నుమాయిష్.. అదిరింది!
కారు ప్రయాణిస్తూంటుంది.... స్టీరింగ్ ముందు డ్రైవర్ మాత్రం ఉండడు! ఎక్కడికెళ్లాలో దానికి తెలుసు. ఎలా వెళ్లాలోజీపీఎస్ చెబుతుంది..
ట్రాఫిక్ పరిస్థితి ఏమిటో? ఏ రూట్‌లో వెళితే సమయం ఆదా అవుతుందో అదే లెక్కిస్తుంది!! వెనుక, ముందు, రెండు పక్కలా వస్తున్న వాహనాలపై ఎప్పుడూ ఓ కన్ను ఉండనే ఉంటుంది!
అప్పుడే తెల్లవారుతోంది... మాంచి నిద్ర నుంచి మీరు మేల్కొన్నారు.. అంతే...! బెడ్‌రూమ్‌లో మొదలుకొని బాత్‌రూమ్ వరకూ అన్ని చోట్ల ఒకటే హడావుడి! నిశ్శబ్దంగానే మీ పనులన్నీ జరిగిపోతూంటాయి. కళ్లు తెరవడాన్ని గమనించిన సెన్సార్ వైఫై సంకేతాలు పంపుతుంది. ఆ వెంటనే బాత్‌రూమ్‌లో బ్రష్‌పై పేస్ట్ పడిపోతుంది. ఆ తరువాత వేడినీళ్ల కోసం గీజర్ ఆన్ అవుతుంది. ఇంతలోనే కిచన్‌లోని కాఫీ మేకర్ మీకిష్టమైన రుచితో కాఫీ మరిగిస్తుంది. రోటీమాటిక్‌లో మీ బ్రేక్‌ఫాస్ట్‌కు కావాల్సిన ఫుల్కాలు సిద్ధమవుతాయి.
ఈ రెండు సందర్భాలను చదివినప్పుడు మీకు ఏమనినిస్తుంది? ఆ.... ఇదంత ఏదో హాలీవుడ్ సినిమా తాలూకూ వివరణ కాబోలు అని.. అవునా? కానే కాదు. కొంచెం డబ్బు... ఇంకొంచెం అభిరుచి ఉండాలేగానీ ఒకట్రెండేళ్లలో ఇవన్నీ మీ ఇంట్లోనూ సాధ్యమే. ఇటీవలే అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ముగిసిన ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ఈ ఉత్పత్తులన్నింటినీ ప్రదర్శించారు కూడా. స్మార్ట్‌హోం టెక్నాలజీ, డ్రైవర్లులేని కార్లు మాత్రమే కాదు... ఈ ప్రదర్శనలో స్మార్ట్‌వాచీలు, వైఫైతో పనిచేసే బల్బులు, టూత్‌బ్రష్‌లు... సూపర్‌ఫాస్ట్ మైక్రోప్రాసెసర్లు, కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు పరిచయమయ్యాయి. వినియోగదారులను ఆకట్టుకున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్ని కొత్త, వినూత్న గాడ్జెట్లు, వాటి వివరాలు...
మామూలు వాచీలా అనిపిస్తోందా? ఊహూ కానేకాదు... టైం చూపించడంతోపాటు మీ నిద్రతీరును గమనిస్తుంది ఇది. అంతేకాదు... మీరు పరుగెత్తినా, నడిచినా... ఎంతదూరం, ఎన్ని అడుగులు వేసింది? తద్వారా ఎన్ని కాలరీలు ఖర్చయింది లెక్కపెడుతూ ఉంటుంది ఈ స్మార్ట్‌వాచ్. ఎనిమిది నెలలపాటు పనిచేసే బ్యాటరీ ఉన్న ఈ వాచీ ఖరీదు రూ. పదివేలు.
ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ముద్రించే వోక్సెల్..
త్రీడీ ప్రింటింగ్ రంగంలో మరో ముందడుగు ఈ వోక్సెల్ ప్రింటర్. దీంతో కేవలం త్రీడీవస్తువులను ప్రింట్ చేయడం మాత్రమే కాదు.. వాటిల్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను కూడా ప్రింట్ చేయవచ్చు. ఇందుకు అనుగుణంగా వోక్సెల్ కంపెనీ ప్రత్యేకమైన పదార్థాలను అభివృద్ధి చేసింది. చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ఓ డ్రోన్ తయారు చేయాలనుకున్నారు. తగిన సాఫ్ట్‌వేర్, త్రీడీ ప్రింటర్, ప్లాస్టిక్ లాంటి పదార్థముంటే ఇది సాధ్యమే. కాకపోతే దాన్ని పెకైగరగలిగేలా చేయగలిగే ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను వేరుగా అమర్చుకోవాల్సి ఉంటుంది. వోక్సెల్‌తో ఈ ఇబ్బంది లేదు. సర్క్యూట్లు, వస్తువు రెండింటిని పొరలు పొరలుగా తయారు చేస్తుంది ఇది. భవిష్యత్తులో ఈ ప్రింటర్‌తో తొడుక్కునే గాడ్జెట్లను నేరుగా ప్రింట్ చేయవచ్చునని, అలాగే వినికిడి శక్తి కోసం వాడే హియరింగ్ ఎయిడ్స్ వంటి వైద్యపరికరాలను కూడా తయారు చేయవచ్చునని అంచనా.
రాడార్లు... లిడార్లతో డ్రైవర్ లేని కారు...
వాహనాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థల తయారీకి డైల్ఫై పెట్టింది పేరు. ఈ సంస్థ ఈ ఏడాది సీఈఎస్‌లో తన అత్యాధునిక డ్రైవర్ లెస్ కార్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఆడి కారులో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలో అత్యంత కచ్చితమైన జీపీఎస్ వ్యవస్థతోపాటు కారు ముందు, వెనుక దాదాపు 20 సెన్సర్లు ఉంటాయి. చుట్టూ చూసేందుకు వీలుగా 360 డిగ్రీ లిడార్లు, రాడార్లతో కూడిన ఈ సెన్సర్లు ట్రాఫిక్‌ను, ఇతర వాహనాలు ఢీకొట్టే అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాయి. ఈ లెక్కలన్నీ వేసేందుకు ఎన్‌విడియా టెగ్రా కే1 ప్రాసెసర్, ఒట్టోమాటికా ఆటోమేటెడ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగపడతాయి. ట్రాఫిక్ రూల్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూనే... సురక్షితంగా గమ్యానికి చేర్చగల ఈ రకమైన కారు ఉంటే భలే ఉంటుంది కదూ! ఆడితోపాటు మెర్సిడెస్ బెంజ్, వోక్స్‌వ్యాగన్ కంపెనీలు కూడా సీఈఎస్ 2015లో డ్రైవర్ల అవసరం లేని కార్లను ప్రదర్శించాయి.
చేతి కడియం మాదిరిగా ఉండే ఈ హైటెక్ గాడ్జెట్ పేరు నైమీ. రకరకాల యూజర్‌నేమ్స్, పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన ఇబ్బందిని తప్పిస్తుంది ఇది. మీ గుండె కొట్టుకునే తీరు మీకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుందన్న సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. చేతికి తగిలించుకుని మీ స్మార్ట్‌ఫోన్... ఆఫీసులోని కంప్యూటర్, డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు... ఇలా పాస్‌వర్డ్ అవసరమైన ప్రతిచోటా దీన్ని వాడుకోవచ్చు.
కంప్యూటర్లను నడిపించే మైక్రోప్రాసెసర్ శక్తి ఏటికేడాదీ పెరిగిపోతూండగా, సైజు మాత్రం అంతేస్థాయిలో తగ్గిపోతోంది అనేందుకు తాజా తార్కాణం ఇది. ఇంటెల్ సంస్థ తయారు చేసిన ఈ లేటెస్ట్ మైక్రోప్రాసెసర్ క్యూరీ కేవలం షర్ట్ బటన్‌సైజు మాత్రమే ఉంటుంది. వేరబుల్ కంప్యూటర్ల కోసం... ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల కోసం దీన్ని ఉపయోగించే అవకాశముంది.
స్కేటింగ్ బోర్డుపై రయ్యి రయ్యి...
స్కేటింగ్ బోర్డు మాదిరిగా ఉండే ఈ గాడ్జెట్ వ్యక్తిగత రవాణా కోసం ఉద్దేశించింది. దీనిపై నిలుచుని కొంచెం ఒత్తితే చాలు.. ముందుకు దూసుకెళుతుంది. కాళ్లను అటు ఇటూ వంచడం ద్వారా దిశ మార్చుకోవచ్చు. గరిష్టంగా గంటకు దాదాపు పది కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఐ ఓ హాక్ అనే కంపెనీ ఇదే పేరుతో విడుదల చేసిన ఈ హైటెక్ గాడ్జెట్‌లో బ్యాటరీలతోపాటు అనేక హైటెక్ సెన్సర్లను ఏర్పాటు చేశారు. తనను తాను బ్యాలెన్స్ చేసుకోగల మోటర్ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ మాదిరిగా ఉండే ఐఓ హాక్‌లో హ్యాండిల్ బార్ మాత్రం ఉండదు.
బ్లూటూత్‌తో మొక్కలకు నీళ్లు...
పండక్కి ఊరెళితే... ఇంట్లో మొక్కలకు నీళ్లు ఎవరు పెడతారబ్బా? అన్న ఆలోచన మనందరికీ వచ్చే ఉంటుంది. అలాంటివారికి ఈ ప్యారెట్ పాట్ చక్కటి పరిష్కారం. ధరవరలను కాసేపు పక్కనబెడితే ఈ హైటెక్ కుండీతో ఉన్న లాభమేమిటంటే.. మీరు ఎక్కడున్నాసరే... ఎప్పటికప్పుడు మొక్కలకు నీళ్లు పెట్టుకోవచ్చు. దాదాపు అడుగు పొడవుండే ఈ కుండీలో ఏర్పాటు చేసిన సెన్సర్లు మట్టిలోని తేమను, ఉష్ణోగ్రతలను గమనిస్తూ నీళ్లు ఎప్పుడు పెట్టాలో గుర్తిస్తాయి. అంతేకాదు... స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా మీకూ తెలియజేస్తుంది. నీటిపైపు అమర్చుకుంటే దూరం నుంచే నీళ్లు పట్టేయవచ్చు. ఈ ఏడాది చివరికల్లా ఈ కుండీ మార్కెట్‌లోకి వచ్చేస్తుందని అంచనా.
