పేపర్ ప్లేట్ చేతాళాలు
ఒకే పరిమాణం గల రెండు కాగితపు ప్లేట్లను తీసుకోండి. వాటి మధ్యభాగంలో మూడు అంగుళాల దూరం ఉండేలా రెండు రంధ్రాలు చేయండి. అక్రిలిక్ లేదా పోస్టర్ కలర్స్‌తో ఆరంజ్ లేదా బంగారురంగును పేపర్ ప్లేట్ నిండా పూయాలి. రంగులు ఆరాలి. తరువాత పది అంగుళాల పొడవైన బంగారురంగు రిబ్బన్ ముక్కలను తీసుకుని పేపర్ ప్లేట్ రంధ్రంలోకి దూర్చి లోపలివైపు ముడివేయాలి. ప్లేట్‌ల అంచుల వెంబడి చిన్న నాణాలను లేదా మెటల్ బటన్స్‌ని అతికించాలి. చేతాళాలు సిద్ధమైపోయాయి. ఇక వాయించడం మీ వంతు.
టాంబురైన్
రెండు పేపర్ ప్లేట్లు తీసుకోండి. ఒకేసారి వాటి అంచుల వెంబడి సమానమైన దూరం ఉండేలా నాలుగు లేక ఐదు రంధ్రాలు చేయండి. తరువాత ప్లేట్ వెనుక వైపు మీకు నచ్చిన బొమ్మలు గీసి రంగులు వేయండి. రెండు ప్లేట్ల అంచులను రంగులు వేయని వైపు కలిపి గ్లూతో అతికించండి. తీగకు లేదా దారానికి చిన్నమువ్వను ఎక్కించి ప్లేటు అంచులకు ఉన్న రంధ్రాలకు కట్టాలి. ఇప్పుడు టాంబురైన్‌ని పట్టుకుని చేత్తో ఊపండి. గలగలమంటుంది.
షేకర్స్
రెండు పేపర్ కప్పులు తీసుకోండి. ఒక కప్పు సగం వరకు బియ్యం లేదా ఏవైనా పూసలు, మువ్వలు వేయండి. తరువాత రెండో కప్పును మొదటి కప్పుపై బోర్లించి వాటి అంచులను గ్లూతో అతికించండి. దానిపై పెన్సిల్‌తో బొమ్మలు గీసి రంగులు వేయండి. రెండు పేపర్ రిబ్బన్ ముక్కలు తీసుకుని బొమ్మలో చూపించిన విధంగా అతికించండి. ఇవి ఆడుకోవడానికే..