భళి భళి భళిరా భళీ! బంగారు బాహు భళీ!!
జాకెట్లకు వచ్చిందండి.. కనకంతో కళా కేళీ!
పెళ్ళికూతురే కాదు పెళ్లికి హాజరయ్యే వారూ వినూత్న బ్లౌజ్ డిజైన్లతో మండపాలకు కళ తీసుకువస్తున్నారు. ఆభరణాలను ధరించడంతో పాటు బ్లౌజ్‌నే ఆభరణంగా మార్చేస్తున్నారు. గ్రాండ్‌గా ఉండే ఈ కళ ఇప్పుడు సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లలో పెద్ద పీట వేస్తున్నాయి.
కాసులపేరు
మెడనిండుగా బంగారు కాసులతో చేసిన హారం వేసుకుంటు చూసే కళ్ళన్నీ కుళ్లుకోవాల్సిందే! మెడలోనే కాసుల పేరు వేసుకుంటే ఎలా? చేతులకు, వీపు భాగాన కాసులు మెరిసిపోవాలి. ముత్యాలతో కలిసి దోస్తీ చేయాలి. డిజైన్‌ని బట్టి కాసుల సంఖ్యను ఎంచుకోవాలి. చుట్టూతా కుందన్స్, జర్దోసీతో అలంకరించాలి. ఖరీదును బట్టి అచ్చమైన బంగారపు కాసులను కూడా బ్లౌజ్ డిజైన్‌కి ఎంచుకోవచ్చు.
పూసల హారాలు
ఇతర బంగారు హారాలు అక్కర్లేదు. ఎంబ్రాయిడరీ వర్క్‌లే నెక్లెసులు అవుతున్నాయి. అదీ బోట్‌నెక్ బ్లౌజ్‌కి స్వరోస్కి, జర్దోసీ మగ్గం వర్క్‌లు కొత్త కొత్త సొగసులను అద్ది చూపరుల మతులను పోగొడుతున్నారు డిజైనర్లు. జువెల్రీ ఎంబ్రాయిడరీ వర్క్‌లో కుందన్స్, పూసలు ప్రధానంగా ఉంటున్నాయి.
కనక మహాలక్ష్మి
నిన్నా మొన్నటి వరకు టెంపుల్ జువెల్రీలో అష్టలక్ష్ముల మూర్తులు దర్శనమిచ్చేవి. నేడు బ్లౌజ్ చేతుల మీదా, వీపు మీదా లక్ష్మీదేవి మూర్తిని పెట్టి, చుట్టూతా పొందికైన డిజైన్‌తో కళ్లకు నిండుతనాన్ని తీసుకువస్తున్నారు. ఎంత గ్రాండ్‌గా ఉంటే అంత బాగు అన్నట్టుగా పెళ్లికి అష్టలక్ష్ములు నడిచి వచ్చినట్టు బ్లౌజ్‌ని అలంకరించేస్తున్నారు. ముఖ్యంగా ఈ డిజైన్ చేతుల మీద కొలువుదీరుతుంది.
నెల వంకలు
అమ్మాయిలే నేలమీద నడిచే చంద్రవంకలు. అలాంటి వారి బ్లౌజ్‌ల మీద నెలవంక చుక్కల సంఖ్యను మించిపోయేలా చేరిపోతే ఎంత అందం. ఆ అందాన్ని పోలి ఉండేలా ఆభరణాల ఎంపికతో బ్లౌజ్ మీద ఇలా సింగారించుకోవచ్చు. ఖరీదును బట్టి ఈ జువెల్రీ డిజైన్లను రూపొందించుకోవచ్చు. అవి అచ్చమైన బంగారమా, ఇమిటేషన్ జువెల్రీతోనా అనేది మీ ఇష్టం.
నిర్వహణ: ఎన్.ఆర్
Comments
Please login to add a commentAdd a comment