విచ్చలవిడిగా వాడకండి! | Pain killers Do not use loose! | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా వాడకండి!

Published Wed, Jan 4 2017 11:21 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM

విచ్చలవిడిగా వాడకండి! - Sakshi

విచ్చలవిడిగా వాడకండి!

పెయిన్‌ కిల్లర్స్‌

నొప్పి నివారణ మందుల వాడకం చాలా విచ్చలవిడిగా జరుగుతోంది. తక్షణం నొప్పి తగ్గడమే పరమావధిగా వీటిని చాలా ఎక్కువగా వాడేస్తున్నారు. డాక్టర్‌ చీటీ లేకుండానే నొప్పి నివారణ మందులు ఉపయోగించడం పరిపాటి అయ్యింది. అయితే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, డయాబెటిస్‌ వంటి వ్యాధుల తీరుతెన్నుల్లోనూ, ఇన్ఫెక్షియస్‌ జబ్బుల్లోనూ మార్పులు వచ్చాయి. కాబట్టి ముందెప్పుడో డాక్టర్‌ రాసి ఇచ్చిన చీటీలోని మందులనే అదేపనిగా వాడటం సరైనది కాదు. ఎందుకంటే దాని కంటే మెరుగైన డ్రగ్, సైడ్‌ఎఫెక్ట్స్‌ తగ్గిన మందు అందుబాటులోకి వచ్చి ఉండవచ్చు. ఇటీవల ఆర్థరైటిస్, స్పాండిలోసిస్,  ఆస్టియోపోరోసిస్, క్యాన్సర్‌ వంటి మందుల్లో కొత్త రకాలు చాలా వచ్చాయి, వస్తున్నాయి.

అందుకే మునుపు ఎప్పుడో పేర్కొన్న మందులు డాక్టర్లను సంప్రదించకుండా ఆ తర్వాత కూడా మనకు ఉన్న పరిమిత జ్ఞానంతో వాడటం మంచిది కాదు. పైగా ముందునాళ్లలో పోలిస్తే కొత్త మందులు మరింత త్వరితంగా ఉపశమనం ఇవ్వడంతో పాటు చాలా చవకగా కూడా లభ్యమయ్యేలా చేస్తుంటారు మందుల తయారీ నిపుణులు. అందుకే డాక్టర్‌ను సంప్రదించాకే మందులు... మరీ ముఖ్యంగా నొప్పి నివారణ మందులు వాడాల్సి ఉంటుంది.

నొప్పి నివారణకు మందులు వాడే వారిలో సగానికి పైగా మందికి వాటి దుష్ప్రభావాలపై అవగాహనే ఉండదు. మిగతా వారిలో కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తున్నప్పటికీ అవి నొప్పి నివారణ మందుల వల్ల అన్న సంగతి తెలియనే తెలియదన్నది ఒక వాస్తవం.

నొప్పి నివారణ మందులు – దుష్పరిణామాలు : పేరుకు తగినట్లుగానే నొప్పిని నివారించే మందులు వెంటనే ఉపశమనం ఇస్తాయి. అయితే వాటిని కొద్ది మోతాదుల్లోనే వాడాల్సి ఉంటుంది. మోతాదు మించితే అవి శరీరంపై ఎన్నో దుష్పరిణామాలను కలగజేస్తాయి. ఆధునిక చికిత్సకు అవి ఒక వరప్రదాయని అయినా వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అవి పొట్టలోని లోపలి పొరలు మొదలుకొని రక్తనాళాల్లోని లోని పొరల వరకు లోపలివైపునకు ఉండే పొరలు దెబ్బతింటాయి. ప్రధాన రక్తనాళాల చివరన ఉండే సన్నటి నాళాలు, మూత్రపిండాల్లోని అతి సన్నటి నాళాలు దెబ్బతింటాయి. దానికి తోడు కొంతమందిలో వాంతులు, వికారం వంటివి కూడా కనిపిస్తాయి. మామూలుగానైతే కొన్ని యాంటాసిడ్‌ను తీసుకుంటూ నాలుగైదు రోజులు మాత్రమే నొప్పి నివారణ మందులు వాడాలి. అదే క్రమంలో (అంటే కంటిన్యువస్‌గా) అంతకు మించి వాడకూడదు.

మరికొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు
రెండు లేదా మూడు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకునేవారిలో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందులో మూత్రపిండాలకు వచ్చే నెఫ్రోపతి అత్యంత ప్రమాదకరం. మన రక్తంలో రోజువారీ వడపోత సక్రమంగా జరగాలంటే మూత్రపిండాల్లో 30 శాతమైనా సరిగా పనిచేయడం అవసరం. నొప్పి నివారణ మందులు వాడేవారిలో ఈ సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే మూత్రపిండం దెబ్బతిన్నా మళ్లీ మునుపటి సామర్థ్యం పుంజుకుంటుంది. కొంతమందిలో ఇలా మళ్లీ పుంజుకోని వారిలో పరిస్థితి ప్రమాదకరం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా నొప్పి నివారణ మందులతో కిడ్నీ సమస్యలు వచ్చినవారు చాలా ఎక్కువ.  కొందరిలో ఈ మందుల వల్ల అధిక రక్తపోటు వల్ల ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతింటుంది. ఇలాంటివారిలో గుండె పనితీరుపై మరింత ఒత్తిడి పడి గుండెజబ్బులు రావచ్చు.

ఈ మందులు పరిమితికి మించి వాడటం వల్ల కడుపులోని లోపల ఉండే పొరలు దెబ్బతినవచ్చు. ఇలాంటివారిలో కొందరికి మేజర్‌ సర్జరీ కూడా అవసరం కావచ్చు. కొందరిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌పై దుష్ప్రభావం పడి కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.

కొన్ని జాగ్రత్తలు
నొప్పి నివారణ మందులు తప్పనిసరిగా వాడాల్సిన వారు వాటి దుష్పరిణామాలను తగ్గించుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి...
పరగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు.
అవి వేసుకున్న తర్వాత నీరు ఎక్కువగా తాగాలి.
కంటిన్యువస్‌గా వాడాల్సి వస్తే కొన్ని రోజులు వ్యవధి అనంతరం మళ్లీ డాక్టర్‌ సలహా మేరకే వాటిని వాడాలి.
ఇలాంటివి వాడే సమయంలో తరచూ మూత్రపిండాలు, బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement