వినేవాళ్లు ఉండాలేగానీ... | ome rumors also a popular pastime ... | Sakshi
Sakshi News home page

వినేవాళ్లు ఉండాలేగానీ...

Published Sat, Aug 29 2015 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

వినేవాళ్లు ఉండాలేగానీ...

వినేవాళ్లు ఉండాలేగానీ...

సోల్ / చాడీలు
 
వదంతులను వ్యాప్తిలోకి తేవడంలానే చాడీలు చెప్పడం కూడా కొందరికి ఒక కాలక్షేపం. స్వప్రయోజనాల సాధన కోసం కొందరు చాడీలు చెబుతారు. ఇద్దరి మధ్య తగవు పెట్టడానికి ఇంకొందరు చాడీలు చెబుతారు. ఎదుటివారి అభివృద్ధినిఅడ్డుకోవడానికి మరికొందరు చాడీలు చెబుతారు. చెప్పేవారు సరే, ఏమైనా చెబుతారు, ఎన్నయినా చెబుతారు.

‘కుఛ్‌తో లోగ్ కహేంగే... లోగోంకా కామ్ హై కెహనా...’ వినేవాళ్లు లేకుంటే ఎంతటి చాడీకోర్లయినా ఏం చెప్పగలరు చెప్పండి? వినేవాళ్లకు వివేకం, ఇంగితజ్ఞానం లోపించినప్పుడే చాడీలు చెప్పేవాళ్లు చెలరేగిపోతారు. లోకంలో చాడీకోర్లు వర్ధిల్లుతున్నారంటే అది వాళ్ల తప్పు కాదు, వినేవాళ్లకు కామన్‌సెన్స్ లేకపోవడమే అందుకు అసలు కారణం.
 
అసూయే మూలం

సాటివారి పురోగతిపై అసూయ మితిమీరినప్పుడు, జీవితంలో వారిని అధిగమించే శక్తిసామర్థ్యాలు లోపించినప్పుడు వారిని ఇతరుల ద్వారానైనా సాధించాలనే ఉద్దేశంతో చాలామంది చాడీలు చెబుతారు. ఏమీ చేతగాని అసూయాపరులే చాడీలు చెప్పడాన్ని ఒక లలితకళలా సాధన చేస్తారు. మొహమాటానికో, ముఖస్తుతికో అలవాటుపడిన కొందరు అలాంటి చాడీలను వీనులవిందుగా వింటారు. నిజానికి చాడీల వల్ల చెప్పేవాళ్లకు, వినేవాళ్లకు పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. అదొక తాత్కాలిక మానసికానందం మాత్రమే. మానవులకు గల నానా అవలక్షణాల్లో చాడీలు చెప్పడం కూడా ఒకటని ప్రపంచంలోని అన్ని మతాలూ పరిగణిస్తున్నాయి. ఇతరులపై చాడీలు చెప్పడం అత్యంత నీచమైన అవలక్షణమని, ఇలాంటి అవలక్షణాన్ని విడనాడాలని బోధిస్తున్నాయి. అయితే, ఇలాంటి హితబోధలను పట్టించుకునేవారు ఎందరు? మతాలు మతాలే, మానవ స్వభావాలు మానవ స్వభావాలే!
 
పురాణాల్లో చాడీకోర్లు
చాడీలు చెప్పడమేమీ ఆధునిక కళ కాదు. పురాణకాలం నుంచే ఈ కళలో ఆరితేరిన వారు కొందరున్నారు. మన పురాణాల్లోని చాడీకోర్లలో ముఖ్యంగా నారదుడిని, మంథరను, శకునిని గుర్తు చేసుకోవచ్చు. బ్రహ్మమానస పుత్రుడైన నారద మహాముని నారాయణ నామస్మరణ చేసుకుంటూ, మహతిని మీటుకుంటూ త్రిలోక సంచారం చేసేవాడని ప్రతీతి. ముల్లోకాలూ తిరిగే నారద మహామునికి కలహభోజనుడనే పేరు కూడా ఉంది. ఎవరికైనా కయ్యం పెట్టనిదే ఆయనగారికి కడుపు నిండదు. బ్రహ్మదేవుడి ద్వారానో, బోళాశంకరుడి ద్వారానో వరాలు పొంది, బలగర్వంతో విర్రవీగే రాక్షసరాజుల వద్దకు వెళ్లి దేవతల మీద చాడీలు చెప్పి రెచ్చగొట్టేవాడు. బుద్ధితక్కువ రాక్షసరాజులు ఆ మాటలకు అనవసరంగా రెచ్చిపోయేవారు. దేవతలతో కయ్యానికి కాలు దువ్వేవారు. చివరకు ఏ మహావిష్ణువో, ఆదిపరాశక్తో వచ్చి, వాళ్లను సంహరించాక అక్కడికా కథ సుఖాంతమయ్యేది. విష్ణుభక్తుడైన నారద మహాముని ఏం చేసినా లోకకల్యాణానికేనని, ఆయన చెప్పే చాడీలు కూడా అందుకేనని పురాణాల సారాంశం.
 
 మంథర చాడీలు
 ఇక త్రేతాయుగంలో మంథర పేరుమోసిన చాడీకోరు. ఆమె చాడీల దెబ్బకు ఏకంగా రామాయణమే మలుపు తిరిగింది. ‘దశరథ మహారాజు రాముడికి పట్టం కట్టాలనుకుంటున్నాడు. అదే జరిగితే నీ కొడుకు భరతుడి గతేం కాను..?’ అంటూ కైకకు నూరిపోసి, దశరథుడు ఏనాడో ఆమెకు ఇచ్చిన వరాలను గుర్తుచేసి రెచ్చగొట్టింది. కైక ఆ వరాల కోసం దశరథుడిని సాధించింది. ఫలితంగా రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు. పుత్ర వియోగంతో దశరథుడు పరలోకానికి పయనించాడు.

 చాడీకోరు శకుని
 మహాభారతంలో శకుని ఆరితేరిన చాడీకోరు. కౌరవుల పంచన చేరిన శకుని దుష్టచతుష్టయంలో పెద్దతలకాయ. పాండవులపై చాడీలు చెబుతూ ఎదిగీ ఎదగని వయసు నుంచే మేనల్లుడైన దుర్యోధనుడి బుర్ర పాడు చేసేవాడు. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచే అలవిమాలిన అహంకారి. అహంకారికి కన్నూ మిన్నూ కానదు. అలాంటి స్థితిలో ఉన్నవాడికి విదుర, భీష్మాదులు చెప్పే హితవచనాల కంటే, శకుని మామ చెప్పే చాడీలే పసందుగా ఉండేవి. చాడీకోరు శకునిని ఆంతరంగిక బృందంలో పెట్టుకున్న దుర్యోధనుడు ఎలా దుంపనాశనమయ్యాడో మనందరికీ తెలిసిందే.
 
 ఇవీ అనర్థాలు
 చాడీలు చెప్పేవాళ్లందరూ నారద మహామునులు కాదు. అందువల్ల వాళ్లు చెప్పే చాడీల కారణంగా లోకకల్యాణం మాట దేవుడెరుగు గానీ, నానా అనర్థాలు జరగడం మాత్రం తథ్యం. చాడీల వలలో పడితే ప్రాణస్నేహితులు కూడా బద్ధశత్రువులుగా మారిపోతారు. భార్యాభర్తల్లో ఎవరు చాడీలు నమ్మినా ఇద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం ఖాయం.

చాడీల మాయలో చిక్కుకుంటే, తల్లిదండ్రులకు పిల్లలకు నడుమ కూడా కీచులాటలు వస్తాయి. చాడీకోర్ల మాటలను బాసులు నమ్మితే, ఆఫీసుల్లోని అమాయక జీవులు ఉద్యోగాలను పోగొట్టుకుని వీధిన పడతారు. చాడీలు చెప్పేవాళ్లు చెబుతూనే ఉంటారు. వాళ్ల స్వభావాన్ని మార్చడం దుస్సాధ్యం. అయితే, వినేవాళ్లు కాస్త ఇంగితంతో వివేకాన్ని ప్రదర్శించి, ‘వినదగునెవ్వరు చెప్పిన...’ అనే సుమతీ శతకకారుని హితోక్తిని మననం చేసుకుని, సంయమనంతో వ్యవహరిస్తే చాడీల వల్ల తలెత్తే అనర్థాలను నివారించుకోవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement