రుతుపవనాలు సంవత్సరానికి ఒకసారి కొత్తవానను తెస్తాయి. కాని తెర మీద మూడు నెలలకొకసారి కొత్త సౌందర్యపు వాన కురుస్తుంది. హీరోయిన్లు చమక్కుమని మెరుస్తారు. ఎవరీ అమ్మాయి అనిపిస్తారు. భలే ఉందే అని మెప్పు పొందుతారు. హీరోల తెర ఆయుష్షు పెద్దది. హీరోయిన్లది చిన్నది. అందుకే హీరోల బైక్ సీటు వెంట వెంటనే ఖాళీ అయ్యి కొత్త హీరోయిన్లకు చోటు ఇస్తుంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో మెరుస్తున్న కొత్త తారల పరిచయం ఇది.
నిర్మాతలకు ఐశ్వర్య
ప్రస్తుతం తమిళంలో అరడజను సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు కథానాయిక ఐశ్వర్యా రాజేష్. ఐశ్వర్య మంచి నటి అని కోలీవుడ్ ఆల్రెడీ సర్టిఫికెట్ ఇచ్చేసింది. సేమ్ సర్టిఫికేట్ కోసం తెలుగు సీమకు అప్లికేషన్ పెట్టుకుని వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు ఐశ్వర్యా రాజేష్. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణమూర్తి: క్రికెటర్’ అనే సినిమాలో నటించారు ఐశ్వర్య. తమిళంలో ఐశ్వర్యానే ప్రధాన పాత్రలో నటించిన ‘కణా’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాను జూలై తొలివారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. అన్నట్లు ఈ సినిమా కంటే ముందే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక హీరోయిన్‌గా ఎంపికయ్యారు ఐశ్వర్య. ‘మిస్ మ్యాచ్’ అనే మరో తెలుగు సినిమాలోనూ నటిస్తున్నారు. ఇలా తెలుగులో కూడా ఆమె బిజీ అయిపోయారు. అన్నట్లు.. తమిళంలో ‘కాక్క ముటై్ట’, ‘కణా’ తర్వాత ఐశ్వర్యకు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్‌కి అవకాశం వస్తోంది. ఈవిడతో సినిమా తీస్తే నిర్మాతలకు ఐశ్వర్యమే అనే పేరు తెచ్చుకోగలిగారు.
మరో మలయా కుట్టి
రజనీకాంత్ ‘పేట’లో త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాష్ కాకుండా మాళవికా మోహనన్ కూడా నటించారు. అయితే పెద్ద స్టార్లు ఉండటం, పైగా తల్లి పాత్రలో నటించడంతో మాళవిక పేరు అంతగా చర్చకు రాలేదు. 2013లో ‘పట్టమ్ పోలే’ అనే మలయాళ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ తార ఆ తర్వాత మలయాళం, కన్నడ సినిమాలు కూడా చేశారు. ‘బియాండ్ ది క్లౌడ్స్’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌ను కూడా పలకరించిన మాళవిక ఇప్పుడు ‘హీరో’తో స్ట్రయిట్‌గా టాలీవుడ్ గడప తొక్కబోతున్నారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో. బైక్ రేస్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అన్నట్లు చెప్పడం మరిచితిమి... ‘లస్ట్‌స్టోరీస్’ (2018), ‘అంధా ధున్’(2018), ‘మహర్షి’ (2019) సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేసిన కేయు. మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్. మలయాళ కుట్టీలు నిత్యామీనన్, నయనతార వంటివారు పేరు తెచ్చుకున్నట్లుగానే ఈ మలయాళీ కుట్టీ కూడా ఇక్కడ బోలెడంత పేరు తెచ్చుకుంటారనే అంచనాలు ఉన్నాయి.
ముంబై ఫ్లయిట్ వచ్చింది... హీరోయిన్‌ను తెచ్చింది
తెలుగు వెండితెరపై బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది మెరిశారు. కొందరైతే సౌత్‌లోనే సెటిలైపోయారు. అలా ఈ ఏడాది కూడా కొందరు బాలీవుడ్ భామలు తెలుగు ఇండస్ట్రీలో కథానాయికలుగా తమ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ శ్రద్ధాకపూర్. ఈమె ‘సాహో’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.
