
ఓనమ్మహోత్సవమ్
సందర్భం- 7న ఓనమ్
ఓనమ్ సమయంలో మహాబలి ఆత్మ కేరళ రాష్ట్రమంతా సంచరిస్తుందని ఒక విశ్వాసం. ఆయనను సాదరంగా ఆహ్వానించడానికే కేరళీయులు ఈ పండుగను జరుపుకుంటారు.
కేరళీయులకు ఓనమ్ పెద్ద పండుగ. కేరళ ప్రాంతంలో పంటలు ఈ మాసంలోనే ఇంటికి వస్తాయి. అందుకే ఇది పంటల పండుగ కూడా. ఈ పండుగను ఆనందోత్సాహాలతో, కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు.
బలిచక్రవర్తి గాథ
రాక్షసరాజయిన మహాబలి పాలనలో రాజ్యమంతా స్వర్ణయుగంలా ఉండేది. అందుకు కేరళీయులే సాక్ష్యం. రాష్ట్రంలో అందరూ సంతోషంగా, సంపదలతో తులతూగుతుండేవారు. మహాబలికి ఎన్నో మంచి లక్షణాలున్నా, అతనిలో ఒక బలహీనత ఉంది. అదే అతనిలోని అహంకారం. ఆ అహంకారాన్ని అణగదొక్కడానికి దేవతలందరూ పూనుకున్నారు. అదే సమయంలో మహాబలి చేసిన మంచి వల్ల దేవతలు అతనికి ఒక వరం కూడా ఇచ్చారు, అతనితో సన్నిహితంగా ఉండేవారందరినీ ఏడాదికొకమారు కలుసుకోవచ్చన్నది ఆ వరం. అలా మహాబలి తన ప్రజలను కలుసుకోవడానికి వచ్చే రోజే ఓనమ్.
ఓనమ్ పదిరోజుల పాటు జరుగుతుంది. పది రకాలుగా జరుగుతుంది. (1. అత్తం 2.చితిర 3. చోఢీ 4. విశాగం 5. అనిళమ్ 6. త్రికేత 7. మూలమ్ 8. పూరడామ్ 9. ఉత్తరాడమ్ 10. తిరు ఓనమ్).
తిరు ఓనమ్‌తో ఓనమ్ ఉత్సవాలు ముగుస్తాయి. అయితే తిరు ఓనమ్ తరువాత రెండురోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ పండుగలో ప్రధాన అంశం ఈ పది రోజులుగా పూగళమ్ (పూలముగ్గు)లో ఉంచిన బలిచక్రవర్తి ప్రతిమను నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయడం. నిమజ్జనం తరువాత పూగళమ్‌ను తీసేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు.
ఓనమ్ పండుగ ‘చింగామ్’ మాసం ఆరంభంలో వస్తుంది. ఈ మాసం మన తెలుగువారి చైత్రమాసం లాంటిది. అక్కడ ఇది ఆగస్టు - సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. ఈ పండుగకు ప్రత్యేకంగా విందువినోదాలు, జానపద గీతాలు, అద్భుతమైన నృత్యాలు, చిత్రవిచిత్రమైన క్రీడలు, ఏనుగులపై ఊరేగడాలు, పడవ పోటీలు, పూల అలంకరణ... వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
అత్తం రోజున పెద్ద ఊరేగింపు ఉంటుంది. ఆ రోజు నుండి పండుగ వాతావరణం, ఆనందోత్సాహాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పదవరోజైన తిరు ఓనమ్ నాడు అందరూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఈ పదవ రోజునే మహాబలి ఆత్మ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని వీరు విశ్వసిస్తారు.
ఓనమ్ ఉత్సవాలు
ఓనమ్‌లో మరో ముఖ్యమైన ఘట్టం వల్లంకలి, పాము పడవ పోటీలు. పంపా నదిలో ఈ పోటీలు జరుగుతాయి. అందంగా అలంకరించిన ఈ పడవలను వందలమంది పాటలు పాడుతూ నడుపుతూ ఉత్సాహంగా పాల్గొంటారు.
- డా. వైజయంతి