రెస్ట్‌ కాదు అరెస్ట్‌..! | rtc drivers and conductors faced problems with rest in amravati | Sakshi
Sakshi News home page

రెస్ట్‌ కాదు అరెస్ట్‌..!

Published Sun, Aug 20 2017 8:36 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

rtc drivers and conductors faced problems with rest in amravati

► ఆర్టీసీ డ్రైవర్ల విశ్రాంతి గదిలో ఉక్కపోత
►  ఏసీలు పని చేస్తున్నా చల్లదనం లేని వైనం
► దూర ప్రాంత డిపోల డ్రైవర్లకు కంటి మీద కునుకు కరువు
►  నిద్ర లేమితో ప్రమాదాలు జరుగుతాయేమోనని ఆందోళన
 
రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. బస్సు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణలు ఇప్పిస్తుంది. ప్రయాణీకుల భద్రత పేరుతో నిధులు ఖర్చు పెడుతుంటుంది. ఇంత  హడావిడి చేసే ఆర్టీసీ అధికారులు విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ (పీఎన్‌బీఎస్‌) లో దూర ప్రాంత సర్వీసుల డ్రైవర్లకు విశ్రాంతి తీసుకునే భాగ్యం మాత్రం కల్పించలేకపోతున్నారు. డ్రైవర్ల కోసం ప్రత్యేక గది ఉన్నా బస్టాండ్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల వారు సేదతీరే అవకాశం లేక నిద్రకు దూరమవుతూ ఆందోళనకు గురవుతున్నారు.
 
సాక్షి, అమరావతి  : విజయవాడ బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం కార్మిక వర్గాలకు ఇబ్బందిగా మారింది. రాజధాని ప్రాంతం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రయాణీకులతో విజయవాడకు చేరుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులను నడిపే డ్రైవర్లకు బస్టాండ్‌లోవిశ్రాంతి తీసుకునే అవకాశం లేక కంటి మీద కునుకు దూరమవుతోంది. డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనేందుకు బస్టాండ్‌లో ప్రత్యేకంగా 120 బెడ్‌లతోకూడిన ప్రత్యేక గది ఏర్పాటు చేశారు.

అందులోపది ఏసీలు బిగించారు. ఆ గదిలో ప్రస్తుతంఏసీలన్నీ పని చేస్తున్నట్లు కన్పిస్తున్నా  చల్లదనం రాక ఉక్కపోతతో ఉడికిపోతోంది. ఉక్కపోతతో డ్రైవర్లు నిద్రపోలేక ఆరుబయటే కూర్చొంటున్నారు. గదిలో ఫ్యాన్లు లేకపోవడంతోపాటు ఏసీల నుంచి కారే నీటితో గదిలో దుర్వాసన వస్తోంది. 
 
నిద్రకు దూరమై..
దూర ప్రాంతాల నుంచి రాత్రంతా ఏకాగ్రతతో సర్వీసును తీసుకొచ్చిన డ్రైవర్లు పగటి సమయంలో విశ్రాంతి తీసుకొని తిరిగి సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతుంటారు. రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి సుమారు వందకు పైగా సర్వీసులు విజయవాడకు చేరుకుంటాయి. రోజుకు కనీసం ఆరు గంటలపాటు డ్రైవర్లకు నిద్ర అవసరం. నిద్రకు దూరమైతే అలసటతో పాటు ఏకాగ్రత కొల్పోయే పరిస్థితి ఉంటుంది. అలా ఏకాగ్రత లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం సూర్యాపేటలో నిలిపి ఉన్న ట్యాంకర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు సురక్షితంగానే ఉన్నా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ అలసటకు గురై ఏకాగ్రత కొల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 
 
అధికారుల నిర్లక్ష్యం..
విజయవాడ పీఎన్‌ బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తుంది. డ్రైవర్ల విశ్రాంతి గదిలో ఏసీలు సక్రమంగా పనిచేయకపోయినా వారు పట్టించుకోరు. పలుమార్లు డ్రైవర్లు ఫిర్యాదులు చేసినా సృందన ఉండదు. గదిలో పది రోజుల కొకసారి కూడా బెడ్‌ షీట్లు మార్చడం లేదు. దీంతో బెడ్‌షీట్లు దుర్వాసన వస్తున్నాయి. వివిధ రుగ్మతలతో బాధపడే డ్రైవర్లు ఉంటారు. వారు వాడిన బెడ్‌షీట్‌నే మరొకరు వాడితే ఇబ్బందిగా ఉంటుంది. ఏసీల నుంచి నీరు కారుతుండడంతో గది అపరిశుభ్రంగా మారింది.
 
ఉక్కపోతతో నిద్ర పట్టడం లేదు..
గదిలో నిద్రపోదామంటే ఉక్కపోత. ఏసీలు పని చేస్తూనే ఉంటాయి కానీ కూలింగ్‌ రాదు. బెడ్‌పై పడుకుంటే నిద్రపట్టక ఆరుబయటే తిరుగుతున్నాం. ఏసీలు పని చేయటం లేదని చాలా సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోరు. రాత్రంతా బస్సును నడిపి అలసిపోయి ఉన్నా విశ్రాంతి లేక ఇబ్బంది పడుతున్నాం.             – ఎన్‌వీ కుమార్, డ్రైవర్, కడప జిల్లా
 
ఆరు బయటే ఉంటున్నాం.. 
గదిలోకి వస్తే నిద్ర రాదు. బెడ్‌ షీట్లు పది రోజులకి ఒకసారి కూడా మార్చడం లేదు. అవి దుమ్ము పట్టిపోయాయి. ఏసీలు పని చేస్తున్నట్లు అన్పిస్తుందే కానీ కూలింగ్‌ రావటం లేదు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదు.
                                                 – ఎస్‌ కె మున్నా, డ్రైవర్, కడప జిల్లా  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement