పిల్లల కలల్నే పెద్దలూ కనాలి | Parents 'are chasing lost dreams' trying to make their children succeed | Sakshi
Sakshi News home page

పిల్లల కలల్నే పెద్దలూ కనాలి

Published Sun, Nov 24 2013 10:56 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Parents 'are chasing lost dreams' trying to make their children succeed

తల్లి లీగల్ ఎక్స్‌పర్ట్. తండ్రి వ్యవసాయం.
 పెద్దబ్బాయ్ బీకాం కంప్యూటర్స్. చిన్నబ్బాయ్ ఎం.ఎస్
 అమ్మాయి మధుశాలిని!
 అదేంటి?! మధుశాలిని అన్నది పేరు కదా,
 క్వాలిఫికేషన్‌లా చెప్పారు!
 అవును. పేరే పెద్ద క్వాలిఫికేషన్.
 మధు ఫైన్ ఆర్ట్స్ చేశారు. కూచిపూడి నేర్చుకున్నారు.
 బొమ్మలు వేశారు. ఫ్యాషన్ మోడలింగ్ చేశారు.
 ప్రస్తుతం... తెలిసిందే, సినిమాల్లో నటిస్తున్నారు.
 తండ్రి మొక్కల పెంపకంలో మునిగిపోయారు కాబట్టి
 పిల్లల పెంపకమంతా తల్లి రాజకుమారే తీసుకున్నారు.
 ముఖ్యంగా ఆడపిల్ల పెంపకం!
 సెట్స్‌లో ఇప్పుడు కూతురికి తోడుగా ఉంటున్నట్లే...
 బాల్యం నుంచీ ప్రతి అడుగులోనూ తనకు
 తోడుగా ఉన్నారు రాజకుమారి.
 ‘‘పిల్లల్ని కంటాం. తర్వాత వారి కెరియర్ గురించి
 కలలు కంటాం. తప్పు లేదు కానీ,
 పిల్లల కలలు వేరేగా ఉన్నప్పుడు వారు కోరుకున్నదే
 చెయ్యనివ్వడం పెద్దల బాధ్యత’’ అంటారు రాజకుమారి.
 ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కూతురికి
 ఆమె చేసిన దిశానిర్దేశమే ఈవారం ‘లాలిపాఠం’.

 
 తల్లిదండ్రులు... పిల్లల కెరీర్‌ను మలచగలరు కానీ నిర్ణయించలేరు అంటారు సినీనటి మధుశాలిని తల్లి రాజకుమారి. ‘‘మాకు ఫలానా ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి ఆ కోర్సునే చదవండి అని ఒత్తిడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. మా అమ్మాయి ఎనిమిదవ తరగతిలోనే ‘మెడిసిన్, ఇంజినీరింగ్ వద్దు, నాకు ఫైన్ ఆర్ట్స్ ఇష్టం’ అని చెప్పేసింది. పెద్దబ్బాయి ప్రదీప్ చంద్ర బీకామ్ కంప్యూటర్స్ చేశాడు. చిన్నబ్బాయి శరత్‌చంద్ర న్యూజిలాండ్‌లో ఎం.ఎస్ చదువుతున్నాడు. నేను లాయర్‌గా ఫ్యామిలీ కోర్టు కేసులు చూసేదాన్ని.చాలామంది ‘మేము పిల్లలందరినీ ఒకేలాగ పెంచాం, అందరూ బాగున్నారు, వీడే ఇలాగయ్యాడు’ అంటుంటారు. నిజానికి పిల్లలందరినీ ఒకేలా పెంచడం సాధ్యం కాదు. పిల్లలందరూ ఒకలా ఉండరు, ఒకరికి సున్నితంగా, ఒకరికి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. లక్షణాలను బట్టి వ్యవహరించాలి’’ అంటారామె.
 
 పిల్లల బాల్యం అంతా నేనే!!
 
 ‘‘మావారు వ్యవసాయం చూసుకుంటూ ఎక్కువగా జహీరాబాద్‌లోనే ఉంటారు. పిల్లలతో నేను హైదరాబాద్‌లో ఉండాల్సి రావడంతో మా పిల్లల బాల్యం అంతా నేనే కనిపిస్తాను. మధు విషయానికి వస్తే తను చిన్నప్పటి నుంచి దుస్తులను భుజం మీద వేసుకుని, నడుముకు చుట్టుకుని అద్దంలో చూసుకుంటూ ర్యాంప్ మీద నడుస్తున్నట్లు ఫీలవుతూ క్యాట్‌వాక్ చేసేది. ఫ్యామిలీ ఫొటోలు తీసుకుంటున్నప్పుడు కూడా తను వైవిధ్యమైన పోజులిచ్చేది. ఇవన్నీ చూసినప్పుడు మా అన్నయ్య సరదాగా ‘మధు మోడల్ అవుతుంది’ అనేవాడు. అయితే మధు తాను మోడలింగ్ చేస్తానన్నప్పుడు మాత్రం ఇల్లంతా ఒక్కసారిగా ‘మోడలింగ్.. ఆ!’ అని ఉలిక్కిపడింది. మన ఇంట్లో ఎవరైనా ఈ ఫీల్డులో ఉన్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.
 
 మధు ఇష్టమే మా వారి ఇష్టం!
 
 మాది మతాంతర వివాహం. మా వారు హమీద్ ఎవరినీ నొప్పించే మనిషి కాదు. మేమిద్దరం పరస్పర వైవిధ్యమైన నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లం కావడంతో మొదట్లోనే ఒక అవగాహనకు వచ్చేశాం. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడం, ఒకరి పర్సనల్ స్పేస్‌ని మరొకరు ప్రభావితం చేయకపోవడం వంటి పరిణితి వచ్చేసింది. ఆయనైతే మధు ఇష్టాల దగ్గరికి వచ్చేటప్పటికి సంప్రదాయ పరిధులను అతిక్రమించడానికి కూడా సిద్ధమయ్యారు. మోడలింగ్ రంగాన్ని ఎంచుకోవడం, సినిమారంగ ప్రవేశం, వస్త్రధారణ వంటి అనేక విషయాల్లో ఆయన ఒక్కటొక్కటిగా తనను తాను సడలించుకుంటూ వచ్చారు. దేనికీ నో చెప్పేవారు కాదు.
 
 నటన హాబీ కాదు వృత్తి!
 
 నాకు మాత్రం మధుని కూచిపూడి డాన్సర్‌ని చేయాలని ఉండేది, నేర్పించాను కూడ. పెద్దయిన తర్వాత మధు సల్సా కూడా ప్రాక్టీస్ చేసింది. మోడల్‌గా ఫ్యాషన్ షోలు చేసింది. ఒకసారి మ్యాగజీన్ కవర్ పేజీ మీద మధు ఫొటో చూసిన ఇవివి సత్యనారాయణగారు ‘కితకితలు’ సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారు. సినిమాలో చేయడమా మానడమా అనే డైలమా ఇంట్లో. తనకేమో సినిమాల్లో చేయాలని ఉంది. అప్పుడు మేమంతా తనకి కౌన్సెలింగ్ ఇచ్చాం. ‘ఇది హాబీలా చేసేది కాదు, ప్రొఫెషనల్‌గా ఉండాలి. పైగా సినిమా రంగంలో చాలా సులభంగా గాసిప్స్ పుడతాయి. వాటికి తట్టుకుని నిలబడగలగాలి. వాటిని ఎంత వరకు స్వీకరించాలో అంతవరకే తీసుకోవాలి. ప్రతి విషయానికీ అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పనిలేదు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా దానికి మొదటగా నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటూ ఆ తర్వాత కుటుంబానికి వివరిస్తే చాలు’ అని చెప్పాం.
 
 నీ స్థానంలో నేనే ఉంటే...
 
 మధు నిర్ణయం తీసుకునే ముందు చాలా విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తుంది. తనకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తమిళ ‘అవన్ - ఇవన్’ (తెలుగులో వాడు-వీడు) సినిమా విషయంలో ఎదురైంది. ఆ సినిమాకి కథాపరంగా హీరోయిన్ కొన్ని సీన్లలో గుండుతో కనిపించాలి. ఆ సినిమా కోసం గుండు చేయించుకుంటే మళ్లీ జుట్టు వచ్చే వరకు ఇతర ప్రాజెక్టులేవీ చేయడానికి వీలుకాదని ఆలోచనలో పడింది. అప్పుడు నేను ‘నీ స్థానంలో నేను ఉంటే గుండు గురించి ఆలోచించను, వెంటనే అంగీకరిస్తాను’ అనే ఒక్కమాటనే అన్నాను. తను వెంటనే ఓకే చెప్పింది. తర్వాత కథలో కొద్ది మార్పుల కారణంగా గుండు చేయించుకోవాల్సిన అవసరమే రాలేదు.మధు సినిమారంగంలో అడుగుపెట్టినప్పుడు మరీ చిన్నపిల్ల. అందుకే మధుకి తోడుగా వెళ్తుండేదాన్ని’’ అన్నారు రాజకుమారి.
 
 కళల కుటుంబమే కానీ...
 
  ‘‘కళారంగం మాకు కొత్తకాదు, కానీ సినిమా అంటే వచ్చే గుర్తింపు వేరు. మధు నటిగా మారిన తర్వాత మా చిన్నబ్బాయి ఫ్రెండ్స్ వచ్చి ఆటోగ్రాఫ్ అడిగేవారు. మా వాడు మాత్రం ‘అక్కా! నిన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారేంటి’ అని ఆశ్చర్యపోయేవాడు’’ అన్నారామె.
 
 ‘పిల్లలు తప్పుదారి పడతారేమో అనే సందేహం వచ్చినప్పుడు కొన్ని ఉదాహరణలతో ప్రమాదాలను వివరిస్తాను, అంతకు మించి వాళ్ల పర్సనల్ స్పేస్‌లోకి చొరపడను. పిల్లల ఫోన్ నా దగ్గరే ఉన్నా వాళ్లకు ఎవరి నుంచికాల్స్ వచ్చాయి, ఏ మెసేజ్‌లు ఉన్నాయని చూడను. మధు మూడీగా ఉంటే మా పెద్దబ్బాయి పసిగట్టేస్తాడు. మధు టెన్షన్ పడుతోంది, ఏంటో అడుగు అని పురమాయిస్తాడు’ అంటున్నప్పుడు రాజకుమారి ముఖంలో తల్లిగా గెలిచాననే తృప్తి కనిపించింది.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 
 మధుశాలిని నటించిన చిత్రాలు
 అందరివాడు, నా ప్రాణం కంటే ఎక్కువ, నాయకుడు, కితకితలు,
 ఒక విచిత్రం, ఆగంతకుడు, స్టేట్ రౌడీ.


 పళనియప్ప కల్లూరి (తమిళం), కింగ్, పాత్తినారు (తమిళం), కారాలు మిరియాలు, అవన్ ఇవన్ (తమిళం), డిపార్ట్‌మెంట్ (హిందీ), నాగవల్లి (కన్నడం), భూత్ రిటర్న్ (హిందీ), పొగ, హ్యాపీ జర్నీ, సత్య 2.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement