పోషకాహార నిపుణురాలి ‘ఇంటిపంట’ల అనుభూతులు
హుద్‌హుద్ తుపాను తూర్పు తీరంలో సృష్టించిన విధ్వంసం ఏపాటితో తెలియనిది కాదు. విశాఖపట్నంలో.. మేడ మీద సేంద్రియ ఆకుకూరలు పెరుగుతున్న కుండీలు తుపాను గాలికి కొట్టుకుపోయాయి. అయినా, ఆమె నిరుత్సాహపడలేదు. మరింత పట్టుదలతో కిచెన్ గార్డెన్‌ను పునర్నిర్మించారు. పూలు, ఆకుకూరలతోపాటు ఇప్పుడు కూరగాయలు కూడా రెట్టించిన ఉత్సాహంతో సాగు చేస్తున్నారు. ఆమె వృత్తిరీత్యా పోషకాహార నిపుణురాలు, ప్రవృత్తి రీత్యా సేంద్రియ ఇంటిపంటల సాగుదారు.. ఆమె పేరు పిన్నమరాజు ఉషా గజపతిరాజు (99492 11022). జీవామృతంతో నిశ్చింతగా‘ఇంటిపంట’లు పండిస్తున్నానంటున్న ఆమె అనుభూతులు .. ఆమె మాటల్లోనే..
విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని సొంత అపార్ట్‌మెంట్(గ్రూప్‌హౌస్)లో నివాసం ఉంటున్నాం. పోషకాహార నిపుణురాలిగా సేంద్రియ ఆకుకూరల ప్రాధాన్యత గుర్తెరిగి మేడపైన కుండీల్లో పూల మొక్కలతో పాటు ఆకుకూరలు పండిస్తున్నా. హుద్‌హుద్ తుపాను గాలికి కుండీలన్నీ కొట్టుకుపోయాయి. ఆకుకూరలు, కూరగాయలను తాజాగా తింటేనే పోషకాలు పుష్కలంగా పొందగలం. బజారులో సేంద్రియ ఆకుకూరలు ఎప్పుడో గానీ దొరకవు. దొరికినా.. వాటిని నిజంగా సేంద్రియంగా పండించారో లేదో తెలీదు.
అందుకే కొన్ని ఏళ్ల నుంచి పూలతోపాటు అనేక ఆకుకూరలను కుండీల్లో మక్కువతో పండిస్తున్నా. తుపాను తర్వాత 100-120 వరకు పనికిరాని థర్మకోల్ బాక్సులు, ప్లాస్టిక్ డబ్బాలు, సంచుల్లో ఇంటి పంటలు పెంచుతున్నా. ప్రస్తుతం మెంతికూర సహా ఐదారు రకాల ఆకుకూరలతో పాటు టమాటా, ముల్లంగి, బీన్స్, ఆనప, దోస, బీర, కాకర, మిర్చి, బెండ, ఉల్లికాడలను పెంచుతున్నా. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చి ఇంటిపంటలకు వాడుతున్నా.
ఇంటిపంటల వల్ల కలిగే ప్రయోజనాలు అపరిమితం. ఇవి మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు మానసికోల్లాసంతోపాటు శారీరక వ్యాయామానికి కూడా తోడ్పడతాయి. సామాజిక మాధ్యమంలో ఇంటిపంట గ్రూప్, రైతుమిత్ర గ్రూప్, బెంగళూరు టై గార్డెన్ గ్రూపులు పరిచయమయ్యాక ఎంతో నేర్చుకున్నాను. జీవామృతం పరిచయం అయిన తర్వాత కిచెన్ గార్డెన్ చాలా బాగుంది. చీడపీడలను నియంత్రించడం సులువుగా మారింది. అంతకుముందు రసాయనాలు పిచికారీ చేసినా ఫలితం ఉండేది కాదు.
జీవామృతాన్ని నెలకు రెండుసార్లు స్వయంగా తయారు చేసుకుంటున్నా. దీన్ని 1:10 పాళ్లలో నీటిలో కలిపి రోజు మార్చి రోజు మొక్కలకు పోస్తున్నా.. చల్లుతున్నా. మా అమ్మాయి పైచదువులకు అమెరికా వెళ్లిన తర్వాత ఇంటిపంటలకు మరింత దగ్గరయ్యా. నా పేషెంట్లక్కూడా ఇంటిపంటల సాగు వ్యాపకాన్ని పరిచయం చేస్తున్నా. ఇద్దరు, ముగ్గురు ఇప్పటికే మొదలుపెట్టారు కూడా.. మా కుటుంబానికి కావాల్సిన ఆకుకూరలు 100%, కూరగాయలు 50% టై గార్డెన్ ద్వారా సమకూర్చుకోవటం నాకు చాలా సంతృప్తిగా ఉంది.
జీవామృతంతో నిశ్చింత!
Published Wed, Apr 15 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM