గణ గణ గణపయ్య | Nellore School Students Preparing Eco Friendly Ganesh | Sakshi
Sakshi News home page

గణ గణ గణపయ్య

Published Wed, Aug 28 2019 6:51 AM | Last Updated on Wed, Aug 28 2019 6:51 AM

Nellore School Students Preparing Eco Friendly Ganesh - Sakshi

విద్యార్థినులతో గణేశ విగ్రహాలు తయారు చేయిస్తున్న గణిత అధ్యాపకురాలు తన్నీరు శశి

నారు పోసినవాడే నీరు పోస్తాడని అంటారు. నారు పోసి నీరు పోసే ఆ దైవానికే మట్టితో చక్కటి ఆకృతినిచ్చి, ధాన్యపు గింజలతోకనుల‘పంట’గా అలంకరిస్తున్నారు పుదూరు స్కూలు పిల్లలు.

వినాయక చవితి వస్తోందంటే పిల్లలకు ఆటవిడుపు. వినాయకుడి రూపమే వాళ్లకు పెద్ద వినోదం. పెద్ద బొజ్జ, తొండం, విశాలమైన చెవులు.. అన్నీ సంతోషమే పిల్లలకు. తొండాన్ని తాకి చూసి, చెవుల్ని లాగి, బొజ్జను తడిమి మురిసిపోతారు. చేతిలో ఓ మట్టిముద్ద పెట్టి వినాయకుడి బొమ్మ చేయమంటే... తలా ఒక్క తీరుగా చేస్తారు. ఒకరి బొమ్మలో తల పెద్దదై, బొజ్జ చిన్నదయిపోతుంది. మరొకరి బొమ్మలో చెవులు సాగిపోయి తొండం ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది. ఎన్ని తీరులుగా చేసినా అది గణపతి రూపం అని ఒకరు చెప్పాల్సిన పనే ఉండదు. ఆ చిన్న చేతుల్లో, వారి చేతల్లో ఇమిడిపోతుంది గణేశుడి రూపం. ఈ బొమ్మలు చూడండి. సుష్మ అనే అమ్మాయి శనగల గణేశుడిని చేసింది. హిమ తన గణేశుడిని కాకర, బెండ, మొక్కజొన్న గింజలతో అలంకరించింది. ఒక అమ్మాయి గణేశుడికి సొర గింజలద్దింది. ఓ అమ్మాయి మెంతులతో అలంకరించి, ధనియాలతో గణేశుడికి కళ్లు పెట్టింది. ఇలా అలసంద, టొమాటో, కాకర వంటి గింజలతో గణేశుడి బొమ్మలు చేశారు. వీళ్లంతా నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, పుదూరు బాలయోగి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు.

పుదూరు బాలయోగి బాలికల పాఠశాలలో ఆరువందలకు పైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఆ స్కూలు ప్రిన్సిపల్‌ ఎల్‌. కిరణ్మయి, గణిత అధ్యాపకురాలు తన్నీరు శశి ఆధ్వర్యంలో స్కూలు విద్యార్థినులకు ఇటీవల వర్క్‌షాప్‌ జరిగింది. గడచిన పన్నెండేళ్లుగా ఈ స్కూల్లో పర్యావరణ హితమైన గణేశ విగ్రహాల తయారీ వర్క్‌షాప్, ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారు. ఏటా వినాయక చవితికి ఓ పది రోజుల ముందు వర్క్‌షాప్‌ నిర్వహిస్తారు. ఆ వర్క్‌షాప్‌లో టీచర్, కొంతమంది చెయ్యి తిరిగిన పిల్లలతో కలిసి రకరకాల బొమ్మలు తయారు చేస్తారు. మిగిలిన విద్యార్థినులు సొంతంగా వినాయకుడి విగ్రహాలు తయారు చేసి, ఆ విగ్రహాలను వినాయక చవితి రోజు ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. ఏటా మట్టి గణపతికి మాత్రమే పరిమితమైన పుదూరు గురుకుల పాఠశాల వర్క్‌షాప్‌ ఈ ఏడాది ఆగ్రో గణపతికి మారింది. గింజల గణపతి విగ్రహాలను అగ్రికల్చరల్‌ ఒకేషనల్‌ ట్రైనర్‌ జగదీశ్‌ సహకారంతో  తయారు చేసినట్లు చెప్పారు ప్రిన్సిపల్‌ కిరణ్మయి. వినాయక చవితి తర్వాత ఈ విగ్రహాలను నీటిలో కరిగించి స్కూలు ఆవరణలోనే ఉన్న వ్యవసాయ మడులలో చల్లుతారని, ఈ గింజలు మొలకెత్తిన తరవాత వాటి సాగు కూడా పిల్లలకు నేర్పిస్తామని చెప్పారు గణిత అధ్యాపకురాలు తన్నీరు శశి.

పిల్లలకు విగ్రహాల తయారీ నేర్పించడంలో గణితాన్ని కూడా భాగం చేస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. మట్టిని స్థూపాలు, శంఖువులు, అర్ధ గోళాలుగా చేసి వాటితో వినాయకుడి రూపం తెస్తారు. ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్, క్రియేటివిటీ, గణిత బోధనలను సమ్మిళితం చేస్తారు. వీరి ఉత్సాహం, కృషి అభినందనీయం.– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement