సాక్షి, అమరావతి: ‘పేపర్ కప్పుల్లో వేడివేడి టీ, కాఫీ, సూప్‌లు తీసుకుంటే హానికరం’ అని ఇటీవల సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. దీనిని కొందరు కొట్టిపారేస్తుంటే మరికొందరు గాజు, స్టీలు, పింగాణీ పాత్రలే ముద్దంటున్నారు. మన దేశంలో ఏటా 22 బిలియన్ (2,200 కోట్లు) పేపర్ కప్పులను వాడుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజానిజాల్లోకి వెళితే.. కాఫీలు, టీలు తాగేందుకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో పేపర్ కప్పుల వాడకం ఎక్కువైంది.
ఈ నేపథ్యంలో 70 – 80 డిగ్రీల వేడిగల ద్రవాలు, పదార్థాలు పేపర్ కప్పుల్లో పోసినప్పుడు దాని లోపల అతికించేందుకు పూత పూసిన ‘మైక్రోప్లాస్టిక్’ పొర కరిగిపోయి ద్రవాలతో కలిసిపోతున్నట్టు ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ సుధా గోయెల్ బృందం వెల్లడించింది. ఆ వేడి ద్రవాన్ని ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్‌తో పరిశీలించగా 15 నిమిషాల్లో గ్లాసులోని మైక్రో ప్లాస్టిక్ పొర కరిగిపోయినట్లు గుర్తించారు. 100 ఎంఎల్ గ్లాసులోని పొర 25,000 మైక్రో ప్లాస్టిక్ కణాలను విడుదల చేసింది. ఈ పొరలో ప్లాస్టిక్ అయాన్లు, జింక్, మాంగనీస్, నికెల్, కాపర్, లెడ్, కాడ్మియం, క్రోమియం, పల్లాడియం లాంటి భార లోహాలను గుర్తించారు.
మైక్రోప్లాస్టిక్ కణాలతో క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ కాకపోయినా, దీర్ఘకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, వివిధ అవయవాలకు పక్షవాతం సోకడం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బ తినడం లాంటి దు్రష్ఫభావాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 15 నిమిషాల్లో 25 వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నపుడు.. నాలుగైదు నిమి షాల్లో తాగేస్తే పోలా! అన్న వారూ ఉ న్నారు. అలా చేస్తే పెద్దగా హాని ఉండకపోవచ్చు కానీ, ఎంతో కొంత మేర మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయన్నది వాస్తవం.
భారత్‌లో రెట్టింపు వేగంతో..
అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనా సంస్థ ఐమార్క్ గ్రూప్ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచ వ్యాప్తంగా 263.80 బిలియన్ల పేపర్ కప్పులు వినియోగించారు. 2028 నాటికి ఇది 283.22 బిలియన్లకు చేరుతుందని అంచనా. 2022లో మన దేశంలో 22 బిలియన్ పేపర్ కప్పులు వినియోగించగా 2028 నాటికి 25.7 బిలియన్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం ఏటా 1.11 శాతం పెరుగుతుండగా భారత్‌లో పెరుగుదల 2.5 శాతంగా ఉంది.
పునరుత్పత్తి వ్యవస్థకు చేటు
నిత్యం పేపర్ కప్పుల్లో వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. వాటిల్లోని మైక్రోప్లాస్టిక్ పొర కరిగిపోయి ద్రవాలతోపాటు శరీరంలోకి చేరుతుంది. మైక్రోప్లాస్టిక్ పునరుత్పత్తి వ్యవస్థకు చేటు చేస్తుంది.
– డాక్టర్ భరణి ధరణ్, ఎన్‌ఐటీ–ఏపీఅసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ విభాగం హెచ్‌వోడీ
నరాలపై దుష్ప్రభావం
చాలా స్వల్ప పరిమాణంలో ఉండే మైక్రో ప్లాస్టిక్ కణాలు నరాలు, రక్తం ద్వారా ప్రయాణించి శరీర భాగాల్లోకి చేరుతాయి. అలా చేరే క్రమంలో అవి ఎక్కడో ఒకచోట పేరుకుపోవడంతో ఆ అవయవం దెబ్బ తింటుంది. నరాల వ్యవస్థను దెబ్బతీసి పక్షవాతానికి కారణమయ్యేలా చేస్తుంది. పురుషుల్లో వంధ్యత్వ సమస్యలకు ఇవి కూడా ఒక కారణం.
– డాక్టర్ కంచర్ల సుధాకర్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, విజయవాడ.
Comments
Please login to add a commentAdd a comment