ఆలియా భట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో టాలీవుడ్‌ను పలకరించబోతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్నారు. మరో హిందీ తార జరీనా ఖాన్ కూడా తెలుగు ఆడియన్స్‌కు తనను తాను పరిచయం చేసుకోబోతున్నారు. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జరీన్ ఖాన్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెహరీన్ మెయిన్ హీరోయిన్. అలాగే ‘ఎర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘హిప్పి’ సినిమా దిగంగనా సూర్యవన్షీకు హీరోయిన్‌గా టాలీవుడ్ తలుపులు తెరుచుకున్నాయి.
శాండిల్ పరిమళం
రక్షిత, సంజన, అనుష్కా, ప్రణీత తాజాగా రష్మికా మండన్నా... ఈ కన్నడ భామలు అందరూ టాలీవుడ్ తెరపై సత్తా చాటారు. ఈ లిస్ట్‌లో తన పేరును కూడా రిజిష్టర్ చేయించుకోవాలనుకుంటున్నారు మరో శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇందులో హీరో. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2009లో ‘సరిగమ’ అనే కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన కృతీ శెట్టి 2017లో ‘సెవిలి’ అనే తమిళ సినిమాలో కనిపించారు. అలాగే నాని హీరోగా కె. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ ద్వారా మరో కన్నడ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయం కానున్నారు. ఇంతకుముందు ‘ఓంధ కథ హెల్లా’ అనే హారర్ బ్యాక్‌డ్రాప్ రూపొందిన కన్నడ సినిమాలో నటించారామె.
స్మాష్ గాళ్
అభిప్రాయాలను పంచుకునే వేదికైన సోషల్ మీడియా ప్రతిభ ఉన్నవారికి అవకాశాల వారధిగా కూడా మారింది. ఇలా కన్ను కొట్టి ఓవర్‌నైట్‌లో అలా స్టారై హీరోయిన్‌గా చాన్స్ దక్కించుకున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. అలాగే డబ్ స్మాష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న మృణాళినీ రవి ‘వాల్మీకి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో. తమిళ హిట్ ‘జిగర్తండా’కు ఇది తెలుగు రీమేక్ అని టాక్. డబ్ స్మాష్‌లో హిట్ కొట్టిన మృణాళిని వెండితెరపై కూడా హిట్ కొడతారా? లెటజ్.. వెయిట్ అండ్ సీ.
శివాని... శివాత్మిక...
అంజలి, ఈషా రెబ్బా, ప్రియాంకా జవాల్కర్.. ఇలా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఒకే కుటుంబంలోని ఇద్దరు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా తెలుగు తెరపైకి రాబోతున్నారు. వారు అక్కాచెల్లెళ్లు కూడా. ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. వారే రాజశేఖర్, జీవితల కుమార్తెలు శివానీ, శివాత్మిక అని. తెలుగులో రీమేక్ అవుతున్న హిందీ హిట్ ‘2 స్టేట్స్’ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు శివాని. ‘దొరసాని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను హాయ్ చెబుతున్నారు శివాత్మిక. ఇదే సినిమా ద్వారా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం కానున్నారు. ఈ తెలుగు హీరోయిన్స్ లిస్ట్‌లో ఇంకొందరు తమ పేరును ఆడియన్స్ గుర్తుపెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ ఏడాది రిలీజైన నాగచైతన్య ‘మజిలీ’ సినిమాతో దివ్యాంశా కౌశిక్, ‘చిత్రలహరి’ సినిమాతో నివేథా పేతురాజ్, నాని ‘జెర్సీ’ సినిమాతో శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు తెరకు పరిచయమై నటన పరీక్షలో ఆడియన్స్ చేత మంచి మార్కులు వేయించుకున్న విషయం తెలిసిందే. తెలుగు తెర ఈ ఏడాది ఇంకెంతమంది కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తుందో చూద్దాం.
– ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment