
పెయిన్ మేనేజ్‌మెంట్: నొప్పి నూరు విధాల మేలు..!
శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే మొదట కలిగే అనుభూతి నొప్పి. బహుశా... ఓ చిన్నారికి మొదట కలిగే అన్ని అనుభవాల్లో నొప్పే మొదటిదేమో? ఎందుకంటే మాట రాకముందు... బోర్లా పడేటప్పుడో, పారాడే వేళలోనో తగిలించుకునే మొదటి దెబ్బ ఆ చిన్నారికి నొప్పిని నేర్పుతుంది. నొప్పే లేకపోతే మనిషి మనుగడే కష్టమవుతుంది. నొప్పి బాధను అనుభూతించిన అనుభవంతోనే మనిషి కొన్ని ప్రమాదాల నుంచి అనుక్షణం అప్రమత్తంగా ఉంటాడు. ఒకవేళ నొప్పి కలిగితే ఆ అవయవానికి విశ్రాంతినిచ్చి అది కోలుకునేందుకు అవకాశమిస్తాడు. అందుకే నొప్పిని గురించి తెలుసుకోవడం అంటే మన మనుగడ గురించి తెలుసుకోవడమే. అలా తెలుసుకోవడం కోసమే ఈ కథనం.
ఏదైనా గాయమైతే మనకు వెంటనే నొప్పి తెలుస్తుంది. ఇలా నొప్పి కలిగిన వెంటనే మనం ఆ శరీరభాగంతో పనిచేయించకుండా జాగ్రత్తపడతాం. ఒకవేళ పనిచేయించబోయినా ఆ అవయవం నొప్పి కారణంగా సహకరించదు. ఫలితంగా గాయం తగ్గే సమయంలో ఆ అవయవానికి కోలుకోడానికి అవసరమైన విశ్రాంతి దొరుకుతుంది. అలా క్రమంగా గాయం తగ్గుతున్న కొద్దీ నొప్పి కూడా క్రమేణా తగ్గుతూ పోతుంది. ప్రకృతి మన మనుగడ కోసం చేసిన ఏర్పాటిది.
ఎలాంటి నొప్పి అయినా సాధారణంగా వారం నుంచి రెండు వారాల్లో తగ్గిపోతుంది. అంటే ఒక గాయం తగ్గడానికి పట్టే వ్యవధి అదన్నమాట. ఏదైనా అవయవానికి గాయం కాగానే అక్కడి కణాలకూ, కణజాలానికీ దెబ్బ తగిలిందంటూ మెదడుకు సమాచారం వెళ్తుంది. ఆ తర్వాత అదేచోట తగిలే చిన్నచిన్న దెబ్బలకూ లేదా విఘాతాలకూ మళ్లీ నొప్పి తిరగబెడుతుంటుంది. అంటే ఆ అవయవాన్ని జాగ్రత్తగా చూసుకునేలా నొప్పి కలిగించే నరాలు హెచ్చరిక చేస్తుంటాయన్నమాట. ఇలా నొప్పి కలిగించే నరాల కారణంగా మనకు బాధ తెలుస్తుంటుంది. ఒకవేళ ఇలా నొప్పి తెలియకపోతే మనం అదే అవయవం చేత మళ్లీ మళ్లీ పని చేయించి, దాన్ని పూర్తిగా పనికిరాకుండా చేసుకునేందుకు అవకాశం ఉండబట్టే మనకు నొప్పి అనే రక్షణవ్యవస్థను ఏర్పాటుచేసింది ప్రకృతి.
ఒక్కోసారి మనకు కలిగే నొప్పి మనకు మేలుచేయడం కంటే, ఇబ్బందిని, చికాకును కలిగించడం కూడా జరగవచ్చు. ఉదాహరణకు ఒకచోట దెబ్బ తీవ్రత ఎక్కువగా లేదు. అయినా నొప్పి కలుగుతూ ఉంటే... దాన్ని భరించడం కంటే తొలగించుకోవడం మేలు. అందుకు ఉపయోగపడేదే నొప్పి నివారణ చికిత్స.
ఎందుకీ నొప్పి నివారణ చికిత్స...?
నొప్పి కలగాల్సినచోట కలగడం వల్ల ఒక రక్షణ కలుగుతుంది. కానీ అదే నొప్పి అదేపనిగా కొనసాగుతూ పోతే ఎన్నో విలువైన మానవ పనిగంటలు వృథా అవుతాయి. అందుకే పనివేళల్లో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు చాలామంది నొప్పి నివారణ మందులు మింగుతూ, నొప్పి నివారణ చికిత్స ఎవరికి వారు చేసుకుంటుంటారు. కుదరకపోతే డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ చికిత్స తీసుకుంటూ ఉంటారు. నొప్పి నుంచి విముక్తం కావడం అన్నది మనిషి హక్కు.
నొప్పికి ఎలా చికిత్స చేస్తారు?
నొప్పికి చాలారకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా నొప్పి నివారణ మాత్రలు వాడటం అన్నది సర్వసాధారణంగా చాలామంది అవలంబించే ప్రక్రియే. అయితే దీనితో పాటు వేడినీటి కాపడం, చన్నీటి కాపడం (హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్) వంటివీ ప్రకృతిచికిత్సలో భాగంగానూ, చాలా సందర్భాల్లో అల్లోపతిలోనూ చేస్తుంటారు. కొంతమంది ఉప్పును కాచి, గుడ్డలో కట్టి అద్దుతుంటారు. ఇది కూడా ఒక రకమైన హాట్ ప్యాక్ అనుకోవచ్చు. అయితే శాస్త్రవిజ్ఞాన నిరూపితమైన మార్గం ఏమిటంటే... నొప్పికి కారణమైన అంశాన్ని తొలగించడం ద్వారా నొప్పిని శాశ్వతంగా తొలగించవచ్చు. ఇది సురక్షితమైన ప్రక్రియ. ఈలోపు నొప్పిని ఉపశమింపజేయడానికి వాడేవన్నీ తాత్కాలికమైన నొప్పి నివారణ ఔషధాలే. ఇవి దీర్ఘకాలికంగా వాడితే అనేక అంతర్గత అవయవాలకు ముప్పు. అందుకే సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాన్ని విస్మరించి కేవలం నొప్పి నివారణ మందులను వాడుతూ పోతే అది కిడ్నీలను దెబ్బతీయడం, కాలేయానికి విఘాతం కల్పించడం వంటి దుష్పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే నొప్పికి కారణమైన అంశాన్ని కనుగొని, అందుకు అవసరమైన పూర్తి చికిత్స తీసుకోవాలి. ఇదే సురక్షితమైన మార్గం. దీనివల్ల నొప్పి పూర్తిగా తగ్గడం, మళ్లీ రాకుండా ఉండటంతో పాటు జీవన నాణ్యత సైతం పెరుగుతుంది.
నొప్పి నివారణకు తోడ్పడే వైద్య పరీక్షలు / ప్రక్రియలు
శాశ్వత నొప్పి నివారణ కోసం మనం ముందుగా అనుకున్నట్లుగా నొప్పికి కారణమైన అంశాన్ని కనుగొనాలి. అందుకోసం మనకు అనేక వైద్య పరీక్షలు ఉపయోగపడతాయి. అందుకే వాటిని పరోక్షనొప్పి నివారిణులు అనుకోవచ్చు. అందులో ముఖ్యమైనవి... ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటివి. వీటితో పాటు లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ల వంటివి (నొప్పి వచ్చిన చోట అక్కడ స్థానికంగా ఉండే నొప్పిని తెలిపే నరాలను మొద్దుబార్చేలా చేసి నొప్పి తెలియకుండా చేస్తాయి) తాత్కాలిక మార్గాలు.
ఇక శాశ్వతంగా నొప్పి లేకుండా చేయడానికి అనేక మార్గాలున్నాయి. నొప్పిని మెదడుకు చేరవేసి, నొప్పి తెలిసేలా చేసే నరాలను మార్గ మధ్యంలోనే... అంటే అధునాతన ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల సహాయంతో నొప్పిని ఆపేయవచ్చు. ఇక వెన్నెముక వద్దే నొప్పిని తెలిపే సిగ్నళ్లను ఆపేసే ప్రక్రియలూ ఉన్నాయి. ఇంజెక్షన్ల విషయానికి వస్తే నొప్పుల్లోని రకాలను బట్టి వాటి నివారణకు అవసరమైనవి వందల రకాలు అందుబాటులో ఉన్నాయి.
పెయిన్ క్లినిక్స్
ఇప్పుడు తాత్కాలిక, దీర్ఘకాలిక నొప్పి నివారణకు ప్రత్యేకంగా నొప్పి నివారణ క్లినిక్స్ అందుబాటులోకి వచ్చాయి/వస్తున్నాయి. నొప్పిని నియంత్రించేందుకు ప్రత్యేకమైన డాక్టర్లు ఉన్నారు. వీళ్లు నొప్పి నివారణ ప్రక్రియలు / పద్ధతుల్లో దీర్ఘకాలికంగా ప్రత్యేకశిక్షణ పొంది ఉంటారు.
నొప్పి నివారణ జరగాల్సిన తక్షణ అవసరాలు
క్రికెట్ ఆటలో ఎవరైనా గాయపడగానే పరుగుపరుగున శిక్షణ పొందిన నిపుణులు, ఫిజియోలు వచ్చేస్తుంటారు. అంటే ఆటల్లో తగిలే దెబ్బల కారణంగా నొప్పిని తక్షణం నివారించడం అవసరమవుతుంది. అలాగే కొన్నిసందర్భాల్లో ఆటగాళ్లకు దీర్ఘకాలికమైన నొప్పులు కలుగుతుంటాయి. వీటికోసం వారు నొప్పి నివారణ (పెయిన్ మేనేజ్‌మెంట్) స్పెషలిస్టులను సంప్రదిస్తుంటారు. ఇదేగాక ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రకృతి వైపరిత్యాలు, ఉత్పాతాల సమయంలో అత్యవసరంగా చేయాల్సింది నొప్పినివారణే. అందుకు తక్షణం అవసరమయ్యేది నొప్పి నివారణ స్పెషలిస్టులే.
నొప్పి నివారణతో సంబంధం ఉండే ఇతర స్పెషాలిటీస్...
నొప్పి నివారణ మాత్రమే గాక... దీనితో పాటు వైద్య విభాగంలోని మరికొన్ని ప్రత్యేక విభాగాలూ పనిచేయాల్సి ఉంటుంది. అంటే నొప్పిని తగ్గించగానే సరిపోదు. దానికి కారణమైన అంశాన్ని పూర్తిగా నయం చేయాలి. ఇందుకోసం అవసరమైన ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక నైపుణ్యంగల డాక్టర్లు ఆయా బాధ్యతలను నిర్వహిస్తారు. ఇక నొప్పి నివారణ కార్యకలాపాల్లో నొప్పి నివారణ స్పెషలిస్టులతో పాటు అవసరాన్ని బట్టి ఫిజియోథెరపిస్టులు, నొప్పి పూర్తిగా తగ్గాక రోగిలో కలిగిన వైకల్యాన్ని బట్టి అతడికి తగిన వృత్తిని ఎంచుకునేందుకు సహాయపడే ఆక్యుపేషనల్ థెరపిస్టులు, అవసరాన్ని బట్టి సైకాలజిస్టు వంటి వారు పేషెంట్‌కు సహాయపడతారు. నొప్పి త్వరగా తగ్గడానికి అవసరమైన వ్యాయామాలను ఫిజియో థెరపిస్టులు సూచిస్తారు. వారికి అవసరమైన ఆహారాన్ని డైట్ స్పెషలిస్టులు లేదా న్యూట్రిషనిస్టులు చెబుతారు. ఇక నొప్పి నివారణలో భాగంగా జీవనశైలిలో మార్పులు (లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్స్), పనిచేసే చోట నొప్పికి ఆస్కారం లేకుండా అనువైన విధంగా కూర్చోవడం, ఉపకరణాలు, అమరికలను ఎర్గానమిస్టులు సూచిస్తారు. దీనితోపాటు పని పూర్తయ్యాక విశ్రాంతి చర్యలను, ఒత్తిడికి గురికాకుండా ఉండే మార్గాలను (రిలాక్సేషన్ టెక్నిక్స్) సైతం నిపుణులు సూచిస్తుంటారు.
నిర్వహణ: యాసీన్
నొప్పి గురించి కొన్ని విషయాలు...
మీకు తెలుసా...? ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక ఏడాదిలో నొప్పి నివారణ కోసం 100 బిలియన్‌ల (పది వేల కోట్ల) పెయిన్‌కిల్లర్స్ మింగుతారట. వాటిని ఒక లైన్‌లో పేర్చితే 10 లక్షల కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే అలా పేర్చుకుంటూ పోతే చంద్రుడి వరకు వెళ్లి... మళ్లీ వెనక్కు భూమికి చేరుకోవచ్చట.
త లోకంలో ఏ సమయంలోనైనా ప్రపంచ జనాభాలో 20 శాతం మంది ఏదో ఒక నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఇందులో 20 కోట్ల మంది దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మిగతావారు తాత్కాలిక నొప్పులతో ఉంటారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రతిరోజూ దాదాపు పదిలక్షల మంది ఏదో ఒకరకమైన నొప్పితో బాధపడుతుంటారని అంచనా .
కొంతమందిలో కొన్ని జన్యుపరమైన సమస్యల కారణంగా ఎముకలు విరిగినా, గాయాలైనా లేదా అవే గాయాలపై మళ్లీ దెబ్బ తగిలినా నొప్పి తెలియదు. దీనికి కారణం వాళ్లలో నొప్పిని తెలిపే నరాలు క్రియాశీలంగా లేకపోవడమే. పుట్టుకతోనే వచ్చే జన్యుపరమైన ఈ సమస్యను కంజెనిటల్ ఇన్‌సెన్సిటివిటీ టు పెయిన్ అండ్ అన్‌హైడ్రోసిస్ (సిపా) అంటారు. ఇది హెరిడిటరీ సెన్సరీ అటనామిక్ న్యూరోపతి (హెచ్‌ఎస్‌ఏఎన్) అనే నొప్పి తెలియని రుగ్మతల్లో ఒక రకం జంతువులకూ నొప్పి తెలుస్తుంది. అందుకే మన పెంపుడు జంతువులు గాయపడినా లేదా వాటికి కాళ్లు విరిగినా తగిన చికిత్స చేశాక... వైద్యులు వాటికి నొప్పి నివారణ మందులు ఇవ్వరు. ఎందుకంటే... దెబ్బ తగిలిన అవయవానికి తగిన విశ్రాంతిని, జాగ్రత్తను కల్పించాలన్న స్పృహ వాటికి ఉండదు. కాబట్టి నొప్పి తెలియకుండా ఉన్న కాలిని మామూలుగానే ఉపయోగిస్తాయి. అందుకే అవి గాయపడ్డా తగిన చికిత్స చేస్తారు తప్ప, నొప్పి తెలియకుండా ఉండే ఇంజెక్షన్లను ఇవ్వరు.
డాక్టర్ పి. విజయానంద్
పెయిన్ మేనేజ్‌మెంట్ నిపుణులు,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.