును గుర్తించినప్పుడు ఆ విషయాన్ని దగ్గరలో ఉన్న మ్యూజియానికి కానీ, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు కానీ, ఇన్‌ట్యాక్ సంస్థకు కానీ తెలియచేయాలి. ప్రతి జిల్లాకేంద్రంలో ఆర్కియాలజీ విభాగాలున్నాయి. తవ్వకాల్లో దొరికినా, తమ ఇంట్లోనే ఉన్నదైనా... ఓనర్‌షిప్ ప్రకటితమయ్యే వరకు భద్రపరిచి ఆ తర్వాత సంబంధిత శాఖల అధికారులకు అందచేయాలి. ముందుగా ఫొటోలను మాత్రమే బయటపెట్టాలి. పారితోషికం విషయంలో తవ్వకాల్లో బయటపడిన వాటికి ఓ రకం, సొంత ఆస్తికి ఓ రకమైన నిబంధనలు వర్తిస్తాయి.
- అనూరాధారెడ్డి, ఇన్‌ట్యాక్ కన్వీనర్
- మంకాళ నాగేశ్,సాక్షి, చేర్యాల