సేవా బాటసారి | One of them is the spirit of March catina Zach bonar | Sakshi
Sakshi News home page

సేవా బాటసారి

Published Thu, Oct 3 2013 11:57 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

సేవా బాటసారి - Sakshi

సేవా బాటసారి

మహాత్ముడు నడిచాడు.. సంపూర్ణస్వరాజ్యం లక్ష్యంగా.. వైఎస్ నడిచాడు.. ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా.. ఇలా చరిత్రలో ‘పాదయాత్ర’లకు ప్రత్యేక  స్థానం ఉంది. ప్రజాసంక్షేమం కోసం, పదిమంది కోసం పాటుపడటానికి ‘పాదయాత్ర’ ఒక స్ఫూర్తి. అలా పాదయాత్ర స్ఫూర్తిని చాటిన వారిలో ఒకడు జాచ్ బోనర్. చారిటీ విషయంలో ఇప్పటికే ఎంతో ఖ్యాతి సంపాదించిన ఈ పదిహేనేళ్ల కుర్రాడి కథ ఇది..
 
ఫ్లోరిడా రాష్ట్రంలోని తంపా ప్రాంతాన్ని 2004లో ఒకసారి భారీ హరికేన్ కుదిపేసింది. తుఫాను తాకిడికి ఆ నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఆరేళ్ల చిన్నారుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ ప్రకృతి విలయాన్ని చూసి జాచ్ కూడా భయపడ్డాడు. అయితే ఆ భయంతో ఇంట్లో దాక్కోలేదు. వాళ్లకు సహాయపడాలని నిర్ణయించుకున్నాడు. తను ఆడుకునే ‘రెడ్ వ్యాగన్’ (చిన్నారులు తోయడానికి అనువుగా ఉండే బండి)తో రంగంలోకి దిగాడు. ఆ బండిలో నీళ్ల క్యాన్‌లను పెట్టుకుని తుఫాను బాధిత ప్రాంతాల వారికి అందించసాగాడు. మరుసటి రోజు జాబ్‌బోనర్ సేవానిరతి గురించి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఏడేళ్ల వయసులో ‘లిటిల్‌రెడ్ వ్యాగన్ ఫౌండేషన్’ను స్థాపించాడు.  దీనితో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అనాథ చిన్నారుల కోసం బోనర్ స్వచ్ఛంద సేవా సంస్థ మొదలు పెట్టాడు.
 
 మలుపు తిప్పిన పాదయాత్ర...
 
 తన లక్ష్యం బాగానే ఉన్నా... ఆ కార్యక్రమాల కోసం బోనర్‌కు నిధుల కొరత ఉంది. సేవాకార్యక్రమాలు చేపట్టాలన్న అతడి ఆదర్శాన్ని నిధుల లేమి అనే వాస్తవం పలకరించింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణను లక్ష్యం చేసుకున్నాడు బోనర్. అందుకోసం ఏదైనా ఒక భారీ కార్యక్రమం చేపట్టాలనుకున్న బోనర్‌కు పాదయాత్ర ఉత్తమమైనదిగా కనిపించింది. అది కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని అనుకుని ‘మై హౌస్ టు ది వైట్‌హౌస్’ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు!  బోనర్ సొంత ఊరు తంపా నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉండే  వైట్‌హౌస్ వరకూ ఉన్న దూరం పన్నెండువందల మైళ్లు.

మూడు విడతలుగా పాదయాత్ర చేశాడు బోనర్. దీంతో ఇతడి పేరు మార్మోగింది. అనాథల సంక్షేమం పాదయాత్ర చేస్తున్న పిల్లాడిగా బోనర్ అమెరికాలో గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే అంతటి సామాజిక స్పృహ ఉండటం చాలా గొప్ప విషయమని అందరూ కీర్తించారు. ఈ పాదయాత్రలో బోనర్‌కు అనేక స్వచ్ఛంద సంస్థలు ఆసరాగా నిలిచాయి. వేలాదిమంది ప్రజలు బోనర్‌కు విషెస్ చెబుతూ గిఫ్ట్ కార్డులు ఇచ్చేవారు. ఈ ప్రయత్నంలో బోనర్ భారీ స్థాయిలో నిధులను సమీకరించగలిగాడు. ప్రస్తుతం బోనర్ స్థాపించిన ‘లిటిల్ రెడ్ వ్యాగన్ ఫౌండేషన్’ దాదాపు 13 లక్షల మంది అనాథలకు ఆశ్రయాన్నిస్తోంది.
 
 అంతటితో ఆగలేదు...
 
  ఇప్పుడు బోనర్ వయసు 16 సంవత్సరాలు. ఆరేళ్ల వయసు నుంచే సేవా ప్రస్థానం మొదలుపెట్టిన ఇతడు పదేళ్ల నుంచి అనునిత్యం ఏదో ఒక సేవాకార్యక్రమంతో వార్తల్లోకి వస్తున్నాడు. ఇటీవలే ‘జాబ్ ఇన్ ఏ బాక్స్’అనే కార్యక్రమంతో అనాథల కోసం ఆహారాన్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాడు.
 
 అవార్డులు... రివార్డులు..
 
 జాచ్‌కు అమెరికాలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. పదేళ్ల వయసులోనే ఇతడు నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ చేతుల మీదుగా ‘వలంటీర్ సర్వీస్ అవార్డు’ను అందుకున్నాడు. అనేక వార్తా సంస్థలు బోనర్‌కు అవార్డులను ఇచ్చాయి. బోనర్ గురించి ప్రత్యేక కథనాలు రాశాయి. ఈ కుర్రాడి స్ఫూర్తితో హాలీవుడ్ లో ‘ది లిటిల్ రెడ్ వ్యాగన్’ అనే సినిమా కూడా వచ్చింది    
 
 - జీవన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement