ఫేస్బుక్, ట్విట్టర్ వల్ల ఎన్నో ఉపయోగాలు
న్యూఢిల్లీ: ఇంట్లో పెద్దలు అంటే బామ్మ, తాత ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ను వాడుతున్నారా? సోషల్ మీడియా ద్వారా వారికి ఫ్రెండ్స్ ఉన్నారా? స్మార్ట్ ఫోన్ల ద్వారా చాటింగ్ చేస్తూ, మేసేజింగ్ సర్వీసులను వాడుతున్నారా? దీనివల్లే మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు.
వృద్దాప్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం వల్ల ఒంటరితనం అన్న భావన రాదట. అంతేగాక హైబీపీ, డయాబెటిస్ వంటివాటిని తగ్గించే అవకాశముందని చెబుతున్నారు. వృద్ధులు ఈమెయిల్స్, ట్విట్టర్, ఫేస్బుక్, స్కైప్ వంటి సోషల్ మీడియా టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఆత్మీయులతో మంచి సంబంధాలు కలిగివుంటారని తెలిపారు. సోషల్ మీడియాను వాడటం వల్ల ఒంటరితనాన్ని తగ్గించి, శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుందని అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విలియమ్ చొపిక్ చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పెద్దలు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారని పరిశోధనలో తేలింది. సగటు వయసు 68 ఏళ్ల ఉన్న 591 మంది నెటిజెన్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. టెక్నాలజీ వాడటం సంతృప్తినిస్తోందని ఇందులో 95 శాతంమంది చెప్పారు. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు 72 శాతం మంది తెలిపారు.