సాక్షి, హైదరాబాద్: అతి వేగానికి మరో ప్రాణం బలైపోయింది. రూ.69.47 కోట్లతో నిర్మించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ఈ నెల 4న ప్రారంభమైంది. తరువాత వారానికే ఇక్కడ సెల్ఫీలు దిగుతూ ఇద్దరు యువకులు మరణించారు. తాజాగా, శనివారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ పై నుంచి కారు పల్టీలు కొడుతూ కిందపడిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో డిజైన్ లోపం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని సిటిజెన్లు అభిప్రాయపడుతుండగా, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు పక్కా డిజైన్‌తో దీన్ని నిర్మించామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. తొలి ప్రమాదం నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, నిర్ణీత ప్రమాణాల కంటే మరింత జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెబుతున్నా.. వాటిని ప్రజలకు చేరవేయడంలో ఇటు జీహెచ్‌ఎంసీ, అటు పోలీసు విభాగాలు విఫలమైనట్టు ప్రజలు భావిస్తున్నారు.
ఎక్కితే.. రయ్యిన దూసుకుపోవడమే
ఫ్లైఓవర్‌పై ప్రయాణ వేగం గంటకు 40 కిలోమీటర్లు కాగా, బోల్తాపడ్డ కారు ప్రమాద సమయంలో 105 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ సూపర్ ఎలివేషన్‌తో క్రాష్ బారియర్స్ ఉన్నా పైకెగిరి కిందపడింది. 80 కి.మీ.ల వేగంతో ఢీకొట్టినా తట్టుకునేలా క్రాష్ బారియర్స్ ఏర్పాటు చేశారు. సాధారణంగా క్రాష్ బారియర్స్‌ను ఢీకొంటే.. వాహనం తిరిగి వెనక్కి వస్తుంది. కానీ నియంత్రించలేని అతి వేగం వల్ల క్రాస్‌బారియర్స్ పైకెగిరి మరీ కారు కింద పడినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.
నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లలో అత్యంత ఎత్తయిన ఈ ఫ్లైఓవర్ దిగువన మరో ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. దీని పొడవు 990 మీటర్లు కాగా, దాదాపు 600 మీటర్ల దూరం వద్ద ఈ ఘటన జరిగింది. బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద రద్దీ సమయంలో ప్రయాణించే వాహనాలు గంటకు 20 వేలు కాగా, ఫ్లైఓవర్‌పై 7 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. రాయదుర్గం వైపు నుంచి హైటెక్‌సిటీ, ఇనార్బిట్‌మాల్ వైపు వెళ్లేందుకు ఆటంకాల్లేకపోవడంతో ఫ్లైఓవర్ పై నుంచి రయ్యిన దూసుకుపోతున్నారు. వంతెన మధ్య భాగంలో దాదాపు 150 మీటర్ల మేర కర్వ్ ఉంది. వేగంగా వచ్చే వారు ఇక్కడ నియంత్రించుకోవాలన్నా సాధ్యం కావట్లేదు.
హోరెత్తిన సోషల్ మీడియా..
ఫ్లైఓవర్ ప్రమాదంపై సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు శనివారం రోజంతా వైరల్ అయ్యాయి. ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరెలా స్పందించారంటే..
ఎన్ని ప్రమాణాలు పాటించినా, జాగ్రత్తలు తీసుకున్నా పౌరుల్లో మార్పు రానిదే ప్రమాదాలను అరికట్టలేం. ఫ్లైఓవర్ కట్టినంత సేపు పట్టలేదు.. మూసేయడానికి..
మలుపు వద్ద ప్రమాదకరంగా ఉందని కొద్ది రోజుల క్రితమే గుర్తించి ట్వీట్ చేశాం.
వేగ పరిమితి సూచికలున్నా నిర్లక్ష్యంగా డ్రై వింగ్ చేసే వారికి భారీ పెనాల్టీలు వేయాలి.
ఫ్లైఓవర్ ప్రారంభానికి తొందరపడి, ట్రయ ల్స్ వేయలేదు. శాస్త్రీయంగా పరీక్షించకుండా నే అందుబాటులోకి తెచ్చారు. ప్రమాదానికి వేగం కారణమైనా డిజైన్ లోపమూ ఉంది.
అమాయక ప్రాణం బలైపోయింది: కేటీఆర్
ఫ్లైఓవర్ ప్రమాద ఘటనలో మహిళ మృతి చెందడంపై మునిసిపల్ మంత్రి కేటీఆర్ తీవ్ర వేదన వ్యక్తం చేశారు. ఘటనలో కారు 100 కేఎంపీహెచ్‌కు మించిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదానికి కారణమైందని ట్వీట్ చేశారు. ‘ఏదేమైనా ఒక అమాయక ప్రాణం బలైపోవడం విషాదకరం. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా, డిజైన్ లోటుపాట్లుంటే పరిశీలించి సరిచేస్తాం. ఫ్లైఓవర్‌ను మూసివేసి జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ, సైబరాబాద్ సీపీ స్పీడ్ కంట్రోల్, సేఫ్టీ చర్యలు తీసుకోవాలి. స్వతంత్ర నిపుణుల కమిటీ సూచనల మేరకు సేఫ్టీ చర్య లు తీసుకోవాలి’ అని ఆ ట్వీట్‌లో సూచించారు.
ఇదంత డీప్ కర్వ్ కూడా కాదు
ఫ్లైఓవర్‌పై తొలి ప్రమాద ఘటన నేపథ్యంలో కర్వ్‌కు ముందు రెండుచోట్ల వేగ నియంత్రణకు రంబుల్ స్ట్రిప్‌లు ఏర్పాటు చేశాం. డిజైన్ లోపం లేదు. మరో ఆరేడు ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్ వేయడమే కాక, మరింత జాగ్రత్త చర్యల్లో భాగంగా కర్వ్ ప్రాంతం మేర సాధారణ క్రాష్ బారియర్స్‌లో అదనంగా రోలర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా ఏదైనా వాహనం ఢీకొంటే.. స్లిప్ అయి వెనక్కి మళ్లుతుంది. నిపుణుల సూచన మేరకు ఎన్ని జాగ్రత్తలు అవసరమో అన్నీ తీసుకుంటాం. గ్రేటర్‌లోని మిగతా ఫ్లైఓవర్లతో పోలిస్తే ఈ ఫ్లైఓవర్‌ది డీప్ కర్వ్ కూడా కాదు. నల్లగొండ క్రాస్‌రోడ్ ఫ్లైఓవర్ రేడియస్ 40 మీటర్లు, పంజగుట్టది 60– 65 మీ. కాగా, బయోడైవర్సిటీది 80–120 మీటర్లు.
– శ్రీధర్, జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్
స్వీయ క్రమశిక్షణ పాటించండి..
ఫ్లైఓవర్ ప్రమాదం నేపథ్యంలో వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలతో పాటు స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు.
పాదచారులు ఫ్లైఓవర్ పైకి వెళ్లద్దు. సెల్ఫీల కోసం ఎవరూ ఫ్లైఓవర్‌పై నిలబడవద్దు.
గరిష్ట వేగం గంటకు 40 కి.మీ. మించరాదు. ఇందుకు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి.
రాయదుర్గం వైపు నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే వారి కోసం ఒకే మార్గంలో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌పైకి రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారు ఎక్కొద్దు.
మలుపుల వద్ద ఓవర్‌టేక్ చేయకండి. లేన్ డిసిప్లిన్ పాటించండి. ఫ్లైఓవర్‌పై సీసీ కెమెరాలున్నాయి. 40 కి.మీ. మించి వేగంతో వెళ్తే కేసులు నమోదవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment