మండే ఎండలకు యాక్షన్ ప్లాన్
అలర్ట్ జారీ చేస్తే.. పగటి పూట బస్సులు బంద్
పరిశ్రమల్లో కార్మికులకు పగటి వేళ విశ్రాంతి
అన్ని శాఖలను అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రంగా ఉండటంతో వేసవిలో వడగాల్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ప్రజలను అప్రమత్తం చేసే దిశగా సమాయత్తం కావాలని అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత పెరిగితే రాబోయే రెండు, మూడు నెలల్లో వడ దెబ్బ మరణాలు సంభవించే ప్రమాదముందని ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ఇటీవలే రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం సమీక్ష నిర్వహించి అన్ని శాఖలకు కీలక సూచనలు చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదై.. వడ గాల్పుల తీవ్రత పెరిగినట్లుగా సర్కారు హెచ్చరిక జారీ చేస్తే వెంటనే చేపట్టాల్సిన చర్యలను ఆయా విభాగాలకు సూచించింది. - సాక్షి, హైదరాబాద్
- ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే (మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు) వేళలో బస్సులు నడవకుండా ఆర్టీ సీ యాజమాన్యం చర్యలు చేపట్టాలి.
- ట్రాఫిక్ పోలీసులు, టీఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, నిర్మాణ రంగ కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐస్‌ప్యాక్‌లను పంపిణీ చేయాలి.
- పరిశ్రమల్లోని కార్మికులు, కార్యాలయాల్లోని ఉద్యోగుల విధులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మినహాయింపు ఇవ్వాలి.
- పెద్ద బస్టాండ్లు, ప్రయాణ టెర్మినళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలి.
- వడగాల్పులు, వాటితో తలెత్తే దుష్ర్పభావాలు, నివారణ, చికిత్సా విధానం తదితర అంశాలతో ప్రత్యేక అప్లికేషన్‌ను తయారు చేయాలని ఐటీ శాఖకు సూచించింది. ఎండల తీవ్రతను, వాటి వల్ల ఏయే జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విషయాలతో కూడిన సమాచారాన్ని వైద్యం, ఆరోగ్యం, పంచాయతీరాజ్, రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖకు ఎప్పటికప్పుడు అందజేయాలి.
- ఎండ వేడిమి వల్ల సంభవించే వ్యాధులు, రుగ్మతలకు సంబంధించిన సమాచారాన్ని వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ వైద్య శాఖకు సూచించింది.
- పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు ఇతర అన్ని ఆసుపత్రుల్లో డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. వడ దెబ్బకు గురైన వారికి వెంటనే చికిత్స అందించేందుకు ఆసుపత్రులన్నింటా అత్యవసర మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచాలని, ఆరోగ్యాధికారులు వారానికోసారి విధిగా అన్ని ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలి.
- ఆసుపత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న నైట్ షెల్టర్లను ఇప్పట్నుంచీ పగటిపూట కూడా తెరిచే ఉంచాలి. తద్వారా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం కల్పించాలి.
- 104, 108 వాహనాల్లో రోజంతా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్‌లు అందుబాటులో ఉంచాలి. వడగాల్పులపై ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారమిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్లు, జంక్షన్లలో ఐస్ ప్యాక్‌లు, ఎండ నుంచి ఉపశమనాన్నిచ్చే పండ్లు, పదార్థాలను అందుబాటులో ఉంచాలి. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో నీడ కల్పించే ఏర్పాట్లు చేయాలి. ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి.
- పగటి పూట ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా పాఠశాలల ఆవరణను వినియోగించుకోనివ్వాలి. యాజమాన్యాలు అందుకు అనుమతించాలి.
- పశువులు, కోళ్లు మరణించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ రైతులకు అవగాహన కల్పించాలి.