
శరీర అవయవాలన్నింటికీ ఆక్సిజన్ సరఫరా చేసేందుకు కావాల్సిన రక్తనాళాలను కృత్రిమంగా తయారు చేయడంలో విజయం సాధించారు బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మూలకణాల సాయంతో పరిశోధన శాలలో తయారైన ఈ కృత్రిమ రక్తకణాలు సమీప భవిష్యత్తులో∙గుండెపోటు, కేన్సర్, మధుమేహం వంటి అనేక వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించేందుకు వీలు కల్పిస్తుందని అంచనా. మధుమేహాన్నే ఉదాహరణగా తీసుకుంటే ఈ సమస్య ఉన్న వారి రక్తనాళాలు అసాధారణ రీతిలో మందంగా మారతాయి. దీనివల్ల వాటిద్వారా ఆక్సిజన్, ఇతర పోషకాల ప్రవాహం తగ్గిపోయి సమస్యలు వస్తాయి.
బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు తాము తయారు చేసిన కృత్రిమ రక్తనాళాలను మధుమేహ వ్యాధి లక్షణాలున్న వాతావరణంలో ఉంచినప్పుడు అవి కూడా మందంగా మారాయి. సెక్రెటీస్ అనే ఎంజైమ్‌తో దీన్ని అడ్డుకోవచ్చునని కూడా వీరు గుర్తించారు. ఈ పరిశోధన ఆధారంగా సెక్రటీస్ ఎంజైమ్ ఉత్పత్తిని నియంత్రించే మందులు తయారు చేస్తే మధుమేహానికి చికిత్స కల్పించవచ్చునని ఇప్పటికే గుర్తించారు. ఇతర వ్యాధులను అర్థం చేసుకోవడంలోనూ ఈ కృత్రిమ రక్తనాళాలు ఎంతో ఉపయోగపడతాయని.. మానని గాయాలు.. గుండెజబ్బులు వీటిల్లో ఉంటాయని అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రీనర్ విమ్మర్!