ఆ అబ్బాయికి మొదటిజీతం ఏం చేయాలో అర్థంకాలేదు. కారణం...ఏదో ఒక మంచి పనికి ఖర్చుపెట్టాలని అతడి కల. తోటి స్నేహితులతో ఆలోచించాడు. పుట్టింది ఖమ్మంలోనైనా ఉద్యోగరీత్యా పునేలో ఉండాల్సివచ్చింది. మంచిపని సొంతూళ్లోనే కాదు ఎక్కడైనా చేయచ్చనుకున్నాడు. స్నేహితుల్ని వెంటబెట్టుకుని పునేలో అనాథపిల్లలుండే భారత సమాజ సేవ కేంద్రానికి వెళ్లాడు. స్కూలుకి వెళ్లడానికి ఇబ్బందిపడుతున్న అనాథవిద్యార్థులకు వ్యాన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆపనితో తన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఆ అబ్బాయి పేరు...శ్రీకళ్యాణ చక్రవర్తి. ప్రస్తుతం ‘సేఫ్ హ్యాండ్స్’ పేరుతో సేవలు చేస్తున్న ఈ యువకుడితో మరో ఆరుగురు చేయి కలిపారు.
ఐదు వేళ్లు...
చేతికి ఐదువేళ్లున్నట్టే సేఫ్ హ్యాండ్స్‌లో కూడా ఐదు విభాగాలున్నాయి. అక్షర, సుహృత, వైద్య, ఉద్దార, ప్రదాత. అక్షర పేరుతో పదో తరగతి పాసైన పేద విద్యార్థుల్ని ఇంటర్ చదివిస్తున్నారు. చదివించడం అంటే ఫీజులు కట్టడం కాదు... వారి వెంటబడి చదివించడం. మంచి మార్కులు వచ్చేవరకూ ఊరుకోరు. ఇంటర్ పూర్తయ్యాక వారికి సేఫ్‌హ్యాండ్స్ తరపున సర్టిఫికెట్ ఇచ్చి స్టూడెంట్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పర్సనల్ కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. సుహృత పేరుతో అనాథపిల్లలకు బట్టలు, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యం కింద ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం, కళ్లద్దాలు, డెంటల్ కిట్‌లు పేదలకు ఇస్తుంటారు.
మూడోది ఉద్దార...మూడేళ్లక్రితం మహబూబ్‌నగర్‌లో వరదతాకిడి వల్ల చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఒక గ్రామాన్ని సేఫ్‌హ్యాండ్స్ దత్తత తీసుకుని పూర్తిగా బాగుచేసింది. చివరిది ప్రదాత. అంధబాలలకు బ్రెయిలీ కిట్‌లు పంచడం దీని లక్ష్యం. ఇలా ఐదు అంశాలపై సేఫ్‌హ్యాండ్స్ నాలుగేళ్ల నుంచి పనిచేస్తోంది.
సంస్థ భాగస్వాములు ఏడుగురే అయినా సభ్యులు నలభైమందివరకూ ఉన్నారు. ఈ సంస్థ ఉండేది ఖమ్మం జిల్లాలో అయినా అవసరాన్ని బట్టి చుట్టుపక్కల జిల్లాల్లో కూడా దృష్టిపెడుతుంది. తమ సంపాదనలో ఒక రూపాయి సమాజంకోసం అంటున్న ఇలాంటి యువకుల సంఖ్య రోజురోజుకీ పెరగాలి.
సంపాదనలో ఒక రూపాయి
Published Sat, Nov 9 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement