జనవరి 12న జరిగింది ఈ సీన్. నిధి దోషి అనే యువతి పుణె పోలీసులకు ఓ ట్వీట్ పెట్టింది. ‘ధరోనీ పోలీస్ స్టేషన్ నెంబరు ఇవ్వగలరా.. అర్జెంటుగా కావాలి’ అని. వెంటనే పోలీసులు స్పందించారు. ‘అలాగే మేడమ్.. 020–27171190.. ఇదే ఆ నంబర్’’ అని ట్వీట్ చేశారు. తర్వాత చిక్లూ అనే సోగ్గాడు సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు. ‘ఆ యువతి.. నిధీ దోషి నెంబరు నాకు ఇవ్వగలరా?’ అని పుణె సిటీ పోలీసులకు ట్వీట్ పెట్టాడు. పోలీసులు వెంటనే అతడి ‘అభ్యర్థన’కు కూడా స్పందించారు.
‘సర్, ఆ మహిళ నెంబరును తెలుసుకోడానికి మీకు ఆసక్తి ఉన్నట్లే.. మీ నెంబరు తెలుసుకోడానికి మాకు అంతకు మించిన ఆసక్తిగా ఉంది.మీరెవరో గోప్యంగా ఉంచడం కోసం డైరెక్టు మెసేజ్ (డి.ఎం.) ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. దీనిపై మహిళా నెటిజన్‌లు పుణె పోలీసులపై అభినందనల ట్వీట్‌లు కురిపిస్తున్నారు. పుణె పోలీసుల ఆ సమయస్ఫూర్తి రిప్లయ్‌కి కొద్దిగంటల్లోనే పదహారు వేలకు పైగా లైకులు వచ్చాయి. నివేదిత అనే అమ్మాయి అయితే.. ‘ఐయామ్ యువర్ జబ్రా ఫ్యాన్ పుణె పోలీస్’ అని ట్వీట్ చేసింది. జబ్రా అంటే.. వీరాభిమాని.
Comments
Please login to add a commentAdd a comment