ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 24 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్‌లో నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. ఒక్కోసారి ఎంత నొప్పి ఉంటోందంటే దానిపై అస్సలు భారం వేయలేకపోతున్నాను. డాక్టర్‌గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి.
- కృష్ణకుమార్, హైదరాబాద్
ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్-రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో అది భవిష్యత్తులో మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి.
నా వయసు 30 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతంగా ఏదైనా వైకల్యం వస్తుందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- రమేశ్, నిర్మల్
మీ సమస్యను నిశితంగా పరిశీలించినట్లయితే మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,
హైదరాబాద్
బైక్ యాక్సిడెంట్ తరువాత నుంచి మోకాలిలో నొప్పి... తగ్గేదెలా?
Published Mon, Jul 20 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM
Advertisement
Advertisement