
కెనడాలో విరిసిన తెలుగు కమలం
దీపిక పుట్టిందీ, పెరిగిందీ సికింద్రాబాద్‌లో. చదివింది తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయలో. నలభై ఏళ్లు దాటిన దీపిక ఇప్పుడు కెనడాలోని ఒంటారియో రాష్ట్ర ఆరోగ్యమంత్రి.
* దీపిక దామెర్ల... కెనడాలో ఆరోగ్యమంత్రి
* అంతకు ముందు...ఆ దేశంలో మౌలిక వసతుల కల్పనలో సహాయమంత్రి
* అంతకంటే ముందు...మన జంటనగరాల్లో పుట్టిపెరిగిన తెలుగమ్మాయి...
దీపిక పుట్టిందీ, పెరిగిందీ సికింద్రాబాద్‌లో. చదివింది తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయలో. నలభై ఏళ్లు దాటిన దీపిక ఇప్పుడు కెనడాలోని ఒంటారియో రాష్ట్ర ఆరోగ్యమంత్రి.
ఎక్కడి దామెర... ఎక్కడి కెనడా!
ఖమ్మం జిల్లాలోని దామెర గ్రామం నుంచి మూడు వందల యేళ్ల కిందట రాజమండ్రికి వెళ్లిన కుటుంబం వీరిది. భారత స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేసిన నేపథ్యం ఈ కుటుంబానిది. దీపిక తండ్రి వెంకట రమణారావు మిలటరీలో మేజర్. ఉద్యోగవిరమణ తర్వాత ఆయన పుణేలో స్థిరపడ్డారు. దీపిక తల్లి శేషు కథారచయిత్రి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతీయ సమాజంలో వచ్చిన మార్పులు, మహిళ ఎదుర్కొన్న సవాళ్లు, ఎదగడానికి మహిళ పడిన కష్టాల ఇతివృత్తంతో ఆమె అనేక కథలు రాశారు. తల్లి అక్షరాలలో చూపించిన భారతీయ సమాజం, పురోగమన ఆకాంక్ష దీపికకు మార్గదర్శనం చేశాయనే చెప్పాలి.
దీపిక చదువు పూర్తయ్యాక... 1991లో పుణేలోని అల్ఫాలావల్ కంపెనీలో మేనేజింగ్ డెరైక్టర్ దగ్గర అసిస్టెంట్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న సమయం... కెనడాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో వివాహం కావడంతో ఆమె దేశసరిహద్దులు దాటారు. అక్కడి టొరంటో యూనివర్శిటీలో ఎం.బి.ఎ ఫైనాన్స్ చదివారు.
కెనడాలో ఉద్యోగపర్వం
ఎం.బి.ఎ పూర్తయిన తర్వాత దీపిక రాయల్ బ్యాంకులోనూ, నోవా సోషియా బ్యాంకులోనూ పనిచేశారు. ఒకరోజు అనుకోకుండా కెనడా దేశ ప్రధానమంత్రిని కలవడం జరిగింది. ఆ సమావేశమే దీపిక దృష్టిని సామాజికాంశాల మీదకు మళ్లించిందంటారు దీపిక తల్లి శేషు.‘‘ఒంటారియో ప్రావిన్స్‌లో మినిష్టర్ ఆఫ్ ట్రేడ్‌లో ఎకనమిక్ డెవలప్‌మెంట్ విభాగంలో సీనియర్ అడ్వయిజర్‌గా చేరింది. ఆ బాధ్యతల నిర్వహణలో ప్రభుత్వంలో లోటుపాట్లను బాగా ఆకళింపు చేసుకున్నది దీపిక. మా అమ్మాయికి ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువే. ఒకసారి అక్కడి ఓమ్ని టెలివిజన్ చానెల్‌లో రిపోర్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లి సెలెక్ట్ అయింది’’ అన్నారామె.
తండ్రి రమణారావు మాట్లాడుతూ... ‘‘సామాజికాంశాల మీద దీపికకు పెరిగిన ఆసక్తికీ రిపోర్టర్ ఉద్యోగానికి చక్కటి లంకె కుదిరిందనే చెప్పాలి. తన పరిధిలో ఉన్న ప్రాంతాల సమస్యల మీద కథనాలు ప్రసారం చేసేది. అక్కడి ప్రజల అవసరాలను కళ్లకు కట్టేది. వీటితోపాటు తనకు చక్కటి వాక్పటిమ ఉంది’’ అని చెప్పారు. చెదరని చిరునవ్వుతో సాగే దీపిక ప్రసంగశైలి అక్కడి రాజకీయ నాయకులను బాగా ఆకట్టుకుంది. అలా 2011లో లిబరల్‌పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారామె.
‘‘ఆ ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను. పాకిస్తానీయులు కూడా నాకు మద్దతివ్వడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అప్పుడు పార్లమెంటరీ అసిస్టెంట్ మినిస్టర్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా పనిచేశాను. తిరిగి ఈ ఏడాది ఎన్నికల్లో కెనడావాసులు నన్ను పదివేలకు పైగా మెజారిటీతో గెలిపించారు. ఆ ప్రభుత్వం ఈ దఫా దేశ ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించింది. జూన్ 24వ తేదీన బాధ్యతలు తీసుకున్నాను’’ అన్నారు దీపిక.
కెనడాలోని భారతీయులు అన్ని పండుగలనూ కలిసి చేసుకుంటారు. దీపిక తెలుగు, గుజరాతీ, పంజాబీ, తమిళులతోపాటు శ్రీలంక, పాకిస్తాన్ వారితో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు. తెలుగు, మరాఠీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలను దీపిక అనర్గళంగా మాట్లాడుతారు. భాష, మత, ప్రాంత భేదాల్లేకుండా అందరితో చక్కగా కలిసిపోతారు. ఈ లక్షణాలన్నీ ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు పాకేలా చేశాయి.
- చక్రవర్తి, పింప్రి, న్యూస్‌లైన్, పుణే
వృద్ధుల ఆరోగ్యం కోసం...
మౌలిక వసతుల విభాగంలో పాఠశాల భవనాలను ఆధునికీకరించడం, కొత్త భవనాల ఏర్పాటు, లోకల్ ట్రైన్‌ల పెంపుదల వంటి అంశాల మీద దృష్టి పెట్టాను. ఇప్పుడు వయోవృద్ధుల ఆరోగ్యం - సంరక్షణ, యువతకు ఉద్యోగం- ఉపాధి, అత్యవసర పరిస్థితి అవసరాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు వంటి వాటి మీద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను.
- దీపిక దామెర్ల, ఆరోగ్యశాఖ మంత్రి, ఒంటారియో రాష్ట్రం, కెనడా