శ్రావణం వచ్చింది.
పండగ వాతావరణానికి సంతకం పెట్టింది.
వ్రతాలకు తోరణం అయింది.
అమ్మాయిల అలంకరణ గృహాలన్నీ
ఇప్పుడు రాణిగారి మందిరాలే!
హరివిల్లులు సైతం వెలవెల పోయేలా
ఈ యవరాణులు వర్ణాలను వస్త్రాలుగా ధరిస్తున్నారు.
శ్రావణం వచ్చింది.
లంగా ఓణీ ధరించింది.
శుభం. లక్ష్మీ కటాక్షం!
⇒ సాదా సీదాగా కనిపించే కుచ్చుల లెహంగాకు మరో ప్రింటెడ్ క్లాత్‌ని కుడివైపున లేయర్‌గా జత చేస్తే ఈ తరం డిజైనర్ పరికిణీ అవుతుంది. దీనికి ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, ప్లెయిన్ ఓణీ ధరిస్తే అమ్మడి సింగారానికి కొత్త భాష్యాలు రాసుకోవచ్చు.
⇒ లంగా, ఓణీ, బ్లౌజ్ ఒకే రంగులో ఎంపిక చేసుకుంటే ఈ తరం అమ్మాయిల ఎంపికకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డట్టే! స్వరోస్కి వర్క్ చేసిన రాయల్ బ్లూ కలర్ లెహంగా, అదే హంగులతో అమరిన స్లీవ్‌లెస్ బ్లౌజ్, చిన్న చిన్న బుటీలతో ఓణీ సింగారం అబ్బుర పరుస్తుంది.
⇒ పండగ అంటేనే పసుపు–ఎరుపుల కాంబినేషన్. ఆ రంగుల హ్యాండ్లూమ్ క్లాత్‌ని ఎంపిక చేసుకొని లంగాఓణీగా డిజైన్ చేసుకుంటే పండగ వేళ ఇలా కళగా ముస్తాబు కావచ్చు. నట్టింటికి పండగ శోభను ఇట్టే మోసుకురావచ్చు.
⇒ పసుపు రంగు నెటెడ్ లెహంగా, దానికి అంచుగా డిజైనర్ ప్యాచ్ జత చేస్తే పండగ శోభ వచ్చితీరాల్సిందే! అంచు రంగులో ఎంపిక చేసుకున్న స్లీవ్‌లెస్ బ్లౌజ్, కాంట్రాస్ట్ ఓణీ ధరిస్తే ఆధునికతకు సంప్రదాయపు హంగులు అద్దినట్టే!
⇒ తెల్లటి పరికిణీకి ఎంబ్రాయిడరీ చేసిన పర్పుల్ కలర్ అంచును ప్యాచ్‌గా వేసి, అదే రంగు ప్లెయిన్ బ్లౌజ్ ధరించి, వైబ్రెంట్‌గా వెలిగే ఓణీని జత చే ర్చితే... ఇదిగో ఇలా తెలుగింటి పండగకు నట్టింట విరుస్తాయి సంబరాల వెలుగులు.
⇒ గులాబీ రంగు బెనారస్ పట్టు లెహంగాకు అంచుగా ప్లెయిన్ క్లాత్, దానికి కిందగా మరో లేయర్.. డిజైనర్ లెహంగాలో కొత్తగా మెరిసిపోతుంది ఈ తరహా డ్రెస్సింగ్. బంగారురంగును పోలి ఉండే లాంగ్ జాకెట్, ప్లెయిన్ ఓణీ వేడుకును మరింతగా వెలిగిపోయేలా చేస్తుంది.
⇒ చేతిపనితనంతో లతలలో ఒదిగిన పువ్వుల హంగులు నీలిరంగు పరికిణీపై నిలువుగా పరుచుకున్నాయి. అంచు లుగా తీరుగా ముస్తాబు అయ్యాయి. ఏ మాత్రం మ్యాచ్ కాని కాంట్రాస్ట్ బ్లౌజ్, క్రీమ్ కలర్ ఓణీ పండగకు సంప్రదాయపు కళ అద్దుతుంది.
శ్రావణం రాణుల ఓణీలు
Published Thu, Jul 27 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM
Advertisement