కడుపు నిండినా, మాడినా... అందుకు తగ్గట్టుగా సైజు మార్చుకునే హైటెక్ బెల్ట్ ఇది. సెన్సర్లు, వైఫై ద్వారా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌కు కనెక్ట్ అవడం ద్వారా పనిచేస్తుందిది.
సోనీ స్మార్ట్‌హోం టెక్నాలజీ...
ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ మన అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మన పనులు చేసి పెడితే అద్భుతంగా ఉంటుందని మనకు చాలాకాలంగా తెలుసు. కానీ ఇందుకు తగిన టెక్నాలజీ ఇప్పటివరకూ అందుబాటులోకి రాలేదు. ఈ కొరత కాస్తా ఈ ఏడాది సోనీ అందుబాటులోకి తెచ్చిన లైఫ్ స్పేస్ యూఎక్స్ స్మార్ట్‌హోం టెక్నాలజీతో తీరిపోయింది. ఇది గత ఏడాది సీఈఎస్‌లోనే ప్రదర్శించినప్పటికీ ఈసారి మరింత అప్‌గ్రేడ్ చేశారు. గదుల్లోని గోడలనే టీవీ, మూవీ స్క్రీన్లుగా మార్చుకోగలగడం, వైఫై సంకేతాలకు స్పందించే బల్బులు ఈ వ్యవస్థలోని ప్రత్యేకతలు. ఇంట్లో ఉండే అన్నిరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ పనులు చక్కబెట్టడం విశేషం.
డెల్ వెన్యూ 87000
ప్రపంచంలో అత్యంత పలుచటి ట్యాబ్లెట్ తమదేనని డెల్ ఈ ప్రదర్శనలో ప్రకటించుకుంది. డెల్ వెన్యూ 8 7000 పేరుతో విడుదలైన ఈ ట్యాబ్లెట్ కేవలం ఆరు మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. ఇదొక్కటే దీని ప్రత్యేకతనుకుంటే తప్పులో కాలేసినట్లే. త్రీడీ ప్రింటర్ల హవా ఎక్కువవుతున్న నేపథ్యంలో దీని ప్రధాన కెమెరాకు ప్రత్యేక హంగులు అమర్చారు. ఈ కెమెరాతో మీరు ఏ వస్తువు ఫొటో తీసినా ఒడ్డూ, పొడవుతోపాటు లోతు అదేనండీ త్రీడీ సమాచారాన్ని కూడా సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని త్రీడీ ప్రింటర్‌కు అందిస్తే... క్షణాల్లో మీరు తీసిన వస్తువు మీ కళ్లముందే తయారవుతుంది.
కన్నేసి ఉంటాయి...
ఇంటికి తాళమేసుకుని ఊరెళితే దొంగలు పడతారేమోనన్న బెంగ అందరికీ ఉంటుంది. సెంగ్‌లెడ్ బల్బులు ఉంటే మాత్రం మీరు నిశ్చింతగా ఉండవచ్చు. బల్బులకు, సెక్యూరిటీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? సెంగ్‌లెడ్ బల్బులు వెలుగులు పంచడంతోపాటు వైఫై టెక్నాలజీ సాయంతో రకరకాల పనులు చేస్తాయి. బల్బులోపలే కెమెరా, మైక్రోఫోన్, స్పీకర్లు వంటివి ఏర్పాటు చేసిన కారణంగా ఇవి మ్యూజిక్ సిస్టమ్‌ను ఆన్ చేయడంతోపాటు, కెమెరాలోని ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ద్వారా అగంతకులు ఎవరైనా చొరబడితే వెంటనే మీకు, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తుంది. షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న సెంగ్‌లెడ్ ఈ ఏడాది చివరికల్లా ఈ బల్బులను మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది.
సామ్‌సంగ్ అందుబాటులోకి తెచ్చిన సూపర్ అల్ట్రాహైడెన్సిటీ (ఎస్‌యూహెచ్‌డీ) టెలివిజన్ ఇది. నిన్నమొన్నటివరకూ 4కే టెలివిజన్ ఒక అబ్బురమైతే దానికి రెండింతలు ఎక్కువ పిక్సెల్స్, స్పష్టత ఉండటం దీని ప్రత్యేకత. సామ్‌సంగ్‌తోపాటు షార్ప్, ఎల్‌జీలు కూడా ఇలాంటి హై ఎండ్‌టీవీలు, కొంచెం వంపు తిరిగి ఉండే భారీ సైజు టెలివిజన్లను ప్రదర్శించాయి.